మేడిగడ్డలో మునిగేదెవరు?
రూ.80 వేల కోట్లు ఏటిపాలైనట్టేనా.. మేడిగడ్డ బరాజ్ ను తిరిగి కట్టాల్సిందేనా.. కాంగ్రెస్ మంత్రులు చెప్పిందిందేనా..
ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఇప్పటి వరుకు ఖర్చు చేసిన రూ.80 వేల కోట్లకు పైచిలుకు గంగలో పోసినట్టేనా.. మొత్తం ఈ ప్రాజెక్ట్ డిజైన్ మార్చాల్సిన అవసరం ఉందా.. అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
“ఆనాడు 38 వెల కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు 18 లక్షల ఎకరాల కు 80 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇవాళ బ్యారేజీ కుంగిపోవడంతో ఆ నిధులన్నీ వృధా అయినట్టే కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహరంపై విచారణకు ఆదేశించబోతున్నాం” అని అన్నారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ బరాజ్ వద్ద కుంగిన పిల్లర్లను రాష్ట్ర మంత్రుల బృందం ఇవాళ తనికీ చేసింది. గత ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ అభిప్రాయం ఒకటే. 38 వేల కోట్ల రూపాయలతో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం ఆనాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం జరిగింది. కానీ ప్రభుత్వం మారడం వల్ల ప్లాన్ మారింది. మేడిగడ్డ దగ్గర నిర్మాణం జరిగింది. ‘ఒక బ్యారేజ్ తుమ్మిడి హాట్టి దగ్గర అనుకున్నాం కానీ.. అన్నారం, సుందిల్ల.. ఇలా ఎక్కువ ప్రాజెక్ట్ లు నిర్మించడం వల్ల వ్యయం పెరిగింది’ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అనేది ఉత్తిమాటేనా...
ప్రపంచం లోనే అతి పెద్ద ప్రాజెక్టు అని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతూ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది నిజం కాదని చెబుతోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు మేడిగడ్డ డ్యామేజ్ అయింది. 8 వరకు పిల్లర్లు కుంగాయి. అక్టోబర్ 21న ప్రాజెక్టు వద్ద పెద్ద శబ్దంతో పిల్లర్లు కుంగాయి. కానీ ఆనాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏ విషయం చెప్పలేదు. ఎక్కడ రివ్యూ చేయలేదు. కనీసం స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తదితరులు పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ కుంగుబాటు అని ఆరోపించారు. ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు మొత్తం విషయంపై జ్యుడిషియల్ విచారణ చేపడతాం అని చెప్పారు. ఇప్పుడు మంత్రులు తనికీ చేసి అదే విషయాన్ని చెబుతున్నారు. అన్ని విషయాలను ఈవేళ మంత్రుల బృందం క్షుణ్ణంగా తెలుసుకుంది. అధికారులతో రివ్యూ తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పింది.
లక్షన్న కోట్లకు పెరిగిన వ్యయం...
కేంద్ర జల సంఘం- CWC ఆవేళ అప్రువల్ చేసింది రూ. 80 వేల కోట్లు కానీ ఇప్పుడు అది లక్షన్నర కోట్లకు పెరిగింది. 38 వేల కోట్లు ప్రాజెక్ట్ కు ఇప్పటి వరకు సుమారు 95 వేల కోట్ల రూపాయల వరకు వ్యయం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ మంత్రులు మండిపడుతున్నారు. కంట్రోల్ ఆడిట్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడిగడ్డ ఒక్కటే కాదు అన్నారం వద్ద కూడా నష్టం జరిగిందని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మూడు బ్యారేజీల రిపేర్‌కు అయ్యే ఖర్చు ప్రజల మీద భారమే అవుతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బు మొత్తం వృధా. పైగా ప్రజలపైన వడ్డీల భారం పడనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జ్యుడీషియల్ విచారణ చేయబోతున్నాం. ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపం జరిగింది. డిజైన్ , నిర్మాణం ఫెయిల్ అయ్యాయి. ENC మరోసారి రిటన్‌గా నివేదిక ఇవ్వాలి. తుమ్మిడిహట్టి మరోసారి రీడిజైన్ చేయబోతున్నాం. మాకు తుమ్మిడిహట్టి మీద పూర్తి అవగాహన ఉంది” అన్నారు మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి.
ఇదే నిజమైతే ఎవరు బాధ్యత వహిస్తారు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల కావడం లేదు. రాష్ట్ర బడ్జెట్ తో సమానమైన నిధులు ఏటి పాలయ్యాయని మంత్రులే చెబుతున్నప్పుడు ఇందుకు ఎవర్ని బాధ్యుల్ని చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. అధికారులను బాధ్యులను చేస్తారా లేక ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు బాధ్యత వహిస్తారా అనే చర్చ సాగుతోంది. దర్యాప్తు జరిగితే గాని ఏ విషయమూ బయటికి రాదు. బాంబు దాడులను తట్టుకునే విధంగా ప్రాజెక్టులను నిర్మించామని గత ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ఏమైనట్టు.. అదే నిజమైతే మేడిగడ్డ బ్యారేజ్ బాంబు దాడి వల్ల డ్యామేజ్ అయిందని భావించాలా, ఇరిగేషన్ శాఖలో 8 నుంచి 9 వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి, మరి వాటిని ఎవరు చెల్లిస్తారు.. ఇలా సవాలక్ష సందేహాలు మేడిగడ్డ బరాజ్ చుట్టూ ముసురుకున్నాయి. సమగ్ర దర్యాప్తు చేస్తే అసలు విషయమేమిటో ప్రజలకు తెలిసే అవకాశం లేదు.