KTR | అదానీ వ్యవహారంలో కెన్యా చేసిన ధైర్యం తెలంగాణ చేయలేకపోతోందా..!

రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే అదానీతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటీ రద్దు చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Update: 2024-11-22 09:41 GMT

గౌతమ్ అదానీ (Gautam Adani) వ్యవహారంపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో అతి చిన్న దేశమైన కెన్యా(Kenya) చేసిన ధైర్యం తెలంగాణలోని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం చేయలేకపోతోందా అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లు సొంతం చేసుకోవడం కోసం అదానీ లంచాలు ఇచ్చారన్న అభియోగాలు వెల్లడైన అతి తక్కువ సమయంలోనే కెన్యా అన్ని ఒప్పందాలు రద్దు చేసిందుకుందని తెలిపారు. అన్ని రంగాల్లో అదానీ గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందాలు అన్నింటినీ కెన్యా రద్దు చేసుకుందని, కానీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం స్తబ్దుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ గజ దొంగ అని మహారాష్ట్ర అంటున్న రేవంత్(Revanth Reddy).. తెలంగాణలో మాత్రం అదే అదానీకి గజమాల ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో కాంగ్రెస్ అధిష్టానానికి కూడా వాటా ఉందా అని ప్రశ్నించారు. అందుకే మంత్రివర్గ విస్తరణకు నో చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం.. అదానీ విషయంపై నోరు విప్పడం లేదా అని నిలదీశారు. కాంగ్రెస్ పెద్దలకు తెలియకుండానే తెలంగాణలో ఒప్పందాలు జరిగాయా? అన్న అనుమానాన్ని లేవనెత్తారు. ప్రతి రోజూ అదానీపై అంతెత్తున విమర్శలు చేసే రాహుల్.. తెలంగాణలో పెట్టుబడులపై ఎందుకు నోరుమెదపడం లేదు? అంటే ఈ పెట్టుబడులను రాహుల్ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

తెలంగాణలో పదేళ్ల పాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ఒక్కసారి కూడా అదానీకి అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు కేటీఆర్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే దాదాపు రూ.12,400 కోట్ల ప్రాజెక్ట్‌లను అదానీ చేతికి అందించారని దుయ్యబట్టారు. బడేభాయ్(మోదీ) ఆదేశాలనే చోటేభాయ్(రేవంత్) శిరసావహించారని విమర్శించారు. ఢిల్లీలో ఒక నీతి.. గల్లీలో ఒక నీతి అన్న విధంగా కాంగ్రెస్ వైఖరి ఉందని అన్నారు. హైదరాబాద్‌లోని కోహినూర్ హోటల్‌లో మంత్రి పొంగులేటి, అదానీ రహస్యంగా సమావేశమయ్యారని, సీఎం ఇంట్లో కూడా అదానీ దాదాపు నాలుగు గంటల పాటు సమావేశయ్యారని, ఈ సమావేశాల్లో ప్రాజెక్ట్‌ల గురించి చర్చించారో, వాటికి ఇస్తానన్న లంచాల గురించి చర్చించారో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు.

అదానీ వ్యాపార సామ్రాజాన్ని విస్తరించడానికి సీఎం రేవంత్ రెడ్డి తన చేతనైంత సాయం చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. అదానీ అవినీతి అమెరికా నుంచి ఆఫ్రికా వరకు విస్తరించిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా ఇదే తరహాలో లంచాలు ఇచ్చే అదానీ ప్రాజెక్ట్‌లు పట్టారన్న అనుమానాలు కలుగుతున్నాయని, వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం ఇచ్చారని, కానీ మరోవైపు వ్యాపారవేత్తలు రూ.40వేల కోట్ల విరాళాలు ఉచితంగా ఇవ్వరని రాహుల్ అంటున్నారని విమర్శలు చేశారు. జాతీయ పార్టీకి ఒక విధానం అనేది ఉండాలి, జాతీయ పార్టీ అయినా రాష్ట్రానికో విధానం పాటిస్తే సబబు కాదని సూచించారు. ‘‘అదానీ వ్యవహారం బయటపడిన గంటల వ్యవధిలోనే అతనితో చేసుకున్న అన్ని ఒప్పందాలను కెన్యా రద్దు చేసుకుంది. కానీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎందుకని ఒక నిర్ణయం తీసుకోవట్లేదు? రాహుల్‌కి చిత్తశుద్ధి ఉంటే అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయించాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News