చంద్రబాబు ఎందుకు దూరంగా ఉండిపోయారు ?
సమావేశాలకు చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లాంటి ప్రముఖులు దూరంగా ఉండిపోయారు.
ఈ విషయమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విషయమేమిటంటే కమ్మ గ్లోబల్ ఫెడరషన్ ఆధ్వర్యంలో భారీఎత్తున మీటింగ్ జరుగుతోంది. రెండురోజుల అంతర్జాతీయ కమ్మ ఫెడరేషన్ సమావేశాలు శనివారం హైటెక్ సిటీలో మొదలైంది. దేశ, విదేశాల నుండి కమ్మ సామాజికవర్గంలో వివిధ రంగాల్లోని ప్రముఖులందరినీ పేరుపేరునా నిర్వాహకులు ఆహ్వానించారు. అయితే ఈ సమావేశాలకు చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లాంటి ప్రముఖులు దూరంగా ఉండిపోయారు. వీళ్ళే కాకుండా సినిమారంగంలోని చాలామంది ప్రముఖులు సమావేశంలో కనబడలేదు.
సమావేశాలు ఏర్పాటుచేసిన కేజీఎఫ్ కమిటి పైన చెప్పిన ప్రముఖులంతా వస్తారని అనుకున్నారు. అయితే వివిధ కారణాలతో చాలామంది సమావేశాలకు దూరంగా ఉండిపోయారు. ముఖ్యఅతిధిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కమ్మ సామాజికవర్గంతో తనకున్న సంబంధాలు, బంధాలను గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎదగటానికి తెలుగుదేశంపార్టీ తనకు ఏ విధంగా ఉపయోగపడిందో చెప్పుకున్నారు. తప్పులేదు మూలాలను మరచిపోకుండా, ఎదుగుదలకు కారణమైన వ్యక్తులు లేదా పార్టీని గుర్తుంచుకోవటం మంచిదే. జాతీయస్ధాయిలో రాజకీయంగా ప్రముఖులుగాను, చక్రంతిప్పిన ఎన్టీయార్, వెంకయ్యనాయుడు, ఎన్జీ రంగా తర్వాత మళ్ళీ ఆ స్ధాయిలో సామాజికవర్గం నుండి ఎవరూ లేరని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు పాత్రను రేవంత్ ప్రస్తావించారు. కమ్మ సామాజికవర్గంతో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు.
కమ్మ సామాజికవర్గం నుండి జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పగలిగినంత స్ధాయిలో నేతలు ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు కేజీఎఫ్ వ్యవస్ధాపక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ మాట్లాడుతు తమ సామాజికవర్గం గొప్పతనాన్ని వివరించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముత్యాల సంస్ధానం రాజు శ్రీ రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ (ముత్యాల రాజు) ఇచ్చిన రు. 52 లక్షల విరాళాన్ని, దానంచేసిన 5 వేల ఎకరాల గురించి గొప్పగా చెప్పారు. కుసుమ చెప్పిందాంట్లో తప్పేమీలేదు. ప్రజాశ్రేయస్సును కాంక్షించి సమాజాభివృద్ధికి తోడ్పడిన వారిని ఏ రంగంలో ఉన్నాసరే కుల, మతాలకు అతీతంగా స్మరించుకోవటం చాలా మంచి విషయమే.
అయితే అందరినీ ఆశ్చర్యపరిచింది ఏమిటంటే కమ్మ సామాజికవర్గంలో అత్యంత ప్రముఖులుగా ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ సమావేశాలకు హాజరుకాలేదు. వీళ్ళతో పాటు సినిమారంగానికి చెందిన చాలామంది సామాజికవర్గంలోని ప్రముఖులు ఆదివారం సమావేశానికి హాజరుకాలేదు. సోమవారం సమావేశానికి అశ్వనీదత్, రాజేంద్రప్రసాద్, శ్రీలీల లాంటి కొందరు హజరవుతారని సమాచారం. మధ్యాహ్నం లంచ్ తర్వాత సినిమా రంగం అభివృద్ధి అనే అంశంమీద చర్చా కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో కొందరు పాల్గొనవచ్చని సమాచారం. రెండు రోజుల సమావేశాలకు మొదటినుండి మురళీమోహన్ లాంటి చాలాకొద్దిమంది యాక్టివ్ గా ఉన్నారు. టీడీపీ తరపున ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాస్ లాంటి ముగ్గురు, నలుగురు ఎంఎల్ఏలు మాత్రమే పాల్గొన్నారు.
మొత్తానికి రెండురోజుల కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశాలకు హాజరవుతారని అనుకున్న అత్యంత ప్రముఖులు గైర్హాజరవ్వటం ఆశ్చర్యంగానే ఉంది. ప్రజాజీవితంలో ఉన్న తాము కులసంఘం సమావేశానికి హాజరైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు, బాలయ్య, లోకేష్ తో పాటు చాలామంది హాజరుకాలేదని సమాచారం. అప్పటికీ చంద్రబాబు, వెంకయ్య, బాలయ్య, లోకేష్ లాంటి ప్రముఖులను ఫెడరేషన్ ప్రముఖులు వ్యక్తిగతంగా కలిసి సమావేశాలకు ఆహ్వానించినా హాజరుకాలేదు. ఫెడరేషన్ బలోపేతానికి, సామాజికవర్గానికి అవసరమైన అండదండలను తెరవెనుక నుండి అందిస్తామని ప్రముఖులు హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకనే రెండు రోజుల సమావేశాల్లో సామాజికవర్గంలో అత్యంత ప్రముఖులుగా ఉన్న వాళ్ళు కనబడలేదు.