కేటీఆర్, హరీష్ రావు భేటీ వెనక మతలబు ఏంటో..!

కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు.;

Update: 2025-05-16 13:46 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం భేటీ అయ్యారు. హరీస్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ సమావేశమయ్యారు. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని, ఆయన పార్టీ మారేందుకు చూస్తున్నారని వార్తలు వస్తున్న క్రమంలో అకస్మాత్తుగా వీరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఫంక్షన్ ఉన్నా హరీష్ రావు ఇంటికి వెళ్లని కేటీఆర్ ఈసారి ఏ అంశాలపై చర్చించడానికి అంత సడెన్‌గా ఆయన ఇంటికి వెళ్లారు? అన్న చర్చలు జరుగుతున్నాయి. అయితే హరీష్ రావు తండ్రి అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆయనను కలవడానికి, హరీష్ రావుకు ధైర్యం చెప్పడానికే కేటీఆర్ వెళ్లారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో అనేక అంశాలపై వారు చర్చించుకున్నారని, పార్టీ పరిస్థితులతో పాటు రాష్ట్రంలోని పరిణామాలపై కూడా వారు చర్చించుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ భేటీపై ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో కుర్చీలాట తీవ్రతరం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకరినొకరు ఎలిమినేట్ చేసుకోవడానికి కేటీఆర్, హరీష్, కవిత వ్యూహాలు రచించుకుంటున్నారని అన్నారు.

‘‘బీఆర్ఎస్ లో ముసలం మొదలైంది. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పార్టీ ప్లీనరీ సమయంలో హరీష్ రావు కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకు అంత సీను లేదని చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లాడు. రెండు గంటలకు పైగా హరీష్ రావు ను చర్చలు జరిపారు. గతంలో ఎప్పుడూ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లలేదు. హరీష్ రావు ఇంట్లో గతంలో పంక్షన్ జరిగినా కేటీఆర్, ఆయన కుటుంబం దూరంగా ఉంది. ఇప్పుడు సడన్ గా హరీష్ రావు పైన కేటీఆర్ కు ఎందుకంత ప్రేమ వచ్చిందో చెప్పాలి. హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. కల్వకుంట్ల కవిత ఇప్పటికే పార్టీ కి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు. తన మీద దుష్పచారం జరుగుతోందని, దాని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కవిత అంటోంది. మొత్తంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. హరీష్ రావు తో చర్చల మతలబు ఏమిటో ప్రజలకు కేటీఆర్ చెప్పాలి’’ అని కోరారు.

అయితే పార్టీ పగ్గాలను కేటీఆర్‌కు ఇస్తే ఆ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానని ఇటీవల హరీష్ రావు స్పష్టతనిచ్చారు. అంతేకాకుండా తనకు పార్టీ మారే ఆలోచన కూడా లేదని, తమ నాయకుడు కేసీఆర్ అని, ఆయన, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని చెప్పారు. అదే సమయంలో తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని, సరైన సమయం చూసుకుని అన్నీ బటయపెడతానని ఎమ్మెల్సీ కవిత ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో కేటీఆర్, హరీష్ రావు భేటీ కావడం కీలకంగా మారింది.

Tags:    

Similar News