నంబాల కేశవరావు డెడ్ బాడీని కుటుంబసభ్యులకు పోలీసులు ఎందుకు ఇవ్వమన్నారు ?

డెడ్ బాడీని ఇచ్చేదిలేదని పోలీసులు కుటుంబసభ్యలకు ఎందుకు చెప్పారన్న విషయమై అనుమానాలు పెరిగిపోతున్నాయి;

Update: 2025-05-24 07:52 GMT
Maoist supreme commander Nambala Kesava Rao

మూడురోజుల క్రితం అబూజ్ మడ్ అడవుల్లో ఎన్ కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు సుప్రిం కమాండర్ నంబాల కేశవరావు డెడ్ బాడీ విషయంలో వివాదం రేగడం ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా ఎక్కడ ఎన్ కౌంటర్లు జరిగినా పోలీసులు పోస్టుమార్టమ్ జరిపించిన తర్వాత కుటుంబసభ్యులను పిలిపించి వాళ్ళ మృతదేహాలను అప్పగించేస్తారు. అయితే తాజా ఎన్ కౌంటర్లో మావోయిస్టు కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబా(Nambala Kesava Rao)ల మృతదేహాన్ని అప్పగించే విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సొచ్చింది. నంబాల డెడ్ బాడీని తమకు అప్పగించాలని తండ్రి, సోదరుడు హైకోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? డెడ్ బాడీని ఇచ్చేదిలేదని పోలీసులు కుటుంబసభ్యలకు ఎందుకు చెప్పారన్న విషయమై అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోస్టుమార్టమ్ తర్వాత నంబాల డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించటంలో పోలీసులకు వచ్చిన అభ్యంతరం ఏమిటనే ప్రశ్న పెరిగిపోతోంది.

ఇక్కడే అనేకఅనుమానాలు పెరిగిపోతున్నాయి. కుటుంసభ్యులు, పౌర,మానవహక్కుల సంఘల నేతలు వ్యక్తంచేస్తున్న అనుమానాల్లో కీలకమైనది ఏమిటంటే నంబాల ఎన్ కౌంటర్లో చనిపోలేదు. అనారోగ్యంతో ఇబ్బందులుపడుతున్న నంబాల ఒడిస్సాలో ఎక్కడో గుర్తుతెలీని చోట వైద్యం చేయించుకుంటున్నాడు. నంబాల అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాడని, రహస్యస్ధావరంలో వైద్యం చేయించుకుంటున్నాడన్న విషయంలో పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. రహస్య స్ధావరంపై పోలీసులు నిఘావేశారు. తమకు వచ్చిన సమాచారం నిజమే అని నిర్ధారించుకున్నారు. ఒకరోజు అర్ధరాత్రిపూట పెద్దఎత్తున పోలీసులు రహస్యస్ధావరంపై మెరుపుదాడిచేసి నంబాలతో పాటు చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పోలీసులు మరో రహస్యస్ధావరానికి నంబాలతో పాటు పట్టుబడిన వారందరినీ తీసుకెళ్ళి విచారించి చివరకు కాల్చి చంపేశారు. కాల్చిచంపేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి అబూజ్ మడ్ అడవుల్లో(Abujhmad Forest) ఇంద్రావతి నదీపరివాహక ప్రాంతంలో పడేశారు. తాము పట్టుకొచ్చి చంపేసిన వారిని కూడా తర్వాత జరిగిన ఎన్ కౌంటర్లో భద్రతాదళాలు జాబితాలో కలిపేసినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

పౌరహక్కుల నేతలు చేస్తున్న మరో ఆరోపణ ఏమిటంటే నంబాలకు విషమిచ్చి చంపేశారని. నంబాల డెడ్ బాడీని అప్పగిస్తే రీ పోస్టుమార్టమ్ కోసం కోర్టులో పిటీషన్ వేసే అవకాశం ఉందన్న అనుమానంతోనే పోలీసులు డెడ్ బాడీని కుటుంబసభ్యులకు ఇవ్వటానికి అంగీకరించటంలేదని పౌరహక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. పై అనుమానాలకు సరైన సమాధానాలు వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ అనుమానాలే నిజమై నంబాల డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించాల్సివస్తే పోలీసులే దగ్గరుండి హడావుడిగా క్రిమేషన్ చేయించేస్తారు కాని డెడ్ బాడీ ఇచ్చేసి చోద్యంచూస్తు ఊరుకోరు.

పోస్టుమార్టమ్ లో ఏమి తేలుతుంది ?

నంబాల డెడ్ బాడీకి రీపోస్టుమార్టమ్ చేయిస్తే అసలు విషయం బయటపడుతుంది. ఎలాగంటే ఎన్ కౌంటర్లో నంబాల చనిపోయాడని పోలీసులు ప్రకటించిన సమయానికి, వాస్తవంగా చనిపోయిన సమయం ఎంతన్నది పోస్టుమార్టమ్ లో తెలిసిపోతుంది. నిజంగానే ఎన్ కౌంటర్లోనే చనిపోతే కాస్త అటుఇటుగా సమయం సరిపోతుంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు ? చనిపోయిందెవరు ? అన్న విషయాలు అప్పటికప్పుడు తెలిసే అవకాశాలు లేవు. ఎందుకంటే భద్రతాదళాలను పసిగట్టిన మావోయిస్టులు తప్పించుకునేందుకు, భద్రతాదళాలను ముందుకు రాకుండా అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. కొందరు కాల్పులుజరుపుతుంటే మరికొందరు అక్కడినుండి తప్పించుకునే ప్రయత్నంచేశారు. దీంతో భద్రతాదళాలు కూడా కాల్పులు జరిపారు.

కాల్పులు-ఎదురుకాల్పుల్లో ఎంతమంది మావోయిస్టులకు(Maoists encounter) బుల్లెట్లు తగిలాయి, ఎంతమంది చనిపోయారు ? తప్పించుకున్నది ఎంతమంది ? అన్న విషయాలు అప్పటికప్పుడు తెలియవు. భద్రతాదళాల కాల్పుల్లో నేలకొరిగిన మావోయిస్టులను అక్కడే వదిలేసి తమను తాము రక్షించుకునేందుకు మిగిలిన మావోయిస్టులు కాల్పులు జరుపుతునే అడవుల్లో నుండి తప్పించుకున్నారు. తప్పించుకుంటున్న మావోయిస్టులపై కాల్పులు జరుపుతు వెంటాడిన భద్రదాదళాల్లోని కొందరు నేలమీదపడిపోయిన మావోయిస్టులను ఒకచోటకు చేర్చారు. తర్వాత జరిగిన ఐడెంటిఫికేషన్ పరేడ్ లో చనిపోయిన వారిలో టాప్ లీడర్ నంబాల ఉన్నట్లు భద్రతాదళాలు గుర్తించాయి. ఇదంతా అయ్యేటప్పటికి కొంతసమయం పట్టుంటుంది. కాబట్టి పోలీసులు ప్రకటించిన సమయానికి నంబాల చనిపోయిన సమయం కాస్త అటుఇటు అయినా ఇబ్బందిలేదు.

అయితే ఎన్ కౌంటర్లో కాకుండా ఎక్కడో కాల్చేచంపేసి తీసుకొచ్చి అడవుల్లో పడేసిన తర్వాత ఎన్ కౌంటర్లో చనిపోయాడని ప్రకటిస్తే ఆవిషయం పోస్టుమార్టమ్ లో తెలిసిపోతుంది. భద్రతాదళాలు పైకి ఎన్నిచెప్పినా పోస్టుమార్టమ్ చేసిన డాక్టర్లు టైం ఆఫ్ డెత్ ను కాస్త అటుఇటుగా చెప్పగలరు ? ఎక్కడో పట్టుకుని, ఇంకెక్కడికో తీసుకెళ్ళి విచారించిన తర్వాత ఇంకెక్కడో కాల్చిచంపేసి తీసుకొచ్చి అడవుల్లో పడేయటానికి చాలా టైం పట్టుంటుంది. ఆ టైమ్ గ్యాప్ ను అనుభవజ్ఞులైన డాక్టర్లు తేలికగా అంచనావేయగలరు. ఎన్ కౌంటర్ మొదలైంది తెల్లవారని నారాయణపూర్ పోలీసు అధికారులు ప్రకటించారు. ఈవిషయాలన్నీ బయటపడతాయి కాబట్టే రీపోస్టుమార్టమ్ కు అవకాశంలేకుండా పోలీసులు కుటుంబసభ్యులకు నంబాల డెడ్ బాడీని అప్పగించటానికి ఇష్టపడటంలేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్ కౌంటర్ విషయంలో పోలీసుల యాక్షన్ పై ఇన్నిఅనుమానాలు పెరిగిపోతున్నాయికాబట్టే నంబాల డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించే విషయంలో కోర్టు జోక్యంచేసుకోవాల్సొచ్చింది.

Tags:    

Similar News