Pawan| కిషన్, బండికన్నా పవనే గొప్పా..?

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ రేంజి కూడా పెరిగిపోయిందనే ప్రచరం అందరికీ తెలిసిందే.

Update: 2024-11-27 12:00 GMT
Pawan kishan and Bandi

ఇపుడీ విషయమే తెలంగాణాలో టాపిక్ ఆఫ్ ది డే అయిపోయింది. ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కల్యాణ్(Pawan Kalyan) గతంలో కూడా నరేంద్రమోడీ(Narendra Modi)ని కలిశారు. ఏమి మాట్లాడుకున్నారన్నది వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన విషయం. కాకపోతే రాష్ట్రాభివృద్ధికోసం చర్చించుకున్నాము, పలానా శాఖకు ఎక్కువ నిధులు కేటాయించమని రిక్వెస్టు చేశాను, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి కూడా చర్చించాము అని స్టాక్ ప్రకటనలు ఇస్తుంటారు కాబట్టి వాటిగురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు.

ఇపుడు విషయం ఏమిటంటే నరేంద్రమోడీని పార్లమెంటు భవనం(Parliament House)లోని కార్యాలయంలో పవన్ కలిశారు. ఇద్దరి మధ్య సుమారు పావుగంటసేపు భేటీ జరిగింది. పైన చెప్పుకున్నట్లుగా జలజీవన్ మిషన్ ద్వారా ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాల కోసం అధిక నిధులు మంజూరుచేయాలని అడిగినట్లు పవన్ మీడియాతో చెప్పారు. గ్రామీణ ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం అందటంలేదని, కొన్నిప్రాంతాల్లో కలుషితనీరు సరఫరా అవుతున్నట్లుగా మోడీతో చెప్పానని పవన్ అన్నారు. కాబట్టి ప్రజలందరికీ మంచినీటిని అందించాలంటే నిధులు ఎక్కువగా కేటాయించాలని కోరినట్లు కూడా పవన్ చెప్పారు. ఎలాగూ పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలు పవన్ దగ్గరే ఉన్నాయి కాబట్టి మోడిని రిక్వెస్టు చేశారనే అనుకోవాలి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు కేంద్రంలోని ఇతర మంత్రులతో భేటీ అవగలుగుతున్నారు. అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా(Amis Shah) తో కూడా ఈమధ్యనే భేటీ అయ్యారు. షానే పిలిపించారో లేకపోతే పవనే వెళ్ళి కలిశారో తెలీదు కాని ఇద్దరు భేటీ అయ్యింది మాత్రం వాస్తవం. ఇదే సమయంలో తెలంగాణాలో కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటేమిటి ? అనే చర్చ పెరిగిపోతోంది. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అదనపు నిధుల మంజూరు లాంటి విషయాలపై నరేంద్రమోడీతో చర్చించినట్లు ఇప్పటివరకు ఎక్కడా మీడియాలో కనబడలేదు. మోడీతో కాదు చివరకు అమిత్ షా ను కలిసినట్లు కూడా లేదు. బొగ్గు శాఖకు కిషన్, హోంశాఖ సహాయమంత్రిగా బండి ఉన్న విషయం తెలిసిందే. రెండు కూడా కీలకమైన శాఖలే అనటంలో సందేహంలేదు. బొగ్గుశాఖ మంత్రిగా ఉండికూడా వేలంపాటలు లేకుండా బొగ్గు గనులను సింగరేణి(Singareni) సంస్ధకు ఇప్పించలేకపోయారనే ఆరోపణలను కిషన్ ఎదుర్కొటున్నారు. మోడీ తర్వాత కేంద్రప్రభుత్వంలో అంతటి శక్తిమంతుడు అమిత్ షా నే అన్న విషయం అందరికీ తెలుసు. అమిత్ కు చెప్పుకుంటే మోడీకి చెప్పుకున్నట్లే..అమిత్ అనుకుంటే మోడీ అనుకున్నట్లే అనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది.

అలాంటిది తెలంగాణా నుండి ఇద్దరు కేంద్రమంత్రులు ఉండికూడా మోడీ లేదా అమిత్ షా తో భేటీ అయి రాష్ట్రాభివృద్ధిగురించి చర్చించాము అన్న ఒక్క వార్త కూడా ఇప్పటివరకు జనాలు చూడలేదు. కిషన్, బండి వల్లే తెలంగాణా(Telangana)కు ఈ ప్రాజెక్టు వచ్చిందని కాని, పెండింగ్ ప్రాజెక్టులు క్లియర్ అయ్యాయని కాని, పెండింగ్ నిదులు మంజూరయ్యాయని కాని ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని రేవంత్ రెడ్డి(Revanth reddy), మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నోసార్లు ఆరోపించారు. నిజానికి కిషన్(Kishanreddy), బండి(Bandi Sanjay) దశాబ్దాల క్రితం పార్టీలోనే పుట్టి పార్టీలోనే పెరిగి ఇంతవారయ్యారు. మోడీ ప్రధాని కాకముందు నుండే వీళ్ళకు పరిచయం ఉండే ఉంటుంది. అలాంటిది జనాలకు చెప్పుకోవటానికి, ప్రతిపక్షాల నోళ్ళు మూయించటానికి అయినా ఇద్దరు కలిసి మోడీని కలిసి ఏదో ఒక ప్రయోజనాన్ని ఎందుకు సాధించలేకపోతున్నారన్నది ప్రజలకు కూడా అర్ధంకావటంలేదు.

ఏమన్నా అంటే తెలంగాణా అభివృద్ధికి కేంద్రం రు. 10 లక్షల కోట్లు ఖర్చుపెట్టిందని కిషన్ చెబుతుంటారు. ఏ రూపంలో ఖర్చు పెట్టింది ? ఏ ప్రాజెక్టులకు ఖర్చుపెట్టిందన్న విషయాలను వివరంగా చెప్పరు. ఎంతసేపు రాజకీయ ఆరోపణలు, విమర్శలే కాని రాష్ట్రానికి పనికొచ్చేట్లుగా గట్టి ప్రాజెక్టును ఒక్కటైనా సాధించుకుని వస్తే జనాలు సంతోషిస్తారని మరచిపోతున్నారు. ఇక్కడే బండి, కిషన్ కన్నా పవనే గొప్పోడు అనే చర్చ పెరిగిపోతోంది. పైగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ రేంజి కూడా పెరిగిపోయిందనే ప్రచరం అందరికీ తెలిసిందే. నిధులు మంజూరు అవుతాయో లేదో తెలీదు కాని మోడీని కలిశాను, నిధులు కావాలని అడిగాను, మోడీ కూడా సానుకూలంగా స్పందించారని పవన్ చెప్పుకునేందుకైనా భేటీ ఉపయోగపడింది.

Tags:    

Similar News