నల్గొండ కంచుకోటలో ‘హస్తం’ హవా కొనసాగేనా?

నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల బరిలో ముగ్గురు బడా వ్యాపారులు దిగారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో ఈ సారి ‘హస్తం’ హవా కొనసాగుతుందా అనేది ఓటర్లు చెప్పాలి.

Update: 2024-04-05 05:07 GMT
Nalgonda mp Candidates

రైతుల వరప్రదాయని అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంగా నల్గొండ గుర్తింపు పొందింది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట అయిన నల్గొండ ఎంపీ స్థానం కాలక్రమేణా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. 1952 మొట్టమొదటి సాధారణ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేసిన రావ నారాయణరెడ్డి దేశంలోనే అత్యధికంగా 2,72,280 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. ఆ నాడు ప్రధాని జవహర్ లాల్ - నెహ్రూ కంటే అధిక మెజారిటీతో విజయదుందుభి మోగించి నల్గొండ చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ్, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉన్న నల్గొండ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది.
- ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సూర్యాపేట మినహాయించి ఆరింటిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు.
- 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కడంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి(హుజూర్ నగర్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి(నల్గొండ) ఈ ఎంపీ స్థానం నుంచి కీలక శాఖల మంత్రులుగా పనిచేస్తున్నారు.దేవరకొండ నుంచి బాలునాయక్ నేనావత్, నాగార్జునసాగర్ నుంచి కుందూరు జయవీర్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, కోదాడ నుంచి నలమాడ పద్మావతి రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు.

పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా కాంగ్రెస్ పార్టీదే విజయం
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ అయినా అసెంబ్లీ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఇక్కడి విశేషం. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 44.8 శాతం ఓట్లతో విజయ ఢంకా మోగించి ఎంపీ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆరు ఎమ్మెల్యే స్థానాలతో పాటు అత్యధికంగా 53 శాతం ఓట్లు వచ్చాయి. అంటే బీఆర్ఎస్ పార్టీకి సూర్యాపేట స్థానం దక్కినా, ఆ పార్టీకి నల్గొండ పార్లమెంట్ పరిధిలో వచ్చిన ఓట్ల శాతం కేవలం 33.1 శాతం మాత్రమే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ వచ్చిన ఓట్ల శాతం 4.5 శాతం ఓట్లే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 4.9 శాతమే. అంటే బీజేపీ మూడోస్థానానికి పరిమితమైంది.

నల్గొండ బరిలో అందరూ వ్యాపారులే...
నల్గొండ పార్లమెంట్ బరిలో మూడు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తరపున ఎన్నికల బరిలో దిగిన వారంతా బడా వ్యాపారులే. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందూరు రఘువీర్ రెడ్డి కాంట్రాక్టరు. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కూడా కాంట్రాక్టరే. బీజేపీ అభ్యర్థి హోటల్ వ్యాపారం చేస్తున్నారు. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆర్థికంగా బలోపేతులైన కాంట్రాక్టర్లు, వ్యాపారులు కావడం విశేషం. ముగ్గురు బడా వ్యాపారుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

తండ్రి వారసుడిగా కుమారుడు బరిలోకి...
తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు నల్గొండ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈయన దరఖాస్తు చేసుకున్నా, ఇతన్ని కాదని చిన్నకుమారుడు అియిన జయవీర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. జానారెడ్డి కుమారుల్లో ఒకరు ఎమ్మెల్యే కాగా, మరొకరు తాజాగా ఎంపీ బరిలోకి దిగారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న రఘువీర్ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాంట్రాక్టరు అయిన రఘువీర్ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీనియర్ నాయకుడైన తన తండ్రి జానారెడ్డి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్న రఘువీర్ ఈ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధిస్తారా? లేదా అనేది ఫలితాల వరకు చూడాల్సిందే.

పటేల్ రమేష్ రెడ్డికి ‘రిక్తహస్తం’
సూర్యాపేట అసెంబ్లీ టికెట్ కోసం పోటీపడిన పటేల్ రమేష్ రెడ్డికి గతంలో ఎంపీ టికెట్ ఇస్తామని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చినా, అతనికి రిక్తహస్తం చూపారు. గతంలో సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ను మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి ఇవ్వగా ఓడిపోయారు. ఎంపీ టికెట్ ఇస్తామనే హామీని గాలికొదిలి జానారెడ్డి పెద్ద కుమారుడైన రఘువీర్ కు కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది.

కమలం గుర్తుపై మాజీ ఎమ్మెల్యే పోటీ
బీఆర్ఎస్ నాయకుడైన శానంపూడి సైదిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. సైదిరెడ్డి ఢిల్లీ వెళ్లి అలా కాషాయం కండువా కప్పుకొని,ఇలా బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. హోటల్ వ్యాపారం చేసే ఈయన మొదటిసారి పార్లమెంట్ బరిలో నిలిచారు.

బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి
నల్గొండ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ నాయకుడు, కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఈయన రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఉంటూ అనూహ్యంగా ఎంపీ టికెట్ పొందారు. ఈయన సోదరుడు కంచర్ల భూపాల్ రెడ్డి గతంలో నల్గొండ ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఎస్సీ,ఎస్టీ,ముస్లిం ఓటర్లే కీలకం
నల్గొండ ఎంపీ నియోజకవర్గంలో ఎస్సీ,ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ ఓటర్లే కీలకంగా ఉన్నారు. వీరే ఎన్నికల్లో విజయాన్ని శాసిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లు 17.5 శాతం, ఎస్టీ ఓటర్లు 15.5 శాతం, ముస్లిం ఓటర్లు 7.1 శాతం, క్రిస్టియన్లు ఒకశాతం ఉన్నారు. అంటే మొత్తం కలిపి 41.1 శాతం మంది బలహీన, మైనారిటీ వర్గాలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని చెప్పవచ్చు. కీలక ఓటర్లు అయిన ఎస్సీ,ఎస్టీ, ముస్లింలు నివాసముంటున్న ప్రాంతాలపై అభ్యర్థులు దృష్టి సారించి ఓట్ల వేట సాగిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్న నల్గొండ ఎంపీ స్థానంలో ఉన్న ఆ పార్టీకి ఉన్న ఇద్దరు కీలకమంత్రులు, ఎమ్మెల్యేల బలం ఈ ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపిస్తుందో..గతంలో కొనసాగిన హస్తం హవా ఈ ఎన్నికల్లో కొనసాగుతుందా? నల్గొండ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది జూన్ 4వతేదీ ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు వేచిచూడాల్సిందే.


Tags:    

Similar News