‘మౌనం వద్దు.. పోరాడి సాధించుకోవాలి’.. ప్రజలకు కేసీఆర్ పిలుపు

చేవెళ్లలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మౌనం వీడి పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

Update: 2024-04-13 14:43 GMT
Source: Twitter

ప్రజలు తమ సమస్యలపై మౌనంగా ఉండొద్దని, పోరాడి వాటిని పరిష్కరించుకోవాలని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రజలకు సూచించారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరితోనైనా పోరాడటానికి వెనకాడొద్దంటూ పిలుపునిచ్చారు. చేవెళ్లలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ప్రసంగిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ పుణ్యమా అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అందుకు ప్రతీకగానే ఆయన విగ్రహాన్ని స్థాపించామని ఆయన వివరించారు. ప్రభుత్వం అంటే ఒక పార్టీ ఐదేళ్లపాటు అధికారంలో ఉండటం కాదని, ప్రజల నమ్మకం, విశ్వాసానికి ప్రతిరూపం ప్రభుత్వం అని చెప్పారాయన. ‘‘ప్రభుత్వం అంటే ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉండాలి. ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించడం లేదు. రాష్ట్రం వచ్చిన కొత్తల్లో మనం కరెంటు కోతలు, కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, అందని సాగు, తాగు నీరు వంటి అనేక ఇబ్బందులు మనం పడ్డాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లలోనే ఆ సమస్యలకు చెక్ పెట్టాం. అటువంటిది పదేళ్ల తర్వాత మళ్ళీ రాష్ట్రంలో ఆ సమస్యలన్నీ వస్తున్నాయి’’ అని కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు ఈ ప్రతిపక్ష నేత. రైతుల్ని బీఆర్ఎస్ కన్నబిడ్డలా కాపాడుకుందని గుర్తు చేశారాయన.

కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు కూడా రాకూడదు

అనంతరం తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కకూడదని, ప్రజలు తమ తీర్పును ఆ రేంజ్‌లో చూపించాలని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం నుంచి తప్పుకున్న రోజుల వ్యవధిలోనే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. అటువంటి బీఆర్ఎస్ నేతలను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపించాలి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేరుస్తుంది’’అని అన్నారాయన. బీఆర్ఎస్‌ను అధికారం నుంచి తొలగించిన ప్రజలకు కనీసం ప్రతిపక్షంగానైనా తమను బలపరచాలని కేసీఆర్ అడగగనే అడిగారు.

బీజేపీ ఏం చేసింది

కేంద్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంటుంది. కానీ ఈ పదేళ్లలో తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసింది అని ప్రశ్నించారు కేసీఆర్. ‘‘ప్రజల్లో మత కల్లోలాలు సృష్టించి ఓట్లు అడగడమే బీజేపీకి బాగా వచ్చిన విద్య. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రద్దు చేసింది. అంత అవసరం ఏమొచ్చింది. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అవి రాలేదు? ఇకపై వస్తాయన్న నమ్మకం కూడా లేదు. రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థను కూడా ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి. ఈ ప్రశ్నలను ప్రతి ఓటరు ఒక్కసారి ప్రశ్నించుకోంది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌ను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిలదీయాలి. అది బలమైన ప్రతిపక్షంతోనే సాధ్యం’’అని మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో తమనే గెలిపించాలన్న అంశాన్ని గురతు చేశారు.

ఊపిరి ఉన్నంత వరకు పోరాడతా

గ్రామాలు పట్టణాలకు పట్టుకొమ్మలు కావాలని ఆలోచించిన పార్టీ బీఆర్ఎస్ అని, దాన్ని వాస్తవం చేయడానికి ఐదు పథకాలు పెట్టి రైతులకు మేలు చేసింది బీఆర్ఎస్ అని వెల్లడించారు. రైతు బంధును తీసుకొచ్చిన తొలి ప్రభుత్వం కూడా బీఆర్ఎస్‌దేనని గుర్తు చేశారాయన. ‘‘సాగుకు 24 గంటల విద్యుత్ అందించాం. రైతులు పండించిన ప్రతి పంటను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. దళితవాడలు.. ధనికవాడలు కావాలని ఆకాంక్షించిన ప్రభుత్వం మాది. అందుకోసం దళిత బంధు పథకాన్ని అమలు చేశాం. ఈ పథకం ద్వారా దాదాపు 1.30 లక్షల మంది లబ్ధి పొందారు. ఆ డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన దళిత బంధును లబ్ధిదారులకు అందించాలి. లేని పక్షంలో వారితో కలిసి అంబేద్కర్ విగ్రం దగ్గర నేను కూడా ధర్నాకు దిగుతాను. ప్రభుత్వ మెడలు వంచైనా దళితులకు న్యాయం చేస్తాం. పోరాడకుంటే సమస్యలు పరిష్కారం కావు. తెలంగాణ ప్రజల కసం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను’’ అని చెప్పారు కేసీఆర్.

Tags:    

Similar News