Jeevan Reddy | ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి..?

తెలంగాణలో శాసనమండలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇంతలో మరోసారి తెరపైకి జీవన్ రెడ్డి పేరు వచ్చింది. దీనిపై ఆయన ఏమన్నారో తెలుసా..

Update: 2024-11-29 07:57 GMT

తెలంగాణలో శాసనమండలి ఎన్నికలకు(MLC Elections) రంగం సిద్ధమవుతోంది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ల స్థానాల ఎంపిక జరగనుంది. ఈ క్రమంలోనే కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్(Congress) తరుపున మరోసారి సీనియర్ నేత జీవన్ రెడ్డి(Jeevan Reddy) పేరే వినిపిస్తోంది. ఈ మేరకు టీపీసీసీ కూడా తీర్మానం చేసింది. మరోసారి ఎమ్మెల్సీ బరిలో జీవన్ రెడ్డినే నిలబెట్టాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జరిగిన సమావేశంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ నాయకులు అందరూ కూడా ముక్తకంఠంతో జీవన్ రెడ్డి పేరునే ప్రతిపాదించారు. ఈ మేరకు తమ అభ్యర్థనను హైకమాండ్ ముందు కూడా ఉంచినట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెల్లడించారు. ఈ ఎన్నికల నేపథ్యంలో గురువారం గాంధీభవన్ వేదికగా సమావేశం జరిగింది. ఇందులో నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి జీవన్ రెడ్డి పేరునే వారు ప్రతిపాదించారు.

హైకమాండ్‌కు పంపుతాం..

‘‘పోటీకి జీవన్ రెడ్డి సిద్ధంగా ఉంటే ఆయన పేరునే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హైకమాండ్ ముందుంచుతాం. ఒకవేళ ఆయన పోటీకి ఆసక్తి చూపకుంటే మాత్రం వేరే అభ్యర్థి ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తాం. అప్పుడు సీనియర్ మంత్రులతో కలిసి ఒక కమిటీని వేసి అభ్యర్థి ఎంపికను చేపడతాం’’ అని పీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ తెలిపారు. అప్పటిలోగా సాధ్యమైనంత ఎక్కువమంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేలా సన్నాహాలు చేయాలని, ఈ ప్రక్రియ బాధ్యత ఆయా జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని ఆయన తెలిపారు.

హైకమాండ్‌దే తుదినిర్ణయం: జీవన్ రెడ్డి

ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి తన పేరే వినిపించడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో నేను పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్‌కు కాంగ్రెస్ రాష్ట్ర శాఖ నివేదిస్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ బరిలో ఎవరు ఉండాలి అన్న అంశంపై అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకుంటుంది. పోటీ చేయడం, చేయించడం అనేవి పార్టీ అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి. అది నా వ్యక్తిగత నిర్ణయం కాదు. అందులో నా నిర్ణయం అంటూ ఏమీ లేదు. గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ నా వ్యక్తిగతంగా చేయలేదు. పార్టీ నిర్ణయం మేరకే పోటీ చేసి గెలిచాను. నేను మౌనంగా ఎప్పుడు లేను. నాకు ఎవరు హామీ ఇవ్వలేదు. నాకు ఎలాంటి ఒప్పందాలు లేవు’’ అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

జీవన్ రెడ్డికి అవకాశం దక్కేనా..

అయితే ఇటీవల తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య జరిగిన సమయంలో జీవన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సొంత పార్టీ వారికే భద్రత లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉన్నాయన్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. ‘‘నేను పార్టీలో ఇక ఉండలేదు. నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదు. ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు కోరుకున్నారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ.. వాళ్లు చెప్పిన దాన్నే మరిచింది. మన మహానీయుల విగ్రహాలను ఎందుకు పెడతాం. వారి ఆలోచనా విధాన్ని అలవర్చుకోవాలన్న ఉద్దేశంతో.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ అంటోందే తప్ప వారి విధి విధానాలు ఏమాత్రం ఆచరించడం లేదు. గతంలో కేసీఆర్ ఎలా నడుచుకున్నారో.. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే మార్గంలో వెళ్తోంది. మన నాయకుడు రాహుల్ గాంధీ అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. ఎవరికీ భరోసా ఇచ్చే స్థితిలో నేను లేను. నా ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తున్నా’’ అని జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘నేను రాజకీయల నుండి తప్పుకుంటా. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. నిన్నటి దాకా వాళ్లే రాజ్యం ఏలిండ్రు. ఇవ్వాళా వాళ్ళే రాజ్యం చేస్తుండ్రు. నేనే రాజకీయాల నుండి తప్పుకుంటా. నాకు ఏ పదవి అక్కర్లేదు. వాళ్లనే రాజ్యం చేసుకొమ్మనండి. కాంగ్రెస్ పార్టీ ముసుగులో మా ప్రాణాలు తీస్తుంటే రక్షించాల్సిన పోలీసులు మీరు వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. పార్టీ కూడా అలాంటి వారికే వత్తాసు పలుకుతుంది. నీకూ, నీ పార్టీకో దండం లక్ష్మణ్..ఇకనైనా మమ్మల్ని బ్రతకనివ్వండి. ఇంతకాలం మానసికంగా అవమానలకు గురైనా తట్టుకున్నాం. ఇవ్వాళా ప్రాణాలకే రక్షణ లేకపోతే మాకేందుకు పార్టీ, ప్రభుత్వం’’ అని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.

ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఇప్పుడు మరోసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయన పేరే వినిపించడంతో అందుకు పార్టీ అధిష్ఠానం సమ్మతిస్తుందన్న నమ్మకాలు చాలా తక్కువ అన్న మాట వినిపిస్తోంది. పార్టీపై నమ్మకంలేని వ్యక్తి చేత పార్టీకి ప్రాతినిధ్యం వహించేలా ఎలా చేస్తాం అని హైకమాండ్ ప్రశ్నించినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ పాలనపై తీవ్ర ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డికి ఈసారి అవకాశం లభించడం కష్టమేనని, రాష్ట్ర కాంగ్రెస్ ఓకే చెప్పినా.. ఆయన మాటలను పార్టీ హైకమాండ్ తేలికగా తీసుకుంటుందన్న నమ్మకం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News