కేసీఆర్ కు షాక్ తప్పదా ?

కేసీఆర్(KCR) అసెంబ్లీలో ఏదైతే చేశారో అదేపద్దతిలో ఇపుడు రేవంత్ రెడ్డి(Revanth) కూడా పావులు కదుపుతున్నట్లు సమాచారం;

Update: 2025-02-14 06:47 GMT

తొందరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాక్ తప్పే ట్లులేదు. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు టీడీపీ, కాంగ్రెస్ విషయంలో కేసీఆర్(KCR) అసెంబ్లీలో ఏదైతే చేశారో అదేపద్దతిలో ఇపుడు రేవంత్ రెడ్డి(Revanth) కూడా పావులు కదుపుతున్నట్లు సమాచారం. వీలైనంత తొందరలోనే బీఆర్ఎస్ శాసనసభాపక్షం బీఆర్ఎస్ఎల్పీ(BRSLP)ని కాంగ్రెస్ లో విలీనం చేసేట్లుగా వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ వ్యూహానికి అధిష్ఠానం పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి పదిమంది ఎంఎల్ఏలు ఫిరాయించారు. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కోర్టుల్లో కేసువేయించి పెద్ద పోరాటమే చేస్తున్నారు.

కేటీఆర్ పోరాటాన్ని ధీటుగా తిప్పికొట్టాలన్నా, ఫిరాయింపుల(BRS defection MLAs)పై అనర్హత వేటుపడకుండా కాపాడుకోవాలన్నా తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై ఈమధ్యనే ఢిల్లీ పర్యటనలో రేవంత్ అధిష్ఠానం ముఖ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది. రేవంత్ ప్లాన్ కు ముఖ్యనేతలు కూడా సానుకూలంగా స్పందించారు. ఇంతకీ రేవంత్ వ్యూహం ఏమిటంటే మరికొందరు ఎంఎల్ఏలను బీఆర్ఎస్ లో నుండి లాగేసుకోవటమే. ఒక్కొక్కళ్ళని తీసుకుంటే వారిపై అనర్హత వేటుపడే అవకాశాలున్నాయి. అదే మొత్తం 38 మంది ఎంఎల్ఏల్లో 2/3 వంతులమంది ఎంఎల్ఏలను లాగేసుకుంటే అనర్హత వేటుపడదు, ఇదేసమయంలో బీఆర్ఎస్ఎల్పీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేసుకోవచ్చు. కష్టపడి మరికొంతమందిని కూడా లాగేసుకుంటే కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా ఊడిపోతుంది.

అనర్హత వేటు తప్పించుకోవటం ఎలాగ ?

రేవంత్ వ్యూహం పక్కాగా అమలవ్వాలంటే ఇపుడు చేరిన 10 మంది కాకుండా మరో 16 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయాలి. అప్పుడు బీఆర్ఎస్ బలం అసెంబ్లీలో 38 నుండి 12కి పడిపోతుంది. అప్పుడు ఫిరాయింపులపై అనర్హత వేటుపడే అవకాశంలేదు. అలాగే బీఆర్ఎస్ లో మిగిలే 12 మంది ఎంఎల్ఏల్లో కూడా మరో ఐదుగురిని లాగేసుకుంటే కేసీఆర్ కు ప్రధానప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది. ప్రధానప్రతిపక్ష నేత హోదా కారణంగా కేసీఆర్ కు క్యాబినెట్ మంత్రి ర్యాంక్ ఉంది. ప్రోలోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ తర్వాత స్ధానం కేసీఆర్ దే. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేకపోతే మిగిలిన ఎంఎల్ఏల్లాగే కేసీఆర్ ఉత్త ఎంఎల్ఏగా మాత్రమే మిగిలిపోతారు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అని తప్ప క్యాబినెట్ ర్యాంకుండదు.

కోర్టువిచారణలో ఫిరాయింపు ఎంఎల్ఏలకు ఇబ్బంది ఎదురవ్వకూడదంటే అర్జంటుగా ముందు మరో 16 మంది ఎంఎల్ఏలను లాగేసుకోవాల్సిందే అని రేవంత్ డిసైడ్ అయ్యారు. నిజానికి ఇలాంటి ప్రయత్నం చేయాలని గతంలోనే అనుకున్నా వివిధ కారణాలతో బ్రేకులు పడింది. అనర్హత వేటు వేయించాలని కేటీఆర్ చాలా పట్టుదలగా ఉన్న కారణంగా మరింతమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాగేసుకోవటం ద్వారా కేసీఆర్ ను కోలుకోలేని దెబ్బకొట్టాలని రేవంత్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఒకపుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని కేసీఆర్ బీఆర్ఎస్ లో కలిపేసుకున్నట్లే ఇపుడు బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో కలుపుకుని దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అని రేవంత్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.

ఎందుకు ఆలస్యమవుతోంది ?

బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవటంలో రేవంత్ కు ఒక విషయం అడ్డుపడుతోందని తెలిసింది. అదేమిటంటే మంత్రిపదవులు. కాంగ్రెస్ లోకి ఫిరాయించటానికి మరింతమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సిద్ధంగా ఉన్నారని సంకేతాలు అందినాయి. అయితే ఫిరాయింపు ఎంఎల్ఏల్లో నలుగురికి మంత్రిపదవులు ఇవ్వాలనే షరతు ఎదురైందట. ఇప్పటికే ఫిరాయించిన పదిమందిలో ఇద్దరికి, తొందరలో ఫిరాయించబోయే ఎంఎల్ఏల్లో మరో ఇద్దరికి మంత్రిపదవులు ఖాయంచేయాలని ఫిరాయింపుల నుండే కాకుండా ఫిరాయించటానికి సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ ఎంఎల్ఏల నుండి రేవంత్ కు షరతు ఎదురైందని పార్టీవర్గాల సమాచారం. ఈ విషయంపైనే అధిష్ఠానం ముఖ్యులతో రేవంత్ చర్చలు జరిపారు. మంత్రిపదవుల హామీతో 16 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరటం ఖాయమైతే కచ్చితమైన హామీ తీసుకుని ముందుకు వెళ్ళమని అధిష్ఠానం ముఖ్యనేతలు రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

లెక్కప్రకారమైతే మంత్రివర్గంలో 18 మంది మంత్రులుండవచ్చు. రేవంత్ తో కలుపుకుని ఇపుడున్నది 12 మంది మాత్రమే. ఇలాంటి డెవలప్మెంట్లను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఆరుస్ధానాలను ఖాళీగా అట్టేపెట్టారు. ఆ ఖాళీలను భర్తీచేసే అవకాశాలు ఇపుడొస్తున్నాయి. ఫిరాయింపుల షరతుల ప్రకారమే నాలుగు మంత్రిపదవులు కేటాయించినా ఇంకా రెండు ఖాళీలు కాంగ్రెస్ ఎంఎల్ఏలకే కేటాయించవచ్చు. లేదా భవిష్యత్తు అవసరాలకోసం మిగిలిన రెండింటిని ఖాళీగానే ఉంచేయచ్చు. ఏదేమైనా తొందరలోనే కేసీఆర్ కు భారీ షాక్ ఇవ్వటానికి రేవంత్ చాలాపెద్ద ప్లానే వేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News