Madhavi Latha | ఎన్నికలకంటే ముందు మాధవీలతకి తొలి పరీక్ష ఏంటంటే..?

అయితే ఊహించని విధంగా హైదరాబాద్ ఎంపీ టికెట్ ని పార్టీ సభ్యురాలు కాని మాధవీలత (Madhavi Latha) కి ఇవ్వడంతో రాజాసింగ్ బాగా హర్ట్ అయ్యారు.

Update: 2024-03-04 10:41 GMT
Madhavi Latha

వనజ మోర్ల 


బీజేపీ అధిష్టానం మాధవీలత (Madhavi Latha) కి లోక్ సభ టికెట్ ఇవ్వడంతో.. "హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించడానికి మొగోడు దొరకలేదా" అంటూ సొంత పార్టీపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే తెలంగాణ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి పార్టీ నేతల్లో అసమ్మతి రాజుకుంది. 9 మంది అభ్యర్థుల జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు, నలుగురు కొత్తవారికి చోటు కల్పించింది హైకమాండ్. దీంతో టికెట్ ఆశించిన నేతలు అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు.


హైదరాబాద్, మల్కాజ్గిరి, జహీరాబాద్ నాగర్ కర్నూల్ స్థానాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ పార్టీ కీలక నేతలు నిరాశకు లోనయ్యారు. పార్టీలో కేంద్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ నేత మురళీధర్ రావు మల్కాజిగిరి టికెట్ ఆశించారు. ఈ టికెట్ వలస వచ్చిన ఈటల రాజేందర్ కి కేటాయించడంతో ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులతో సమావేశం నిర్వహించి త్వరలో భవిష్యత్తు కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటానని ట్వీట్ చేశారు. మరోవైపు మొదటి జాబితాలో పేర్లు రాకపోవడంతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటి నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాజాసింగ్ కూడా మాధవీలతకి టికెట్ ఇవ్వడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.


image source : facebook


 MLA రాజాసింగ్ ఏమన్నారంటే..?

గతేడాది మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి అరెస్టైన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రాజాసింగ్ ని సస్పెండ్ చేసి, శాసనసభా పక్ష నేత పదవి నుంచి తొలగించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెన్షన్ వేటు తొలగించి గోషామహల్ సీటు కేటాయించింది. దీంతో ఆయన గోషామహల్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీజేపీఎల్పీ నేత పదవి కోసం ఆరటపడ్డారు కానీ దక్కలేదు. ఇక అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేసేందుకు హైదరాబాద్ పార్లమెంటు టికెట్ ఆశించారు. అయితే ఊహించని విధంగా హైదరాబాద్ ఎంపీ టికెట్ ని పార్టీ సభ్యురాలు కాని మాధవీలత కి ఇవ్వడంతో రాజాసింగ్ బాగా హర్ట్ అయ్యారు. అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. హైదరాబాద్ పార్లమెంటులో నిలబెట్టేందుకు మగాడే దొరకలేదా అంటూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో అగ్గి రాజేశాయి. రాజాసింగ్ చేసిన కామెంట్స్ ఆడవాళ్ళని కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

రాజాసింగ్ వ్యాఖ్యలపై మాధవీలత రియాక్షన్..

బీజేపీ ఎంపీ టికెట్ కైవసం చేసుకున్న మాధవీలత ఆదివారం ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంతోమంది స్త్రీల కన్నీటి ధారతో నిండిపోయిన కుండ ఓల్డ్ సిటీ అన్నారు. 4 దశాబ్దాలుగా పాలిస్తున్న ఎంఐఎం నేతలు పాతబస్తీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విద్య, వైద్యం వంటి కనీస సదుపాయాలు లేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారన్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం, వారి ఆరోగ్యాలు కాపాడుకోవడం కోసం ప్రతి తల్లి బయటకి వచ్చి బీజేపీకి ఓట్ వేస్తే గెలవడం కష్టం కాదన్నారు. అలాగే ఓల్డ్ సిటీలో 8 లక్షల హిందూ ఓటర్లు ఉన్నారని వారంతా ఏకమవ్వాలని, ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నా తమ్ముడు నన్నేదో అంటే నేను పట్టించుకోనని అన్నారు. మేమంతా ఒకే కుటుంబం అని, ఓల్డ్ సిటీలో కలిసి పని చేసి పార్టీని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


image source : facebook


 అక్కకి తమ్ముడి మద్దతు ఉంటుందా..?

వరుస వివాదాలతో బీజేపీ హైకమాండ్ కి రాజాసింగ్ తలనొప్పిగా మారారు. విజయసంకల్ప యాత్రకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. అసలు విజయసంకల్ప యాత్ర అంటే ఏంటి అని తిరిగి ప్రశ్నించడం గమనార్హం. ఆశ పెట్టుకున్న హైదరాబాద్ ఎంపీ టికెట్ విషయంలోనూ ఎదురుదెబ్బ తిన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నేడు ఆదిలాబాద్ లో జరుగుతున్న మోదీ సభకి కూడా డుమ్మా కొట్టారు. అలాంటిది తాను కోరుకున్న టికెట్ కైవసం చేసుకున్న మాధవీలతకి మద్దతు ఇస్తారనేది ప్రశ్నార్థకం. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఒకటి. కీలకం కూడా. ఆర్ధిక బలం ఉన్నపటికీ హిందూ ఓట్లు దండుకోవాలంటే తమ్ముడు రాజాసింగ్ సపోర్ట్ అక్క మాధవీలతకి అవసరం. ఈ తరుణంలో రాజాసింగ్ బెట్టు మానుకుంటారా? తనకి అండగా నిలబడేలా రాజాసింగ్ ని మాధవీలత ఒప్పించగలరా? అనేదే అసలైన చిక్కుముడి. ఎంపీ ఎన్నికల్లో గెలవడం కంటే ముందు ఆ సెగ్మెంట్ పరిధిలోని పార్టీ నేతల మద్దతు కూడగట్టుకోవడమే ఇప్పుడు మాధవీలత ముందున్న అసలు పరీక్ష. ఇందులో ఆమె ఎంతవరకు నెగ్గగలరు అనేది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News