అందరి దృష్టి ‘శ్రావణపల్లి’పైనే
నరేంద్రమోడి బొగ్గు గనులను వేలంపాటల్లో మాత్రమే కేటాయించే విధానాన్ని తీసుకొచ్చారు. దాంతో చాలా గనులపై అప్పటివరకు సింగరేణికి ఉన్న గుత్తాధిపత్యం పోయింది.
ఇపుడు అందరి దృష్టి, ఆశలు శ్రావణపల్లిపైనే ఉంది. శ్రావణపల్లి అంటే ఎవరో కాదు తెలంగాణాలోని బొగ్గుగని. మంచిర్యాల జిల్లా, మందమర్రి ప్రాంతంలోని శ్రావణపల్లిలో సింగరేణి యాజమాన్యానికి బొగ్గుగని ఉండేది. అయితే 2015లో నరేంద్రమోడి బొగ్గు గనులను వేలంపాటల్లో మాత్రమే కేటాయించే విధానాన్ని తీసుకొచ్చారు. దాంతో చాలా గనులపై అప్పటివరకు సింగరేణికి ఉన్న గుత్తాధిపత్యం పోయింది.
ఇపుడు విషయం ఏమిటంటే ఈనెల 21వ తేదీన హైదరాబాద్ లో బొగ్గుగనికి వేలంపాట జరగబోతోంది. వేలంవేసేది మాత్రం శ్రావణపల్లి బొగ్గుగని ఒక్కదానికే. ఎన్ని కంపెనీలు వేలంపాటలో పాల్గొనబోతున్నాయనే విషయాన్ని కోల్ ఇండియా లిమిటెడ్, కేంద్రప్రభుత్వం గోప్యంగా ఉంచాయి. ఇదే సమయంలో సింగరేణి యాజమాన్యం వేలంపాటలో పాల్గొంటున్నదా లేదా అన్న విషయంపై క్లారిటిలేదు. సింగరేణి వర్గాల సమాచారం అయితే వేలంపాటలో పాల్గొనేందుకు రాష్ట్రప్రభుత్వం యాజమాన్యానికి అనుమతిచ్చిందని సమాచారం. ఏ సంగతి 21వ తేదీన స్పష్టమవుతుంది. పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీయార్ ప్రభుత్వం బొగ్గుగనుల వేలంపాటల్లో సింగరేణి యాజమాన్యానికి అనుమతి ఇవ్వలేదు. బొగ్గు గనుల వేలంపాటల్లో పాల్గొనవద్దని సింగరేణి యాజమాన్యానికి రాతమూలకంగా చెప్పలేదు.
ఏ వేలంపాటలో కూడా యాజమాన్యం పాల్గొనలేదు కాబట్టి ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల కారణంగానే యాజమాన్యం వేలంపాటల్లో పాల్గొనలేదనే ప్రచారం జరిగింది. ఏదేమైనా 21వ తేదీ జరగబోతున్న వేలంపాటల్లో యాజమాన్యం పాల్గొంటున్నదనే సమాచరమైతే ఉంది. శ్రావణపల్లి బొగ్గుగనుల్లో సుమారు 12 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు గతంలో యాజమాన్యం జరిపించిన సర్వేల్లో బయటపడింది. సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గుగనులను నామినేషన్ పద్దతిలో తమకే కేటాయించాలని యాజమాన్యం ఎన్నిసార్లు అడిగినా కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. సింగరేణికి కొత్త గనులు దక్కకపోతే ఇపుడున్న గనుల్లోని బొగ్గు మహాయితే మరో పదేళ్ళు ఉత్పత్తి జరుగుతుంది. తర్వాత బొగ్గుకోసం వెతుక్కోవాల్సిందే. అలాగే దేశవ్యాప్తంగా జరిగే బొగ్గువేలంపాటల్లో సింగరేణి ప్రైవేటుసంస్ధలతో పోటీలుపడి గనులను దక్కించుకోవాల్సిందే.
విచిత్రం ఏమిటంటే 2022లో కోయగూడెం, సత్తుపల్లి-3 గనులను దక్కించుకున్న అరబిందో కంపెనీ ఇప్పటివరకు తవ్వకాలు మొదలుపెట్టలేదు. ఈ రెండు గనుల్లో సుమారు 20 కోట్ల టన్నుల బొగ్గునిల్వలున్నాయి. వేలంలో పాల్గొని బొగ్గు గనులను దక్కించుకున్న అరబిందో కంపెనీ ఎందుకని తవ్వకాలు మొదలుపెట్టలేదో అర్ధంకావటంలేదు. తవ్వకాలు మొదలుపెట్టలేదు గనులను కేంద్రప్రభుత్వానికి స్వాధీనమూ చేయలేదు. తవ్వకాలు మొదలుకాని గనులను తిరిగి తీసుకుని తమకు కేటాయించమని సింగరేణి యాజమాన్యం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రప్రభుత్వం పట్టించుకోవటంలేదు. అరబిందో కంపెనీతో సింగరేణి నేరుగా ఒప్పందాలు చేసుకునేందుకు లేదు కాబట్టే కేంద్రాన్ని పదేపదే అడుగుతోంది. మరి 21వ తేదీన ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మందా నరసింహరావు తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ‘సింగరేణికి 21వ తేదీ వేలంపాట చాలా కీలక’మన్నారు. ‘మందమర్రి ప్రాంతంలోని శ్రావణపల్లి గనిలో సుమారు 12 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయ’ని చెప్పారు. వేలంపాటలో మొదటిసారి సింగరేణి యాజమాన్యం పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ‘గడచిన పదేళ్ళు వేలంపాటల్లో పాల్గొనని యాజమాన్యం 21వ తేదీన పాల్గొనబోతోందని తమకు సమాచారం ఉంద’ని చెప్పారు. ప్రైవేటుసంస్ధలతో పోటీపడి వేలంపాటల్లో గనులను దక్కించుకోవటం సింగరేణికి కష్టమే అని మందా అభిప్రాయపడ్డారు.