తెలంగాణ ఎంఎల్ఏ దానం నాగేందర్ ఎటూ కాకుండా పోతాడేమో ?
దానం ప్రతిపక్ష ఎంఎల్ఏనా లేకపోతే అధికారపార్టీతో ఉన్న ఎంఎల్ఏనా అన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు;
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ, మాజీ మంత్రి దానం నాగేందర్ గురించి ఇపుడు ఇదే టాక్ నడుస్తోంది. కారణం ఏమిటంటే ఆయన వ్యవహార శైలి ఎవరికీ అర్ధంకావటంలేదు. దానం ప్రతిపక్ష ఎంఎల్ఏనా లేకపోతే అధికారపార్టీతో ఉన్న ఎంఎల్ఏనా అన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. దానం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) తరపున గెలిచి తర్వాత అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు దానం(Danam Nagendar) విషయంలో జనాలకు ఎందుకు కన్ఫ్యూజన్ ? మొదలైంది. అయితే బీఆర్ఎస్ ఎంఎల్ఏ అవుతారు లేకపోతే ఫిరాయింపు ఎంఎల్ఏగా కాంగ్రెస్ లో ఉంటారు కదా ? అనే సందేహం రావచ్చు.
ఇప్పుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్ లో ఉన్నపుడు రేవంత్(Revanth) పాలనను మెచ్చుకునేవారు. అధికారపార్టీలో తప్ప ప్రతిపక్షంలో ఉండలేని దానం గెలిచిన తర్వాత కాంగ్రెస్(Congress) లోకి ఫిరాయించారు. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ మద్దతు ఎంఎల్ఏగా ఉన్నారా అంటే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఎల్కతుర్తి బహిరంగసభ(Elkaturthy public meeting) గ్రాండ్ సక్సెస్ అవుతుందని దానం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో సంచలనంగా మారాయి. కేసీఆర్ ను చూసేందుకు జనాలు ఎగబడి బహిరంగసభకు వస్తారని దానం చెప్పటం ఏమిటో హస్తంపార్టీ నేతలకు అర్ధంకావటంలేదు.
అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabarwal) కు మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హాయ్ హైదరాబాద్(Hyderbad) సంస్ధలో వచ్చిన ట్వీట్ ను స్మిత రీ ట్వీట్ చేశారే కాని ఆమెంతట ఆమెగా ట్వీట్ చేయలేదు కదా ? అని దానం ప్రశ్నించారు. స్మిత సదరు ట్వీట్ ను రీ ట్వీట్ చేయటంలో తప్పేముందని కూడా అమాయకంగా అడగటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ సర్వీసులోఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయటం ఉద్యోగి సర్వీసు నిబంధనలకు విరుద్ధమన్న చిన్నవిషయం కూడా దానంకు తెలీకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా ఇరుకునపడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(HCU) 400 ఎకరాల అంశంలో స్మిత చేసిన రీ ట్వీట్ కారణంగా ప్రతిపక్షాలు ఆమె రీట్వీట్ ను తమఆరోపణలకు మద్దతుగా చూపించుకున్నాయి.
ఈవిషయాన్ని వదిలేస్తే తననియోజకవర్గంలో జరిగిన కొన్ని శంకుస్ధాపన కార్యక్రమాలు తనకు తెలియకుండానే జరగాన్న కోపంతో సదరు శంకుస్ధాపన ఫలకాలను ధ్వంసంచేయటం సంచలనం అయ్యాయి. ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులతో రోడ్డుపైనే దానం వాగ్వాదానికిదిగి జనాలందరి ముందు వారిని బెదిరించటం గతంలో కలకలం రేపింది. బీఆర్ఎస్ లో ఉన్నపుడు రేవంత్ పాలనను అభినందించటం, తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించి ఇపుడు కేసీఆర్ ను అభినందించటం, బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమనటం ఏమిటో దానంకే తెలియాలి. ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నాడో మిగిలిన వాళ్ళకు కాదు చివరకు దానంకైనా అర్ధమవుతోందో లేదో.
పదవి కాపాడుకునేందుకేనా ?
తనఎంఎల్ఏ పదవిని కాపాడుకునేందుకే దానం ఇలాగ మాట్లాడుతున్నాడనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నుండి ఫిరాయించిన 10 మంది ఎంఎల్ఏలమీద(BRS Defection MLAs) అనర్హతవేటు వేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హతవేటు కేసు సుప్రింకోర్టు విచారణలో ఉంది. మిగిలిన ఫిరాయింపు ఎంఎల్ఏల విషయం ఎలాగున్నా దానం మీద అనర్హత వేటుపడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఏమిటంటే దానం బీఆర్ఎస్ తరపున గెలిచాడు. తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించాడు. బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా 2024 సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేశాడు. కాంగ్రెస్ లోకి ఫిరాయించటాన్ని వదిలేస్తే బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉంటూనే కాంగ్రెస్ ఎంపీగా ఎలాగ పోటీచేస్తాడు ? అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్.
ఈపాయింట్ మీదే దానంపై అనర్హత వేటుపడటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే విధమైన అనుమానం బహుశా తనకు కూడా వచ్చిందేమో. తనపై అనర్హత వేటును తప్పించుకునేందుకే కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నట్లున్నాడు. అయితే దానం నైజం గ్రహించిన తర్వాత కేసీఆర్(KCR) తిరిగి పార్టీలో చేర్చుకుంటారా అన్నదే అనుమానం. ఫిరాయింపు ఎంఎల్ఏలను తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రశ్నేలేదని కేటీఆర్ చాలాసార్లు ప్రకటించారు. పైగా ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హత వేటుపై సుప్రింకోర్టులో విచారణ కూడా దాదాపు పూర్తయిపోయింది. ఫిరాయింపుల మీద అనర్హతవేటు విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోమని సుప్రింకోర్టు గనుక తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు గడువును నిర్దేశిస్తే అప్పుడు ఏమవుతుంది ? అన్నదే ఆసక్తిగా మారింది.