కాంగ్రెస్ ఆశలన్నీ మహిళలపైనేనా ?

13వ తేదీన జరగబోయే తెలంగాణా పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మహిళల ఓట్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది.

Update: 2024-05-08 04:13 GMT
free travel for women

ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ప్రతి పార్టీ ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. వీటిల్లో కూడా మహిళా ఓటర్లను ఆకర్షించటానికి ప్రత్యేకంగా పోటీపడుతున్నాయి. ఎందుకంటే ఓటర్లలో చాలాచోట్ల మహిళల ఓట్లే ఎక్కువకాబట్టి. ఇపుడు విషయం ఏమిటంటే 13వ తేదీన జరగబోయే తెలంగాణా పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మహిళల ఓట్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది. మహిళా ఓటర్లను ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వారికే ఎక్కువ వరాలను ప్రకటించింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మూడు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించినవే. అలాగే మిగిలిన హామీలు కూడా పరోక్షంగా మహిళలకు లబ్దికలిగించేవే అనటంలో సందేహంలేదు.

ప్లాన్ మార్చిన కాంగ్రెస్

ఇపుడు విషయం ఏమిటంటే మరో ఐదురోజుల్లో జరగబోతున్న పోలింగులో ప్రచారం విషయంలో కాంగ్రెస్ ప్లాన్ మార్చింది. ఏమిటంటే పార్టీ నేతలు, క్యాడర్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారంలో ఓటర్లను కలవాలని. ఆ ప్రచారం కూడా ఏమనంటే మహిళలకు, రైతులకు, యువతకు తమ ప్రభుత్వంలో జరుగుతున్న, జరగబోయే మంచిగురించి వివరించాలని. అవేమిటంటే బస్సుల్లో ఉచిత ప్రయాణం, రు. 500 కే సబ్సిడి గ్యాస్ సిలిండర్లు, మహిళా గ్రూపులకు సున్నావడ్డీకే రుణాలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను వివరించబోతున్నారు. అలాగే రైతుబంధు పథకంలో ఇఫ్పటికే 60 లక్షల మంది రైతులకు రు. 5500 కోట్ల లబ్ది జరిగిన విషయాన్ని కూడా నేతలు వివరించనున్నారు.

ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు 30 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. పథకం మొదలైనప్పటినుండి ఇప్పటికి సుమారు 30 కోట్లమంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ వర్గాలు చెప్పాయి. దీనిపైన మేథావులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకునే ఆడవారిలో దిగువమధ్యతరగతితో పాటు పేదమహిళలే ఎక్కువగా ఉన్నారు. వీరందరికీ ఉచిత ప్రయాణం వల్ల టికెట్లు కొనేందుకు అయ్యే ఖర్చులు మిగులుతాయి. అలా మిగిలిన డబ్బులను ఇంటి అవసరాలకే మహిళలు ఖర్చు చేస్తారు. అలాగే రు. 500కే మూడు సిలిండర్ల ఇవ్వటం వల్ల డైరెక్టుగా మహిళలే లబ్దిదారులు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ వంటకోసమే వాడుతారు. అలాంటిది ఇపుడు మూడు సిలిండర్లను 500 రూపాయలకే అందిస్తున్న కారణంగా ప్రతి సిలిండర్ ధరలో సుమారు 600 రూపాయలు మిగులుతుంది.

పథకాల లబ్దిదారులెంతమంది ?

ప్రభుత్వలెక్కల ప్రకారం సుమారు 40 లక్షల ఇళ్ళకు సబ్సిడి గ్యాస్ సిలిండర్ల సౌకర్యం అందుతోంది. సబ్సిడి రూపంలో మిగిలే డబ్బును కూడా ఆడోళ్ళు ఇంటికే వాడుతారు. 200 యూనిట్ల ఉచితవిద్యుత్ సౌకర్యం 50 లక్షల ఇళ్ళకు అందుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉచిత ప్రయాణం, సబ్సిడీ గ్యాస్, మహిళా గ్రూపులకు సున్నావడ్డీకే రుణాలు ప్రత్యక్షంగా మహిళలకు లబ్దిచేకూరే పథకాలు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో మిగిలే డబ్బు కూడా ఇంటికే ఉపయోగించే అవకాశముంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు నాలుగు పథకాల్లో డైరెక్టుగా లబ్దిపొందుతున్నారు.

అలాగే 60 లక్షల మంది రైతులు రైతుబంధు పథకంలో రు. 5500 కోట్లు బెనిపిట్ అందుకున్నారు. వ్యవసాయంలో కూడా మహిళలపాత్రను పక్కనపెట్టేందుకు లేదు. ఇక గడచిన నాలుగు నెలల్లో వివిధ ఉద్యోగాలుపొందిన 30 వేలమందికి ప్రభుత్వం అపాయింట్మెంట్ లెటర్లు అందించింది. ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో 11 వేల టీచర్ పోస్టులకు 3 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. 563 గ్రూప్-1 ఉద్యోగాలకు 5 లక్షలమంది యువత దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో అయినా దరఖాస్తులు చేసుకున్న వారిలో అయినా మహిళల సంఖ్య తక్కువుండదు.

ఉచిత బస్సు సౌకర్యం బాగుంది

ఉచితప్రయాణం గురించి ఉమ అనే సర్వెంట్ మైడ్ మహిళ మాట్లాడుతు ఉచిత ప్రయాణం తమకు చాలా సౌకర్యంగా ఉందని చెప్పింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు హౌదరాబాద్ నుండి వరంగల్ జిల్లాలోని మరిపెడ బంగ్లాకు వెళ్ళొస్తున్నట్లు చెప్పారు. ఉచిత ప్రయాణం కారణంగా తమ ఊరిలోని ఆడవాళ్ళు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళొస్తున్నట్లు చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం వల్ల తమతో పాటు ఊరిలో చాలామంది హ్యాపీగా ఉన్నట్లు చెప్పింది. సబ్సిడీ గ్యాస్ తమకు ఇంకా అందటంలేదని అయితే ఊరిలో కొందరు ఉపయోగించుకుంటున్నట్లు చెప్పింది. రైతుబంధు డబ్బులు కూడా ఊరిలో చాలామందికి అందుతున్నట్లు చెప్పింది. వెంకన్న అనే టెంపో డ్రైవర్ మాట్లాడుతు పాల్వంచలోని తమ గ్రామంలో 200 యూనిట్ల ఉచితవిద్యుత్, ఉచిత ప్రయాణసౌకర్యం తమకు అందుతోందన్నారు. రైతుబంధు డబ్బులు కూడా తమకు వచ్చినట్లు చెప్పాడు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఎవరూ అందుబాటులోకి రాలేదు.

మొత్తం ఓటర్లు ఎంతమంది ?

ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రకారం తెలంగాణాలో 3,17,17,389 ఓటర్లున్నారు. వీరిలో 1,58, 71,483 పురుషులైతే, మహిళా ఓటర్లు 1,58,43, 339. 18-19 వయసుల ఓటర్లు 8,11,640, 20-29 మధ్య ఓటర్లు 60,39,992, 30-40 వయస్సుల ఓటర్లు 99,35,894, 41-60 మధ్య ఓటర్లు 1,07,34,221. 60 ఏళ్ళకు పైబడిన ఓటర్లు 41,95,642 మంది ఉన్నారు. పై వయస్సుల్లోని ఓటర్లలో మెజారిటి ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ అనుకుంటోంది. అన్నీ పడకపోయినా కనీసం మహిళల ఓట్లు పడినాచాలు తమ టార్గెట్ 14 సీట్లలో గెలుపు గ్యారెంటీ అని కాంగ్రెస్ భావిస్తున్నది. మరి పోలింగ్ రోజున మహిళా ఓటర్లు ఏమిచేస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News