రేవంత్ చెబుతున్న ‘ఆ రెండు అసత్యాలే’ ఇబ్బందిగా మారుతాయా ?
రేవంత్ చెబుతున్న రెండు అబద్ధాలే భవిష్యత్తులో పార్టీకి బాగా ఇబ్బందిగా మారుతుందేమో అని నేతలు అనుమానిస్తున్నారు;
ఇపుడిదే విషయంపై కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య బాగా చర్చ జరుగుతోంది. ఇపుడు రేవంత్ చెబుతున్న రెండు అబద్ధాలే భవిష్యత్తులో పార్టీకి బాగా ఇబ్బందిగా మారుతుందేమో అని నేతలు అనుమానిస్తున్నారు. ఇంతకీ రేవంత్ చెబుతున్న అబద్ధాలు ఏమిటి ? ఏమిటంటే మొదటిది తమ ప్రభుత్వం రైతురుణమాఫీ చేసేసిందని. రెండో అబద్ధం ఏమిటంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని. రేవంత్(Revanth) ఎక్కడ బహిరంగసభలో మాట్లాడినా, జరుగుతున్న సమీక్షల్లో లేదా పార్టీ సమావేశాల్లో కూడా పై రెండు అబద్ధాలను పదేపదే రిపీట్ చేస్తున్నాడు. ఇక్కడ రేవంత్ మరచిపోయిన విషయం ఏమిటంటే రుణమాఫీ(Farmer Loan Waiver) నూరుశాతం జరగలేదన్న విషయం అందరికీ తెలుసు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC reservations) అమలుచేయటం రాష్ట్రప్రభుత్వం చేతిలో లేదన్న విషయం కూడా అందరికీ తెలుసు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) తీర్మానం చేసిన విషయం తెలిసిందే. రేవంత్ నాయకత్వంలోని అధికారపార్టీ చేయగలిగింది ఏమిటంటే అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్రప్రభుత్వానికి పంపటం మాత్రమే. అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని ఏమిచేయాలన్నది కేంద్రంలోని నరేంద్రమోడీ(Narendra Modi) ప్రభుత్వం ఇష్టం. అసెంబ్లీ పంపిన తీర్మాన్ని కేంద్రం తిరస్కరించవచ్చు లేదా అమోదించవచ్చు. కేంద్రంలో ఎవరి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నా అసెంబ్లీ తీర్మానాన్ని తిరస్కరించదు. ఎందుకంటే బీసీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును తిరస్కరిస్తే అది కేంద్రప్రభుత్వానికి బాగా మైనస్ అవుతుంది. బిల్లు తిరస్కరణను రేవంత్ ప్రభుత్వం బాగా అడ్వాంటేజ్ తీసుకుని కేంద్రం, బీజేపీని దుమ్ముదులిపేస్తుంది. కాబట్టి వచ్చిన బిల్లును కేంద్రం తిరస్కరించదు.
బిల్లును తిరస్కరించదు సరే ఆమోదిస్తుందా ? అమోదం కూడా సాధ్యంకాదు. ఎందుకంటే బిల్లును క్యాబినెట్లో చర్చించినా లేదా పార్లమెంటులో చర్చకు పెట్టినా క్రెడిట్ మొత్తం రేవంతే కొట్టేస్తాడు. ఈ విషయం ఆలోచించలేనంత అమాయకులు కాదు ఎవరు. అందుకనే ఇటు తిరస్కరించకుండా అటు సానుకూలంగా స్పందించకుండా అధ్యయనంపేరుతో ఏదో కమిటీకి అప్పగిస్తుంది కేంద్రప్రభుత్వం. అధ్యయనం అంటే బిల్లును కోల్డ్ స్టోరేజీలో పెట్టేసినట్లే. కాబట్టి బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నదని రేవంత్ చెబుతున్నదంతా అబద్ధమే.
ఇక రుణమాఫీ విషయం చూద్దాం. రుణమాపీ హామీని రేవంత్ ప్రభుత్వం పాక్షికంగా మాత్రమే అమలుచేసింది. రు. 50 వేలనుండి రు. 2 లక్షల మధ్య ఉన్న రుణాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీచేసింది. సుమారు 36 లక్షలమంది రైతులు రుణమాఫీ హామీవల్ల లబ్దిపొందినది వాస్తవం. రు. 50 వేలు-రు. 2 లక్షల మధ్య రుణాలున్న సుమారు 4 లక్షల మంది రైతుల రుణాలు ఇంకా మాఫీకాలేదు. వీళ్ళు కాకుండా రు. 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతుల రుణాలు అసలు మాఫీయే కాలేదు. ఇలాంటి రైతుల సంఖ్య సుమారు 14 లక్షలుంటుంది. రు. 2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతుల్లో 4 లక్షల మందికి రుణమాఫీ ఎందుకు వర్తించలేదు ? ఎందుకంటే సాంకేతిక కారణాలు అడ్డువస్తున్నాయి.
సాంకేతిక కారణాలు ఏమిటి ?
సాంకేతిక కారణాలు ఏమిటంటే ఆధార్ కార్డులను బ్యాంకు ఖాతాలతో అనుసంధానించకపోవటం. కొందరు రైతుల ఆధార్ కార్డుల్లోని పేర్లు, బ్యాంకు ఖాతాల్లోని పేర్లతో మ్యాచ్ కావటంలేదు. బ్యాంకు ఖాతాల్లోని పేర్లు, ఆధార్ కార్డుల్లోని పేర్లు వేర్వేరుగా ఉండటం. ఆధార్ కార్డుల్లోని పేర్ల స్పెల్లింగుల్లో తప్పులవల్ల బ్యాంకులు రుణమాఫీని తిరస్కరించాయి. బ్యాంకు ఖాతాల్లోని ఫొటోలు, ఆధార్ కార్డుల్లోని ఫొటోలు మ్యాచ్ కావటంలేదు. నిజానికి 40 లక్షల మంది రైతుల రుణమాఫీకి అవసరమైన నిధులను ప్రభుత్వం బ్యాంకులకు పంపింది. అయితే పైన చెప్పిన కారణల వల్ల సుమారు 4 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బుజమచేయటాన్ని సాఫ్ట్ వేర్లు తిరస్కరించాయి. దీనివల్ల రైతుల ఖాతాల్లో డబ్బులుపడలేదు కాబట్టే వీరికి రుణమాఫీ కాలేదు. వాస్తవంగా చూస్తే ఇందులో ప్రభుత్వం తప్పేమీలేదు. అందుకనే సాంకేతిక కారణాలను సర్దుబాటు చేసుకుని రుణమాఫీ చేయించుకోమని ప్రభుత్వం రైతులకు చెప్పింది.
ఇక 2 లక్షల రుణహామీని అమలుచేయటానికి ప్రభుత్వం దగ్గర సరిపడా డబ్బులేదు. అందుకనే ముందు రైతులు గనుక తాము తీసుకున్న రుణాలను తీర్చేసి ప్రభుత్వానికి సమాచారం అందిస్తే ఆమొత్తాని వెంటనే ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుందని చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రైతు తీసుకున్న 2 లక్షల రూపాయలను మాత్రమే ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది రుణంమీద వడ్డీని కాదు. ఈ విషయం హామీ ఇచ్చేటప్పుడే రేవంత్ స్పష్టంగా చెప్పారు. అయితే ‘చేతిలో డబ్బులేని కారణంగానే కదా తాము బ్యాంకులో అప్పుతీసుకున్నద’ని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎన్నిమాట్లాడినా ప్రభుత్వం అయితే రైతులు తమ రుణాలను బ్యాంకులకు తీర్చితే వెంటనే తాము డబ్బులు చెల్లిస్తామని తేల్చిచెప్పేసింది.
ఈ పద్దతిలో కొందరు రైతులు బయటెక్కడో అప్పులుచేసి బ్యాంకులకు కట్టేశారు. బ్యాంకులో రుణాలు తీర్చిన రైతుల ఖాతాల్లో రు. 2 లక్షలు పడింది కూడా. రైతు అప్పు తీర్చేసినట్లు బ్యాంకునుండి ప్రభుత్వానికి సమాచారం వస్తుంది. సమాచారం అందగానే ప్రభుత్వం సదరు రైతు ఖాతాలో రు. 2 లక్షలు డిపాజిట్ చేస్తోంది. అయితే ఈ పద్దతిలో ముందు అప్పుతీర్చి తర్వాత ప్రభుత్వం నుండి 2 లక్షల రూపాయలను రీఎంబర్స్ చేయించుకున్న రైతుల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. కారణం ఏదైనా కానీండి రుణమాఫీ హామీ నూరుశాతం అమలుకాలేదన్న విషయం అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన విషయాన్ని కూడా రేవంత్ పదేపదే రుణమాఫీ అమలుచేశామని ఎలా చెబుతున్నాడో అర్ధంకావటంలేదు.
6 గ్యారెంటీస్ లో నూరుశాతం అమలవుతున్న హామీ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రు. 10 లక్షలకు పెంచటం మాత్రమే. మిగిలిన నాలుగు హామీలతో పాటు కాలేజీల్లో చదివే విద్యార్ధినులకు స్కూటీలు, మహిళలకు తులం బంగారం లాంటి హామీలు చాలానే పెండింగులో ఉన్నాయి. పాక్షికంగా అమలవుతున్న హామీలు నూరుశాతం, అసలు అమలుకే నోచుకోని హామీలను అమల్లోకి తేవటం ఎప్పడవుతుందో ఏమో.