ఫార్మా పరిశ్రమల్లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకం

నిన్న పాశమైలారం నేడు మేడ్చల్ ఫార్మా ఇండస్ట్రీలో పేలిన బాయిలర్.ఈ ఘటనల్లో 42 మందికి పైగా కార్మికులు మృత్యువాత పడ్డారు.;

Update: 2025-07-01 14:58 GMT
పాశమైలారంలోని సిగాచి ఫార్మా ఇండస్ట్రీలో పేలుడు

తెలంగాణ రాష్ట్రంలో కేవలం రెండు రోజుల్లోనే రెండు ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయి.సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా ఇండస్ట్రీలో సోమవారం జరిగిన ఘోర పేలుడు ఘటనలో 42 మంది కార్మికులు మరణించారు.ఫార్మా పరిశ్రమల్లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలోనే ఫార్మా పరిశ్రమలో జరిగిన అతి పెద్ద ప్రమాద ఘటనగా పేరొందింది. మరో వైపు ఈ సంఘటన జరిగిన రెండో రోజే మేడ్చల్ పట్టణంలోని పారిశ్రామికవాడలో అల్కలాయిడ్ బయో యాక్టివ్ ఫార్మా పరిశ్రమలో మంగళవారం బాయిలర్ పేలిన ఘటనలో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ఘటనలతో ఫార్మా పరిశ్రమల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అనే కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.


పాశమైలారం అగ్నిప్రమాదంపై పోలీసు కేసు
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై బాధిత కార్మిక కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదుతో బీడీఎల్ భానూరు పోలీసులు సెక్షన్ 105,110,117 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి రాని పరిశ్రమ యజమానిపై సర్కార్ సీరియస్ అయింది.

తెలంగాణ హెచ్చార్సీ సుమోటో విచారణ
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు చేశారు.అగ్నిమాపక శాఖ, ఫ్యాక్టరీ ఇన్ స్పెక్టరు ఇతర అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. దీంతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా పాశమైలారం అగ్నిప్రమాద ఘటనను విచారణకు స్వీకరించింది. దీనిపై నివేదికను జులై 30వతేదీలోగా విచారణ జరిపి హెచ్చార్సీకి సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్,అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.



 కాలం చెల్లిన మిషనరీతోనే అగ్ని ప్రమాదం

పాతబడిన మిషనరీ వాడటం... అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం కారణంగా ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందని అంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులను డిస్మిస్ చేసి , సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని న్యాయవాది కుమారస్వామి డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా,ఇండిపెండెంట్ కమిటీ వేసి , రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ లలో నాణ్యత ప్రమాణాలపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించాలని న్యాయవాది హెచ్చార్సీని కోరారు.

ఇది అత్యంత విషాదకరమైన దుర్ఘటన : సీఎం రేవంత్ రెడ్డి
పాశమైలారంలోని ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాద ఘటన అత్యంత విషాదకరమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇప్పటివరకు ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదని , ఇప్పటి వరకు 42 మంది చనిపోయారు.143 మంది పరిశ్రమలో ఉండగా, 58 మందిని అధికారులు గుర్తించారని మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం చెప్పారు. మరణించిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించానని సీఎం చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించానని సీఎం వివరించారు.

ఘటనకు బాధ్యులపై చర్యలు
గాయపడినవారికి మెరుగైన చికిత్సఅందించాలని ఆదేశించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఘటనకు బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళతామని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కంపెనీల్లో పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేయాలని అధికారులను ఆదేశించామని సీఎం వివరించారు.

కొనసాగుతున్న సహాయ చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే నిన్నటి నుంచి మొత్తం యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. మంత్రులు, పోలీసులు ఉన్నతాధికారులు, ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది అంతా శిథిలాల తొలగింపు, ఇతర సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది ఆచూకీ దొరకలేదు. కంపెనీలో 143 మంది పనిచేస్తుండగా, వారిలో 58 మంది అధికారులకు టచ్ లోకి వచ్చారు. బీహార్, ఒరిసా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారూ ఉన్నట్టు గుర్తించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అన్నది పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ
ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రమాద నికి గల కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు ఇతర పరిశ్రమ లలో జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. నిరంతరం అధికారుల బృందం పరిశ్రమలను తనిఖీ చేయాలని ప్రమాదం జరిగే అవకాశం ఉన్నచోట జాగ్రత్త చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశ్రమలు ఫైర్ సేఫ్టీ శాఖల అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News