మల్లోజుల, ఆశన్న ప్రాణాలకు డేంజర్ ?

నిన్నటి వరకు ప్రాణాలు తీయాలని వెంటాడి, వేటాడిన తుపాకులే ఇపుడు మల్లోజుల, ఆశన్న ప్రాణాలకు రక్షణగా ఉండాల్సి రావటం విధి విచిత్రం

Update: 2025-10-22 08:08 GMT
Maoist leaders Aasanna and Mllojula

ఈమధ్యనే లొంగిపోయిన మావోయిస్టుపార్టీ కీలకనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ళపల్లి వాసుదేవరావు(ఆశన్న)కు కేంద్రప్రభుత్వం వై క్యాటగిరి భద్రత కల్పిస్తున్నదా ? మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఇపుడిదే అంశంపై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కారణం ఏమిటంటే లొంగిపోయిన మావోయిస్టులకు (Maoists)ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం ఎలాంటి భద్రతను కల్పించలేదు. అందుకనే ఇపుడు మల్లోజుల, ఆశన్నలకు వై క్యాటగిరి భద్రత(Y category security) కల్పించాలని కేంద్రహోంశాఖకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా సిఫారసుచేయటంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

గతంలో ఎంతోమంది మావోయిస్టులు లొంగిపోయినా ఇపుడు మల్లోజుల, ఆశన్నకు మాత్రమే భద్రత కల్పించాలని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎందుకు సిఫారసుచేసినట్లు ? ఎందుకంటే మావోయిస్టు పార్టీ ఆలోచనలకు, ఆదేశాలకు విరుద్ధంగా తమమద్దతుదారులతో పైఇద్దరు కీలకనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు కాబట్టే. మల్లోజుల, ఆశన్నలు వేర్వేరుగా తమ మద్దతుదారులు సుమారు 310 మందితో లొంగిపోయారు. ఇన్నివందల మంది ఒకేసారి లొంగిపోవటం ఒకఎత్తయితే ఆయుధాలతో సహా లొంగిపోవటమే మావోయిస్టుపార్టీకి పెద్ద దెబ్బ. మల్లోజుల లొంగిపోవటాన్ని పార్టీ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. లొంగిపోవాలని అనిపిస్తే లొంగిపోవచ్చని మల్లోజులకు పార్టీ నాయకత్వం స్పష్టంచేసింది. అయితే లొంగిపోయే ముందు ఆయుధాలను పార్టీకి సరెండర్ చేయాలని ఆదేశించింది. ఆయుధాలను సరెండర్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సుంటుందని హెచ్చరించింది.

అయితే పార్టీ నాయకత్వం ఆదేశాలు, హెచ్చరికలను మల్లోజుల ఏమాత్రం ఖాతరుచేయలేదు. మల్లోజులకు ఇచ్చిన ఆదేశాలు, హెచ్చరికలనే పార్టీ ఆశన్నకు కూడా ఇచ్చింది. వీళ్ళిద్దరు ఆయుధాలను తీసుకుని మద్దతుదారులతో లొంగిపోయారు. ఈ విషయంలోనే పార్టీ నాయకత్వం బాగా సీరియస్ గా ఉన్నది. అందుకనే విప్లవద్రోహులను ప్రజలు తీవ్రంగా శిక్షిస్తారని హెచ్చరించింది. 310 మంది మావోయిస్టులు 200 ఆయుధాలతో ప్రభుత్వానికి లొంగిపోయారు. వీటిలో 20 ఏకే 47 తుపాకులు, 50కి పైగా ఇన్సాస్ తుపాకులున్నట్లు సమాచారం. వార్నింగిచ్చినా ఆయుధాలను సరెండర్ చేయకుండా పోలీసుల ముందు తుపాకులతో సహా లొంగిపోవటాన్ని పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్నది. అందుకనే పై ఇద్దరిపైన మావోయిస్టులు ఎప్పుడైనా దాడిచేయచ్చని సెంట్రల్ ఇంటెలిజెన్స్ అనుమానం వ్యక్తంచేసినట్లు సమాచారం.

వై క్యాటగిరి భద్రత

ఇపుడు విషయం ఏమిటంటే మల్లోజు, ఆశన్నలకు పార్టీ నుండి ఎలాంటి ప్రాణహాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదపడింది. అందుకనే ఈ ఇద్దరు కీలకనేతలకు వై క్యాటగిరి భద్రత ఇవ్వబోతున్నట్లు సమాచారం. వై క్యాటగిరి భద్రత అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారుల సిఫారసు మీద ఆధారపడుంటుంది. వివిధ రంగాల్లోని ప్రముఖులు ముఖ్యంగా రాజకీయ నేతలకు ఎక్కువగా వై క్యాటగిరి భద్రతను కేంద్రప్రభుత్వం కల్పిస్తుంది. సుశిక్షితులైన కమేండోలతో పాటు సాయుధ పోలీసు అధికారులు సుమారు 11మంది వై క్యాటగిరి భద్రత కలిగిన ప్రముఖులకు 24 గంటలు రక్షణగా ఉంటారు. వీరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేంద్రమే కేటాయిస్తుంది. ఈ భద్రతను కలిగిన ప్రముఖులకు కేంద్రప్రభుత్వమే వ్యక్తిగత భద్రతాధికారిని కూడా కేటాయిస్తుంది.

మల్లోజుల, ఆశన్నలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వం మీదుంది. ఎందుకంటే పార్టీలో మిగిలిన నేతల అనుపానులను తెలుసుకునేందుకు లొంగిపోయిన ఇద్దరి సహకారం కేంద్రానికి చాలా అవసరం. పార్టీలో ఎంతమంది కీలకంగా ఉన్నారు ? ఆయుధాల వ్యవహారాలు, యాక్టివ్ గా దళసభ్యుల వివరాలు, మావోయిస్టుల రహస్య స్ధావరాలు, పార్టీ వ్యూహాల్లాంటి అనేక వివరాలు మల్లోజుల, ఆశన్నల ద్వారా కేంద్రం తెలుసుకోవాల్సుంది. పార్టీలో మిగిలిన వాళ్ళు కూడా లొంగిపోయేలా ఒత్తిడి తేవాలంటే కేంద్రప్రభుత్వానికి వీళ్ళిద్దరి సహకారం చాలా అవసరం. ఆపరేషన్ కగార్ నూరుశాతం విజయం సాధించాలంటే మల్లోజుల, ఆశన్నల సహకారాన్ని కేంద్రహోంశాఖ తీసుకోబోతోంది. అందుకనే వీళ్ళిద్దరికి ఎలాంటి ప్రాణహాని జరగకుండ చూసుకోవటం కేంద్రానికి చాలా చాలా అవసరం.

2026, మార్చి 31వ తేదీకి దేశాన్ని మావోయిస్టు రహితదేశంగా మార్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్సించారు. ఈ బాధ్యతను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందుకనే సుమారు 3 లక్షలమంది సాయుధ భద్రతాసిబ్బందితో ‘ఆపరేషన్ కగార్’ అనే మిషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ కగార్ లో ఇప్పటికే మావోయిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరరావు, ఆరుగురు సెంట్రల్ కమిటి సభ్యులతో పాటు వందలమంది మావోయిస్టులు చనిపోయారు. మరికొన్ని వందలమంది పోలీసులకు లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు పార్టీ దాదాపు నీరుకారిపోయిందనే చెప్పాలి.

మావోయిస్టుపార్టీ మూడురకాల సమస్యలను ఎదుర్కొంటోంది. అవేమిటంటే అనుకున్నంతగా కొత్తనియామకాలు జరగటంలేదు. గతంలో లాగ యువత ఇపుడు మావోయిస్టుపార్టీకి ఆకర్షితులు కావటంలేదు. అలాగే అనారోగ్యాలు, వృద్ధాప్యం కారణంగా కీలకనేతలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ విధానాలతో విబేదిస్తున్న కారణంగా మామూలు ప్రజలు పార్టీకి దూరమైపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది. ఆపరేషన్ కగార్ దెబ్బకు కీలకనేతలు ఎన్ కౌంటర్లో చనిపోతున్నారు లేకపోతే లొంగిపోతున్నారు. తాజాగా 310 మంది ఆయుధాలతో సహా లొంగిపోవటం అన్నది పార్టీకి పెద్ద దెబ్బనే చెప్పాలి. పైనచెప్పిన కారణాలతో మావోయిస్టు పార్టీ పూర్తిగా డిఫెన్సులో పడిపోయింది.

ఆయుధాలను అప్పగించాల్సిందే : జంపన్న

మావోయిస్టులు ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించటమే కరెక్టని 2017లోనే ప్రభుత్వానికి లొంగిపోయిన గినుగు నర్సింహారెడ్డి @ జంపన్న చెప్పారు. ‘‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు మల్లోజుల, ఆశన్నలు ప్రభుత్వానికి లొంగిపోయారని జరుగుతున్న ప్రచారం తప్ప’’ని చెప్పారు. ‘‘మావోయిస్ట్ మద్దతుదారులతో కీలకనేతలు ప్రభుత్వానికి లొంగిపోలేదని, కేవలం సాయుధపోరాటాన్ని విరమించారంతే’’ అని స్పష్టంచేశారు. ‘‘సాయుధపోరాటాన్ని విరమించినపుడు తమదగ్గరున్న ఆయుధాలను ప్రభుత్వానికి సరెండర్ చేయటమే కరెక్ట’’ని జంపన్న అభిప్రాయపడ్డారు. ‘‘ఆయుధాలు అప్పగించకుండా వ్యక్తులు మాత్రమే సాయుధ పోరాటాన్ని విరమిస్తామంటే ప్రభుత్వం అంగీకరించద’’ చెప్పారు. వీరు సాయుధపోరాటాన్ని విరమించేటపుడు పార్టీకి ఆయుధాలు అప్పగించటం తప్పని కూడా అన్నారు.

‘‘మీడియాలో వస్తున్నట్లు మల్లోజుల, ఆశన్నలకు పార్టీనుండి ప్రాణహాని జరుగుతుందని అనుకోవటంలేద’’ని జంపన్న అభిప్రాయపడ్డారు. ‘‘ఒకవేళ ప్రభుత్వం వైక్యాటగిరి భద్రత కల్పిస్తానని చెప్పినా వీళ్ళు తీసుకుంటారని తాను అకోవటంలేద’’ని కూడా అన్నారు. ‘‘మల్లోజుల, ఆశన్నలకు కేంద్రప్రభుత్వం వై క్యాటగిరి భద్రత కల్పిస్తుందన్న వార్తలను తాను నమ్మటంలేద’’ని కూడా అన్నారు.

Tags:    

Similar News