తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమో, బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడ మరణించగా మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు క్లియర్ చేయించారు. క్షతగాత్రులను హుటాహుటిన తిరువన్నామలైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. తిరుపతి సుబ్బారెడ్డి నగర్, రెడ్డిగుంటకు చెందిన మూడు కుటుంబాలు కలిసి ఒకే సుమోలో తిరువన్నామలై పౌర్ణమి యాత్ర కోసం శైవ క్షేత్రానికి వచ్చాయి. దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో నిద్రమత్తే ప్రధాన కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల ప్రయాణిస్తున్న సుమో.. బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో తప్పు ఎవరిది అన్న విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన షేక్ నాయక్ రసూల్ వయసు 25(సుమో డ్రైవర్), సుజాత వయసు 28, ఆదినారాయణ వయసు 45, రసింగమ్మల్ వయసు 42, జ్యోతి వయసు 35, వరలక్ష్మీ వయసు 55, గోపాల్ వయసు 37, నిర్మల వయసు 40, లలిత వయసు 19, తావిట్టినాయుడు వయసు 38 అందరూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.