డీఎంకే, స్టాలిన్ పై విజయ్ విమర్శలు
రాజకీయ గందరగోళాల వల్లే కరూర్ సంఘటన జరిగిందన్నా టీవీకే అధినేత
By : Nisha P Sekar
Update: 2025-11-06 13:21 GMT
కరూర్ తొక్కిసలాట తరువాత తమిళగ వెట్రి కజకం (టీవీకే) బుధవారం మహాబలిపురం తన మొదటి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకుముందు అది రాజకీయ ప్రకటనలు చేసింది.
పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని పార్టీ ధృవీకరించింది. ఎన్నికల పొత్తులపై అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు కట్టబెట్టింది. పార్టీ కీలక సభ్యులు హజరైన ఈ సమావేశం, ఎన్నికల అరంగ్రేటానికి సిద్ధమవుతున్న టీవీకే కు ఒక ముఖ్యమైన రాజకీయ క్షణాన్నిఈ జనరల్ బాడీ సమావేశం ద్వారా అందించింది. అనేక మంది ప్రాణాలను బలిగొన్న కరూర్ విషాదం తరువాత విజయ్ మౌనాన్ని వీడటానికి ఇది ఒక వేదికలాగా ఉపయోగపడింది.
ఈ సమావేశంలో పార్టీ మహిళల భద్రత, మత్స్యకార హక్కులు, ఓటర్ల జాబితా సవరణలు, చెన్నైలోని పట్టణ వరద నిర్వహణ వంటి అంశాలను కవర్ చేస్తూ 12 తీర్మానాలను ఆమోదించింది.
కరూర్ విషాదం.. రాజకీయ విమర్శలు..
కరూర్ ఘటనలో మరణించిన వారికి పార్టీ తన సంతాపాన్ని తెలియజేసింది. భద్రతా లోపాలు, కొన్ని రాజకీయ పార్టీల ఉద్దేశపూర్వక గందరగోళాలు వల్లే కరూర్ విషాదం జరిగిందని పార్టీ ఆరోపించింది.
విజయ్ కు పెరుగుతున్న ప్రజా మద్దతుతో అధికారంలో ఉన్న వారికి తగిన బుద్ది చెప్పవచ్చని తీర్మానంలో పార్టీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని చట్టపరమైన కేసులతో తప్పుడు సమాచారం ఆన్ లైన్ లో వ్యాప్తి చెందడానికి అనుమతిస్తోందని టీవీకే విమర్శించింది. విజయ్ హజరైన సమావేశాలకు ప్రజలకు పోలీస్ రక్షణ కల్పించాలని మరో తీర్మానం డిమాండ్ చేసింది.
ఇటీవల జరిగిన కోయంబత్తూర్ సామూహిక అత్యాచారాన్ని కూడా ఆ పార్టీ ఖండించింది. ప్రాణాలతో బయటపడిన మహిళకు త్వరితగతిన న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకున్న తమిళనాడు జాలర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
సీఎంపై విజయ్ విమర్శలు..
ఈ సమావేశంలో విజయ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై ప్రత్యక్ష దాడికి దిగారు. పార్టీ దు:ఖంలో ఉన్నప్పుడూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో టీవీకే కు వ్యతిరేకంగా విషం కక్కుతున్నారని రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
‘‘ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో మా పై రాజకీయంగా, అవమానకరమైన రీతిలో మాట్లాడారు’’ అని విజయ్ అన్నారు. ‘‘మా కుటుంబ సభ్యులను కోల్పోయిన తరువాత మేము మౌనంగా దు:ఖిస్తున్నప్పుడూ వారు రాజకీయాలు చేసి అపవాదును మాపై వేశారు’’ అని టీవీకే నాయకుడు విమర్శలు గుప్పించారు.
కరూర్ విషాదాన్ని నిర్వహించడంలో తమిళనాడు ప్రభుత్వ తీరును టీవీకే కార్యకలాపాలను ఆంక్షలు విధించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించిందని విజయ్ పేర్కొన్నారు.
‘‘సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించి దాని ఏక సభ్య కమిషన్ ను రద్దు చేసింది. భారత్ తో సహ ప్రపంచంలో ఏ నాయకుడు ఇలాంటి ఆంక్షలు ఎదుర్కోలేదు’’ అని విజయ్ అన్నారు.
డీఎంకే ప్రజల విశ్వాసం కోల్పోయింది
డీఎంకేపై తమిళనాడు ప్రజలు విశ్వాసం కోల్పోయారని వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభుత్వం పతనమవుతుందని జోస్యం చెప్పారు. అధికార పార్టీ అహంకారంతో వ్యవహరిస్తోందని, ప్రజల మనోభావాలను విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు.
‘‘డీఎంకే త్వరలో సచివాలయం నుంచి అరివాలయం( డీఎంకే పార్టీ ఆఫీస్) కి తగ్గాల్సి ఉంటుంది’’ అని విజయ్ అన్నారు. 2026 ఎన్నికలు టీవీకే, డీఎంకే మధ్యే ఉంటాయని వాదించారు.
రాష్ట్రం అత్యంత కీలకమైన ఎన్నికల సంవత్సరం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో విజయ్ వ్యాఖ్యలు టీవీకే, అధికార డీఎంకే మధ్య రాజకీయ యుద్దంలో స్పష్టమైన తీవ్రతను సూచిస్తున్నాయి.