విశాఖ ఉక్కు చేజారినట్టే! మార్చి 14న వేలం ఆగనట్టే! !
భూముల అమ్మకాన్ని సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. ప్రభుత్వ తీరుకు నిరసనగా, కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.
ప్రజల త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ సాగించడమే ప్రశార్థకంగా మారుతోంది. కోట్ల రూపాయల నష్టాలతో కునారిల్లుతున్న స్టీల్‌ప్లాంట్ ఆస్తులు అమ్మకానికి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు కొనుగోలుకు నిధుల సమస్య ఏర్పడటంతో... భూములు అమ్మకానికి పెట్టింది యాజమాన్యం. గత్యంతరం లేని పరిస్థితుల్లో పదిహేను వందల 40 కోట్ల రూపాయల విలువైన భూముల వేలానికి రంగం సిద్ధమైంది.
మార్చి 5న బిడ్డింగ్ నిర్వహణ...
ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆస్తులు అమ్మకానికి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. స్థానికులు విరాళంగా ఇచ్చిన భూములను విక్రయించి ముడిసరుకు కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలోని హెచ్‌బీ కాలనీ, గాజువాక ఆటోనగర్, పెద గంట్యాడ ప్రాంతాల్లో సిబ్బంది నివాసాల కోసం సేకరించిన భూములను విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ర్టక్షన్ కార్పొరేషన్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ల సంయుక్తంగా అమ్మకం ప్రక్రియ ప్రారంభించాయి. భూముల వేలం నిమిత్తం ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ చేయగా, 28వ తేదీ బుధవారం ప్రీ-బిడ్ భేటీ నిర్వహించారు. మార్చి 5న బిడ్డింగ్ నిర్వహిస్తారు. అదే నెల 14, 15న భూముల విక్రయం పూర్తికానుంది.
6వేల ఎకరాలు అమ్మేస్తారా...
స్టీల్ ప్లాంట్‌కు విశాఖ నగరంలో వివిధ ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు ఉన్నాయి. ప్లాంట్ పరిసరాల్లో 6 వేల ఎకరాలకు పైగా దాతలు ఇచ్చిన భూమి ఉంది. ఉద్యోగుల క్వార్టర్స్, అనుబంధ భవనాలకు మద్దెలపాలెం, హెచ్‌బీ కాలనీ, పెదగంట్యాడ ప్రాంతాల్లో 22 ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రస్తుతం 830 ఉద్యోగుల క్వార్ట్రర్స్ ఉన్నాయి. వీటిలో చాలా మటుకు శిధిలమయ్యాయి. ఇందులో 130 క్వార్టర్లను రిపేర్లు చేయించుకుని ఉద్యోగులు ఉంటున్నారు. వీటిని పూర్తిగా పడగొట్టేసి కమర్షియల్ కాంప్లెక్స్‌తోపాటు నివాసాలు నిర్మించి విక్రయించాలని నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భూములు 15 వందల 40 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా. భూముల వేలాన్ని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తోంది. విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల క్వార్టర్స్ భూమిని అభివృద్ధి చేసి.. ఆ తర్వాత విక్రయించేలా కేంద్ర ప్రభుత్వం, జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్ మధ్య గతేడాది ఒప్పందం కుదిరింది. కేంద్రం తరఫున స్టీల్ ప్లాంట్ అధికారులు ఈ ఒప్పందం చేసుకున్నారు.
అసలు సమస్య ఏమిటీ?
ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ముడి సరుకు కొనుగోలుకు నిధుల సమస్య ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ప్లాంటుకు చెందిన స్థలాలు విక్రయించి నిధులు సమీకరించుకోవాలని నిర్ణయించింది యాజమాన్యం. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం మొత్తంగా 19 వేల ఎకరాల భూములు సేకరించారు. ఇందులో 6 వేల ఎకరాలను గ్రీన్ బెల్ట్ కింద వదిలేశారు. ఇది పోను మిగతా భూమిలో స్టీల్ ప్లాంట్ నిర్మించారు. దీనికి తోడు మద్దిలపాలెం, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల్లో సిబ్బంది నివాసాల కోసం సేకరించిన భూములు ఉన్నాయి. ఈ స్థలాలు అమ్మి నిధుల సమస్యను అధిగమించాలని చూస్తోంది యాజమాన్యం. స్టీల్ ధరలు భారీగా తగ్గటం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో గత రెండు మూడేళ్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు చవిచూస్తోంది. ప్రస్తుతానికి ప్లాంట్‌కు 23 వేల కోట్ల రూపాయల అప్పులు భారంగా మారిపోయాయి. ఇనుప ఖనిజం కోసం సొంత గనులు లేకపోవడం కూడా యాజమాన్యాన్ని కుంగదీస్తోంది. ఇనుప ఖనిజాన్నిఓపెన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకోవాల్సి రావడంతో టన్నుకు 6 వేల రూపాయల వరకు భారం పడుతోంది. భూముల అమ్మకం ద్వారా కొంత వరకూ ఈ నష్టాలను అధిగమించాలని చూస్తున్నారు.
3న వర్కర్స్ మహార్యాలీ...
భూముల అమ్మకాన్ని సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కొంతకాలం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా, కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో భూముల విక్రయ ప్రక్రియ మొదలుకావడంతో స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితీ ఆధ్వర్యంలో మార్చి 3న విశాఖపట్నంలో మహార్యాలీ నిర్వహిస్తున్నట్టు సీఐటీయూ నాయకుడు సీహెచ్ నరసింగరావు చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను విక్రయించాలనే దుర్బుద్ధితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ ప్రయత్నాలను ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు నరసింగరావు.