వయనాడ్ విషాదం..308కి చేరిన మృతుల సంఖ్య..కొనసాగుతోన్న సహాయక చర్యలు

కేరళలోని వాయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Update: 2024-08-02 06:40 GMT

కేరళలోని వాయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. కూలిపోయిన, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారిని పునరావాస శిభిరాలకు తరలించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దాదాపు 40 బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. గురువారం నాటికి మరణించిన వారి సంఖ్య 296కి చేరుకుంది. గల్లంతైన మరో 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అందుతున్న సమాచారం.

వయనాడ్ జిల్లా అధికార యంత్రాంగం సమాచారం మేరకు.. మృతులలో 27 మంది పిల్లలు, 76 మంది మహిళలు కాగా మిగిలిన వారు పురుషులు. 225 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముండక్కై, చూరల్‌మల ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా గాయపడ్డారని కేరళ రెవెన్యూ మంత్రి కె రాజన్ తెలిపారు.

దెబ్బతిన్న రోడ్లు, కూలిన వంతెనలు సహాయక బృందాలకు ఆటంకంగా మారాయి. క్షతగాత్రులకు త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కష్టమవుతోంది. ఇళ్లపై పేరుకుపోయిన మట్టిని, కూలిపోయిన చెట్లను తొలగించడానికి ఎక్కువ సమయం పడుతోంది.

విపత్తు ప్రాంతంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న రాజన్ మాట్లాడుతూ.. వివిధ ఏజెన్సీలు, 1,300 మంది సాయుధ దళాలతో కలిసి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని చెప్పారు. జిల్లాలో 91 సహాయ శిబిరాలకు 9,328 మందిని తరలించినట్లు తెలిపారు. వీరిలో చూరల్‌మల, మెప్పాడి వద్ద కొండచరియలు విరిగిపడటంతో నిరాశ్రయులైన 578 కుటుంబాలకు చెందిన 2,328 మందిని 9 పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు.

బాధితులను కాపాడడమే ప్రథమ ప్రాధాన్యం: కేరళ సీఎం

ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ తదితర రాజకీయ నేతలు నిరాశ్రయులను పరామర్శించి, వారికి సంఘీభావం తెలిపారు. ‘వయనాడ్‌ దుర్ఘటన బాధితులను కాపాడడమే తమ మొదటి ప్రాధాన్యత’ అని అఖిలపక్ష సమావేశంలో సీఎం పేర్కొన్నారు. వివిధ బలగాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.

చూరల్‌మల-ముండక్కై మధ్య బెయిలీ బ్రిడ్జిని నిర్మించడం వల్ల విపత్తు ప్రభావిత ప్రాంతాలకు, రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన పరికరాలను త్వరగా రవాణా చేయవచ్చని ఆయన చెప్పారు.

జాతీయ విపత్తుగా ప్రకటించాలి..రాహుల్ 

వయనాడ్‌కు చెందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గురువారం పునరావాస శిభిరాలను సందర్శించారు. గాయపడ్డవారితో మాట్లాడారు. ప్రజలు తమ కుటుంబ సభ్యులను, ఇళ్లను కోల్పోవడం చాలా బాధాకరం. ప్రాణాలతో బయటపడిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ప్రభావిత ప్రాంతాలయిన ముండక్కై చూరల్‌మల మధ్య ఇండియన్ ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ గురువారం 190 అడుగుల పొడవు ఉన్న బెయిలీ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఫలితంగా సహాయక చర్యలు ఊపందుకునే అవకాశం ఉంది.

279 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించామని, 107 మృతదేహాలను గుర్తించామని వయనాడ్ జిల్లా యంత్రాంగం తెలిపింది.


Tags:    

Similar News