కేంద్రీకృత వంటశాలలపై జస్టిస్ చంద్రు నివేదిక ఏమిటి?

కేంద్రీకృత వంటశాలలతో విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని జస్టిస్ చంద్రు చెబుతుండగా.. వాటి వల్ల మంచి కంటే హాని ఎక్కువగా జరుగుతుందన్నది కొంతమంది వాదన.

Update: 2024-08-24 08:29 GMT

కేంద్రీకృత వంటశాలల వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని జస్టిస్ చంద్రు చెబుతుండగా.. వాటి వల్ల మంచి కంటే హాని ఎక్కువగా జరుగుతుందన్నది కొంతమంది వాదన.

‘జస్టిస్ చంద్రు సిఫార్సులను అమలు చేయొద్దు’

ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, ఉద్యమకారుల బృందం ఆగస్టు 19న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు లేఖ రాశారు. జస్టిస్ కె చంద్రు కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకూడదని అందులో కోరారు.

ఇంతకు జస్టిస్ చంద్రు ఏమని సిఫార్సు చేశారు?

పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని తీసుకోవడం మానేశారు. కారణం భోజనం తయారుచేస్తున్నది దళిత స్త్రీలు అని చంద్రు కమిటీ గుర్తించింది. అలాగే భోజనంలో నాణ్యత, పోషక విలువల్లో తేడా ఉండడాన్ని కూడా కమిటీ గమనించింది. అందువల్ల ఇకపై మధ్యాహ్న భోజన తయారీ కేంద్రీకృత వంటశాలలో జరగాలని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనపై సుప్రసిద్ధ ఆర్థికవేత్త జీన్ డ్రేజ్‌తో సహా పలువురు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి జస్టిస్ చంద్రూ కౌంటర్ ఇచ్చారు.

భోజనంలో పోషక విలువలు ఉండక్కర్లేదా?

పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై జస్టిస్ చంద్రు కౌంటర్ ఇచ్చారు. మధ్యాహ్న భోజనంలో పోషకాహార విలువలు ఉండాక్కర్లేదా? అని ప్రశ్నించారు. ఆయన ఫెడరల్‌తో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వం కేంద్రీకృత వంటగది ఏర్పాటును పరిశీలించవచ్చు. ఈ విధానాన్ని విస్త్రత పరచడానికి ప్రజల అభిప్రా యాలను తీసుకోవచ్చు. పిల్లలు నాణ్యమైన, పౌష్టికాహారం అందాలన్నదే నా ప్రధాన ఉద్దేశ్యం’ అని పేర్కొన్నారు.

సామాజిక తనిఖీలేవీ?

నాలుగు దశాబ్దాల నాటి మధ్యాహ్న భోజన పథకంపై ఇప్పటి వరకు ఎలాంటి సామాజిక తనిఖీ జరగలేదని జస్టిస్ చంద్రు పేర్కొన్నారు. పిటీషనర్లు తమ పిటీషన్‌లో ఎంతమంది విద్యార్థులకు భోజనం తయారుచేస్తున్నారు? అసలు ఎంతమంది పిల్లలు పాఠశాలలకు హాజరవుతున్నారు? భోజనంలో నాణ్యత, పోషక విలువల ప్రస్తావన కూడా చేయలేదన్నారు.

65 పేజీల జస్టిస్ చంద్రు నివేదికలో.. ‘పాఠశాలలో రెండు వేర్వేరు నియంత్రణ వ్యవస్థలున్నాయి. మధ్యాహ్న భోజన కార్మికులను సాంఘిక సంక్షేమ శాఖ ఆధీనంలో ఉంటారు. విద్యా సంబంధిత విషయాలను విద్యా శాఖ చూస్తుంది. వ్యవస్థలు దేనికది సపరేటుగా ఉండడం వల్ల మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించడానికి ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు’ అని నివేదికలో పొందుపర్చారు.

‘మంచి కంటే హాని ఎక్కువ..’

ఉద్యమకారులు స్టాలిన్‌కు రాసిన బహిరంగ లేఖలో.. ‘పాఠశాల భోజనాన్ని అమలు చేయడంలో రాష్ట్రానికి మంచి రికార్డు ఉంది. ఆన్-సైట్ స్థానంలో కేంద్రీకృత వంటశాలలను తీసుకురావడం ఒక అడుగు వెనక్కువేయడమే. కేంద్రీకృత వంటశాలల వల్ల గ్రామీణ ప్రాంతాలలో మంచి కంటే హాని ఎక్కువ జరుగుతుంది. మధ్యాహ్న భోజనం తయారు చేసే దళిత మహిళల పట్ల వివక్షను అరికట్టాలనేది జస్టిస్ చంద్రు భావన. అయితే పరిపాలన దృఢంగా ఉన్నప్పుడు వ్యతిరేకత పెద్ద సమస్యకాదు.’ అని పేర్కొన్నారు. ‘దేశంలోని కొన్ని ప్రసిద్ధ కేంద్రీకృత వంటశాలలలో జరిగే అక్రమాలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై కాగ్, పార్లమెంటరీ కమిటీ ఎలా ఆందోళన వ్యక్తం చేశాయో? చూస్తూనే ఉన్నాం. కేంద్రీకృత వంటశాలల వల్ల రవాణా ఖర్చు అదనం. పాఠశాలలకు ఆహారాన్ని తీసుకెళ్లే మార్గంలో పాడయ్యే అవకాశం ఉంది.’ అన్నది పిటీషనర్ల వాదన.

"కేంద్రీకృత వంటశాలల నుంచి భోజనాన్ని స్కూళ్లకు తెచ్చేసరికి ఆహారం చల్లబడుతుంది. రుచిలో కూడా తేడా వస్తుంది. కేంద్రీకృత వంటశాలల నుంచి తెచ్చిన ఆహారాన్ని పిల్లలు పారేస్తున్నారని జార్ఖండ్ నుంచి వచ్చిన నివేదికలు సూచిస్తున్నాయి. రాజస్థాన్‌లో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయి.’’ అని లేఖలో ప్రస్తావించారు కార్యకర్తలు.

తమిళనాడు సీఎంకు ఉద్యమకారులు రాసిన లేఖపై డ్రెజ్‌తో పాటు, ఎంపీ సెంథిల్ శశికాంత్, పరిశోధకుడు ఎస్ చెల్లా రాజన్, విద్యావేత్త ప్రిన్స్ గజేంద్ర బాబు, ప్రజారోగ్య వైద్యురాలు సిల్వియా కర్పగం, ఆర్థికవేత్త రీతికా ఖేరా, కార్యకర్తలు కరుణా ముత్తయ్య, టి రామకృష్ణన్‌ సంతకాలు చేశారు.

అయితే దళిత ఉద్యోగుల పరిస్థితేంటి?

కేంద్రీకృత విధానం అమలు చేస్తే దళిత లేదా ఆదివాసీ మహిళల పరిస్థితి ఏమిటని లేఖలో ప్రశ్నించారు పిటిషనర్లు. కేంద్రీకృత వంటశాలలలో పెద్ద సంఖ్యలో పేద మహిళలు వంటమనుషులుగా, వారికి సహాయకులుగా పనిచేస్తున్నారు. వీరిలో 27 శాతం మంది దళిత లేదా ఆదివాసీ మహిళలు తమిళనాడులో ఉన్నారు. ‘వీరిని ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించాలని చంద్రు కమిటీ నివేదిక సూచించింది. ‘పంచాయతీలు, పంచాయతీ యూనియన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన పనుల్లో వీటిని వినియోగించుకోవాలని జస్టిస్ చంద్రు నివేదిక సూచించింది. అయితే వీరి భర్తీ అంత సులభం కాదు’ అన్నది పిటీషనర్ల వాదన.

కేంద్రీకృత వంటశాలలను నిర్వహించే ప్రైవేట్ కాంట్రాక్టర్ల విశ్వసనీయతను కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం కంటే లాభాలు ఆర్జించడంపై వారు ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉందన్నారు.

Tags:    

Similar News