కాపుల్ని బీజేపీ ఎందుకు పట్టించుకోలేదు?

అతినమ్మకమో ఏమో గాని జనసేన పోటీచేస్తున్న 21 ఒక్కటీ శెట్టిబలిజలకు ఇవ్వలేదు. బీజేపీ పోటీ చేస్తున్న పది సీట్లలో ఒక్కటీ కాపులకు ఇవ్వలేదు. కారణమేమిటో మరి..

Update: 2024-04-18 11:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీల కూటమి తరపున పోటీ చేస్తున్నాం కదా మూడు పార్టీల ఓట్లు కచ్చితంగా తమకే పడతాయని నమ్మకమా లేక అతి నమ్మకమో తెలియదు గాని బీజేపీ, జనసేనల తీరు అచ్చం అలాగే ఉంది. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ సీట్లకు జనసేన 21 సీట్లకు బీజేపీ పది సీట్లకు పోటీపడుతున్నాయి. టీడీపీ 144 సీట్లకు పోటీ చేస్తున్నందున సాధ్యమైన మేరకు అన్ని కులాలు, మతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుందనే భావించాలి. కాపు సామాజికవర్గం కొమ్ముకాస్తున్న జనసేన తాను పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ సీట్లలో ఎక్కడా శెట్టిబలిజలకు ప్రాతినిధ్యం కల్పించలేదనే భావన నెలకొంది.

గతంలో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఈసారి కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. తన సోదరుడు నాగబాబు పోటీ చేసి ఓడిన నర్సాపురం పార్లమెంటు సీటును వైసీపీ శెట్టిబలిజ కులానికి చెందిన ఓ విద్యావంతురాలైన గూడూరి ఉమా బాలకు టికెట్ ఇస్తే కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంటు సీటులో అంతర్భాగంగా ఉన్న భీమవరం, నరసాపురం నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేస్తున్నా ఈ రెండు సీట్లలోనూ పాత వాళ్లే పోటీ చేస్తున్నారు. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో ప్రత్యేకించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో శెట్టిబలిజలు ఎక్కువే అయినా పవన్ కల్యాణ్ ఆ వర్గాలకు ఒక్కరికీ సీటు ఇవ్వలేదు. దీంతో పవన్ కల్యాణ్ పై శెట్టిబలిజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ తాము వైసీపీకే మద్దతు ఇస్తామంటున్నారు.

ఇక బీజేపీ మరో విచిత్ర ప్రయోగానికి తెర లేపింది. పది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కమలనాధులు పోటీ చేస్తుంటే అక్కడెక్కడా ఒక్క కాపుకి కూడా టికెట్ ఇవ్వకపోవడం విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో సుమారు 16,17శాతంగా ఉన్న కాపు, కాపు ఉప కులాలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. దీంతో వాళ్లు కమలంపై కస్సు మంటున్నారు. ఇంతకాలం కమలాన్ని నమ్ముకున్నందుకు కాపులకు ఒక్క సీటు ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు.

కూటమి తరఫున ఈ కులాలకు సీట్లు ఇచ్చామని సర్దిచెబుతున్నా పార్టీల వారీగా చూసినపుడు రాజకీయాల్లో ప్రాధాన్యత ఉన్న ఈ వర్గాలకు సీట్లు ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. అధికారం తప్పక వస్తుందన్న అతినమ్మకమే దీనికంతటికీ కారణమని ఈ వర్గాల నేతలు విమర్శలు చేస్తున్నారు. ‘ఇక తమకే అధికారం అనే అతి నమ్మకం, ఆ కులాల నాయకుల్ని, కార్యకర్తల్ని పట్టించుకోక పోయినా, కలుపుకుని వెళ్ళక పోయినా ఫరవాలేదు, చచ్చినట్టు మనకే మద్దతు పలుకుతారులే అనే నిర్లక్ష్యం... ఈ రెండూ చాలా ప్రమాదకరం‘ అని శెట్టిబలిజ సంఘం నేతలు విమర్శించారు. ఇది ఏ పార్టీ చేసినా అది ఆత్మహత్యా సదృశ్యమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News