నాగేంద్రన్ సారథ్యంలో కమలం వికసిస్తుందా?
అన్నామలై స్థానంలోకి వచ్చిన నాగేంద్రన్ 2026 తమిళనాడు ఎన్నికలో డీఎంకేకు గట్టి పోటీ ఇస్తారా? బీజేపీ అధిష్టానం పెట్టుకున్న ఆశలకు మించి పనిచేస్తారా?;
కలిసిపోరాడితేనే 2026 ఎన్నికలో అధికారాన్ని దక్కించుకోగలమన్న భావనలో ఉన్న బీజేపీ..ఎట్టకేలకు AIADMKతో జతకట్టింది. ఆ పార్టీ నేత ఫళణి స్వామి ఇటీవల ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. రెండు పార్టీల మధ్య అంతర్గతంగా ఒప్పందాన్ని గురువారం చెన్నై పర్యటనకు వచ్చిన అమిత్ షా బయటపట్టారు. ఆయన రాకతో బీజేపీ రాష్ట్ర చీఫ్ కూడా మారిపోయారు. కె అన్నామలై స్థానంలో తిరునల్వేలి ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్ ఆ బాధ్యతలు అప్పగించారు. నాగేంద్రన్‌కు అన్నాడీఎంకేతో ఉన్న సత్సంబంధాలు అందుకు కారణం. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నాగేంద్రన్ అన్నాడీఎంకే జయలలిత మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు.
ఇంతకు ఎవరీ నాగేంద్రన్ ?
తిరునెల్వేలి జిల్లా రాధాపురం తాలూకా తండయార్ కుళంలో అక్టోబర్ 16, 1960న జన్మించారు నైనార్ నాగేంద్రన్. రాష్ట్రంలోని బలమైన సామాజికవర్గం తేవర్ కమ్యూనిటీకి చెందిన నాగేంద్రన్ పాఠశాల విద్య తిరునెల్వేలిలో పూర్తి చేశారు. తరువాత పాలయంకోట్టైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో బీ.కామ్ పూర్తి చేశారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. 1980లో తిరునెల్వేలిలో AIADMK కార్యకర్తగా పనిచేసిన నాగేంద్రన్‌కు ఆ పార్టీ స్థానిక నాయకులతో ఉన్న సంబంధాలు ఆయనను పార్టీలో ఎదిగేలా చేశాయి.
కలిసొచ్చిన సామాజిక వర్గ మద్దతు..
తమిళనాడు దక్షిణ జిల్లాలయిన తిరునెల్వేలి, తూత్తుకుడి, మధురైలో తేవర్ సామాజిక వర్గం ఎక్కువ. ఇది కూడా నాగేంద్రన్‌కు కలిసొచ్చింది. 1990లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. తిరునల్వేలి నియోజక వర్గం నుంచి 1991లో AIADMK తరపున పోటీ చేశారు. స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా.. పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తిగా జె. జయలలిత దృష్టిలో పడ్డారు. తిరిగి 2001లో అదే స్థానం నుంచి పోటీ విజయం సాధించారు. DMK అభ్యర్థిని భారీ మెజార్టీతో ఓడించారు.
జయలలిత మంత్రివర్గంలో మినిష్టర్‌గా..
తన నియోజకవర్గం తిరునెల్వేలిలో మౌలిక సదుపాయాల(మంచినీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, మురుగు కాలువల నిర్మాణం)పై దృష్టి పెట్టి ప్రజల మన్ననలు పొందారు. 2001-2006 మధ్యకాలంలో జయలలిత మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. తన హయంలో రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సరఫరా, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేశారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో DMK జోరు కొనసాగినా తన స్థానాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు. అయితే 2011లో DMK అభ్యర్థి ALS లక్ష్మణన్ చేతిలో ఓడిపోయారు. అయినా కూడా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ.. దక్షిణ తమిళనాడులో AIADMK ఇంకా బలంగానే ఉందని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
బీజేపీకి షిప్ట్..
డిసెంబర్ 2016లో జయలలిత దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. అ తర్వాత అన్నాడీఎంకే పగ్గాల కోసం ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్), టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పగ్గాల కోసం పోటీపడుతున్న సమయంలో నాగేంద్రన్ 2017లో బీజేపీలోకి మారిపోయారు. 2014 లోక్‌సభ ఎన్నికలో బీజేపీ ఓటు శాతం 3.5 మాత్రమే. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతానికి పూనుకున్న నాగేంద్రన్ తన పాత సంబంధాలను వినియోగించుకున్నారు. తిరునెల్వేలిలోని క్రైస్తవులు, ముస్లిం, మైనారిటీలతో నాగేంద్రన్‌కు ఉన్న సత్సంబంధాలు పార్టీ విస్తరణకు దోహదపడ్డాయి.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో నాగేంద్రన్ BJP అభ్యర్థిగా తిరునేల్వేలిలో పోటీ చేసి DMK అభ్యర్థిని 23,107 ఓట్ల తేడాతో ఓడించారు. శాసనసభా పక్ష నేత హోదా కూడా ఆయనకు దక్కింది. జాతీయ రాజకీయాల్లోనూ దూసుకుపోయాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 3,42,821 ఓట్లు సాధించి 32.31 శాతం ఓట్ షేర్ సాధించారు. 2024లో తిరునెల్వేలిలో పోటీచేసి 3,36,676 ఓట్లు సాధించి ఓడిపోయారు. కానీ ఆయన ఓట్ షేర్ (31.5%)ను మాత్రం ఎవరూ గమనించలేదు.
వివాదాలు కూడా..
నాగేంద్రన్ పొలిటికల్ కెరీర్ వివాదాలతో ముడిపడింది. 2010లో ఆయన AIADMK మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయ వనరులకు మించి రూ. 3.9 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ (DVAC) ఆయనతో, ఆయన కుటుంబసభ్యలపై చార్జిషీట్ దాఖలైంది. ఈ కేసు తన ప్రత్యర్థులకు ఒక అస్త్రంగా మారిపోయింది. అయితే తన మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తూనే కేరీర్ కొనసాగించారు.
ముందున్న సవాళ్లు..
బీజేపీ అధిష్టానం కె అన్నామలైని పక్కనబెట్టిన తర్వాత పార్టీని ముందుండి నడిపించే బాధ్యత ఇక నాగేంద్రన్‌దే. బీజేపీతో పొత్తుకు సిద్ధమయిన AIADMK.. తమ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్నామలైని తప్పిస్తేనే జతకడతామని కండీషన్ పెట్టిన విషయం తెలిసిందే.
కాగా, నాగేంద్రన్ కుమారుడు బాలాజీ నైనార్ తన తండ్రి బీజేపీ పార్టీ చీఫ్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. నాన్నను ఆ పదవిలో చూసి గర్వపడుతున్నానని చెప్పారు.