సుప్రీం చీఫ్ జస్టిస్‌గా సంజీవ్ ఖన్నా? కేంద్రానికి CJI చంద్రచూడ్ సిఫార్సు..
భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ నవంబర్‌లో రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ఆయన కేంద్రానికి సిఫార్సు చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ఆయన కేంద్రానికి సిఫార్సు చేశారు. ఒకవేళ కేంద్రం చంద్రచూడ్ సిఫార్సును అంగీకరిస్తే.. జస్టిస్ ఖన్నా సుప్రీంకోర్టుకు 51వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. అయితే ఖన్నా మే 13, 2025న రిటైర్ కానుండడంతో ఆయన CJIగా ఏడు నెలల మాత్రమే కొనసాగుతారు.
2019 జనవరిలో ఢిల్లీ హైకోర్టు నుంచి పదోన్నతి పొందిన జస్టిస్ ఖన్నా సుప్రీంకోర్టు రెండో సీనియర్ న్యాయమూర్తి.
సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా? కేంద్రానికి CJI చంద్రచూడ్ సిఫార్సు..మే 14, 1960న జన్మించిన జస్టిస్ ఖన్నా.. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో తన పేరు నమోదు చేసుకున్నారు. మొదట జిల్లా కోర్టుల్లో, తరువాత ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. కొంతకాలం ఆదాయపు పన్ను శాఖ తరుపున సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ జాతీయ రాజధాని భూభాగానికి స్టాండింగ్ కౌన్సెల్‌గా ఉంటూనే హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, అమికస్ క్యూరీగా హాజరయ్యారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జనవరి 18, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి హైకోర్టు సీనియారిటీలో జస్టిస్ ఖన్నా 33వ స్థానంలో ఉన్నారు.
జస్టిస్ ఖన్నా 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. జమ్మూ, కాశ్మీర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన రాజ్యాంగ ధర్మాసనం సభ్యుడు కూడా.