ఆయుధాలు వీడితేనే చర్చలు.. లేదంటే చావడానికి సిద్ధం కండి..
జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు ఆయుధాలు వీడి చర్చలకు రావాలని.. లేదంటే చావడానికి సిద్ధం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు ఆయుధాలు వీడి చర్చలకు రావాలని.. లేదంటే చావడానికి సిద్ధం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి మూడవ, చివరి దశ పోలింగ్ వచ్చే వారం జరగనుంది. ఈ సందర్భంగా షా గురువారం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, NC, PDPలపై విరుచుకుపడ్డారు. గత మూడు దశాబ్దాలుగా ఈ మూడు పార్టీలు తీవ్రవాద నిర్మూలనకు ఏ చర్యలు తీసుకోలేదని, తాము అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్‌ను ఉగ్రవాద రహితంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమికి అధికారం కట్టబెడితే పాకిస్తాన్ ఎజెండాను అమలు చేస్తారని హెచ్చరిస్తూ.. ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు.
అఫ్జల్ గురుకు పట్టిన గతే..
‘‘దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తికి ప్రయత్నించే వారికి పార్లమెంట్ దాడి దోషి అఫ్జల్ గురుకు పట్టిన గతి పడుతుంది. అఫ్జల్ గురును ఉరితీయకూడదని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ఒమర్ అబ్దుల్లా అన్నారు. కానీ నేను చెప్తున్నా. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా, ఉగ్రవాదులకు సహకరించిన వారికి కఠిన శిక్షలు తప్పవు’’ అని హెచ్చరించారు షా.
ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాం..
ఉధంపూర్ జిల్లాలోని చెనాని, ఉదంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లు, కతువా జిల్లాలోని బని, జస్రోటియా నియోజకవర్గాల్లోనూ షా మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేసి ఉగ్రవాదాన్ని తుదముట్టించమని, తిరిగి అది జీవం పోసుకోకుండా ఉండాలంటే బీజేపీకి గెలిపించాలని కోరారు.
ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాం..
‘‘ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్ష పార్టీలు ఉగ్రవాదులతో చర్చలు జరపాలని అడుగుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని, సీమాంతర వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని చెబుతున్నాయి. 2014లో మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడంతో జమ్మూకాశ్మీర్‌లో 35 ఏళ్లపాటు కొనసాగిన ఉగ్రవాద చర్యలకు తగిన సమాధానం చెప్పారు. ఉరీ, పుల్వామా దాడుల తర్వాత పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి ఉగ్రవాదాన్ని అంతం చేశాం’’ అని హోంమంత్రి వివరించారు.
ఈ ఎన్నికలు చాలా కీలకం...
మూడు కుటుంబాలు (గాంధీ, అబ్దుల్లా, ముఫ్తీ) జమ్మూ కాశ్మీర్‌ను 75 ఏళ్లపాటు పాలించాయి. అయితే ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో విఫలమయ్యాయి. 70 ఏళ్లుగా వివక్షకు గురవుతున్న జమ్మూ ప్రాంతానికి మోదీ న్యాయం చేశారు. అధికార భాషల జాబితాలో డోగ్రీ భాషను చేర్చేలా చూశారు. చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అధికారంలోకి వస్తే వాటిని నెరవేరుస్తాం. అందుకు ఈ ఎన్నికలు చాలా కీలకమని షా వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 1 మూడో విడత..
జమ్మూ కాశ్మీర్‌లో మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, రెండో దశ సెప్టెంబర్ 25న జరిగింది. మూడో దశ, జమ్మూ, ఉదంపూర్, సాంబా, కథువా, ఉత్తర కాశ్మీర్ జిల్లాల్లోని కుప్వారా, బారాముల్లా, బండిపోరా జిల్లాల్లోని 40 స్థానాలను మూడో దశ పోలింగ్ అక్టోబర్ 1న జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.