మతువా కమ్యూనిటీ ఓటర్లపై కాంగ్రెస్ కన్ను?

పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే సామాజిక వర్గం..;

Update: 2025-09-17 08:11 GMT
Click the Play button to listen to article

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ముస్లింల తర్వాత రెండో అతి పెద్ద ఓటు బ్యాంకు ఉన్న షెడ్యూల్డ్ కుల సామాజిక వర్గం మతువా(Matua). రాజకీయంగా ప్రభావవంతమైన మతువా కమ్యూనిటీతో ప్రస్తుతం లోతైన సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని కాంగ్రెస్(Congress) చూస్తోంది. అందులో భాగంగానే ఈ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా ఉండే ఠాకూర్బారి మతువా ధామ్‌ ఠాకూర్ నగర్‌లో ఆదివారం (సెప్టెంబర్ 14) కాంగ్రెస్ పార్టీ "సత్యాగ్రహ" నిరసన కార్యక్రమం నిర్వహించింది. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శుభాంకర్ సర్కార్ హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమానికి ముందు రాష్ట్ర, జాతీయ స్థాయి కమ్యూనిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకుల మధ్య సమావేశాలు జరిగినట్లు సర్కార్ ది ఫెడరల్‌తో అన్నారు. మాతువా ప్రతినిధుల బృందం ఆగస్టు 30న బీహార్‌(Bihar)లో రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని తన “ఓట్ అధికార యాత్ర”లోనూ కలిసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ పశ్చిమ బెంగాల్ పరిశీలకుడు గులాం అహ్మద్ మీర్‌ను కూడా సంఘం ప్రతినిధులు కలిశారని సర్కార్ తెలిపారు.


కాంగ్రెస్‌లో చేరిక..

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న మరో ప్రముఖ నేత, సీపీఐ(ఎం) మాజీ నాయకుడు ప్రసేన్‌జిత్ బోస్ మంగళవారం (సెప్టెంబర్ 16) కాంగ్రెస్‌లో చేరారు. అణగారిన వర్గాలు ఓటు హక్కును పొందేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం పశ్చిమ బెంగాల్‌లో కొంత ఊపందుకుంటోందని చెప్పడానికి బోస్ చేరిక ఒక సూచన.


త్వరలో కమిటీ ఏర్పాటు..

"పౌరసత్వం చట్టం గురించి బీజేపీ, టీఎంసీల వైఖరిపై మతువా వర్గం సంతోషంగా లేదు. కాంగ్రెస్ పాలనలో మతువాస్ ఎప్పుడూ పౌరసత్వ సమస్య ఎదుర్కోలేదు. వారికి ఓటు హక్కు ఉంది. పాస్‌పోర్ట్‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు (BJP, TMC) సమస్యను సృష్టించి.. దాన్ని పరిష్కరించినట్లు నటిస్తున్నాయి. ప్రస్తుతం మతువా కమ్యూనిటీలోని వివిధ వర్గాల నుంచి వారి పౌరసత్వ సమస్యలపై అభిప్రాయాలను సేకరిస్తోంది. త్వరలో సమస్యను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది " అని చెప్పారు సర్కార్.


త్వరలో రాహుల్ పర్యటన..

అక్టోబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఆయన పర్యటన సందర్భంగా మతువా కమ్యూనిటీ ఓ భారీ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ పర్యటన గురించి అడిగిన ప్రశ్నకు ‘‘వెయిట్ చేయండి..చాలా మంది వస్తారు’’ అని సర్కార్ సమాధానమిచ్చారు.


కాంగ్రెస్ గెలుపొందిన ఏకైక స్థానం..

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 పార్లమెంటు స్థానాలున్నాయి. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాల్డా సౌత్ నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచిన ఏకైక అభ్యర్థి ఇషా ఖాన్ చౌదరి. ప్రస్తుతం 294 మంది సభ్యులున్న శాసనసభలో హస్తం పార్టీకి ప్రాతినిధ్యం లేదు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ తన దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా 'ఓటు చోర్, గడ్డి చోడ్ (ఓటు దొంగ, అధికారాన్ని వదులుకోండి)' పేరిట ప్రజా సంతకాల ప్రచారాన్ని శనివారం (సెప్టెంబర్ 13) నుంచి రాష్ట్రంలో ప్రారంభించింది.


కాంగ్రెస్‌తో మతువాస్ రాజకీయ సంబంధం..

మతువా సమాజంతో కాంగ్రెస్ రాజకీయ సంబంధం కొత్తది కాదు. మతువా శాఖ స్థాపకుడు హరిచంద్ ఠాకూర్ మునిమనవడు ప్రమథ రంజన్ ఠాకూర్ 1946లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బెంగాల్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 1957, 1962లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను శాసించే సత్తా ఉన్న మతువాలను కాంగ్రెస్ పార్టీ తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది.

Tags:    

Similar News