మహారాష్ట్ర షిండే క్యాబినెట్ కీలక నిర్ణయాలేమిటి?

నాన్ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు మహారాష్ట్ర సీఎం షిండే తెలిపారు.

Update: 2024-10-11 06:48 GMT
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే..

మహారాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహారాష్ట్ర స్టేట్ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే ముసాయిదా ఆర్డినెన్స్‌ను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆమోదం తెలిపారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెడతామని, కమిషన్‌లో 27 మందికి చోట కల్పించనున్నట్లు తెలిపారు. హింగోలి జిల్లాలో బాలాసాహెబ్ ఠాక్రే పసుపు పరిశోధన కేంద్రానికి రూ.709.27 కోట్ల అదనపు నిధులు మంజూరు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 57 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సులభ్ మరుగుదొడ్లు, విశ్రాంతి గదులను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు సమావేశం ఆమోదం తెలిపింది. ముంబైలోని బోరివాలి సబర్బన్‌లోని అక్సే, మాల్వానీలోని ప్రభుత్వ భూమిని ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం కేటాయించి, 140 ఎకరాలలో అర్హులైన మురికివాడల నివాసితులకు ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ముంబయిలోని బాంద్రా ప్రభుత్వ కాలనీలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో గ్రంథాలయ సంస్కృతికి ఊతమిచ్చేలా పబ్లిక్‌ లైబ్రరీస్‌ యాక్ట్‌ను సవరిస్తామని క్యాబినెట్ పేర్కొంది. ముంబయి-నాగ్‌పూర్ కారిడార్‌తో అనుసంధానమయిన జల్నా-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సావోనేర్, కంకవ్లి, రాజాపూర్, అంబర్‌నాథ్, జిహే కథాపూర్, లాతూర్‌లకు నీటిపారుదల ప్రాజెక్టులను మంజూరు చేశారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో డే కేర్‌ సెంటర్లను ప్రారంభించేందుకు అనుమతిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఆఫ్రికన్ సఫారీ

నాగ్‌పూర్‌లోని బాలాసాహెబ్ థాకరే గోరేవాడ అంతర్జాతీయ జూలో ఆఫ్రికన్ సఫారీని ప్రవేశపెట్టనున్నారు. మౌలానా ఆజాద్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వర్కింగ్ క్యాపిటల్‌ను రూ.700 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డీఈడీ చదివిన మదర్సా అధ్యాపకుల గౌరవ వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.16 వేలకు, బీఏ, బీఈడీ, బీఎస్సీ డిగ్రీ చదివిన ఉపాధ్యాయుల వేతనాన్ని రూ.8 వేల నుంచి రూ.18 వేలకు పెంచనున్నారు.

యువతకు ఉపాధి..

మహారాష్ట్రలోని యువతకు ఉపాధి కల్పించేందుకు మహారాష్ట్ర స్టేట్ ఇంటర్నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ స్కిల్ అడ్వాన్స్‌మెంట్ కంపెనీని కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.3 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ ఉన్న ఈ కంపెనీకి 27,000కు పైగా దరఖాస్తులు అందాయని, వాటిలో 10,000 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని ఆ ప్రకటనలో తెలిపారు.

నాన్-క్రిమీ లేయర్ సర్టిఫికెట్..

నాన్ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు షిండే తెలిపారు. ఒక వ్యక్తి కుటుంబ ఆదాయాన్ని నాన్-క్రిమీ లేయర్ సర్టిఫికెట్ సూచిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయానికి లోబడి సంపాదన ఉన్నపుడే OBC కేటగిరీలో రిజర్వేషన్‌కు అర్హులు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని షిండే క్యాబినెట్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News