హత్రాస్ తొక్కిసలాట: భోలే బాబాగా మారిన పోలీసు కానిస్టేబుల్..

ఇప్పటి వరకు మనం చాలా బాబాలను చూసి ఉంటాం. కాని ఈ బాబ కాస్త సపరేటు. కాషాయ వస్త్రాలు ధరించడు. తెల్లటి సూట్‌లో కనిపించే భోలే బాబా 121 మంది చావుకు కారణమయ్యాడు.

Update: 2024-07-03 10:36 GMT

ఆయన స్వయం ప్రకటిత బాబా. యూపీ కేంద్రంగా మతపర కార్యక్రమాలు (సత్సంగ్‌) నిర్వహిస్తుంటాడు. సీఎంల నుంచి డిప్యూటీ సీఎంలు రావడం చూసి ప్రజల్లో ఆయనకు ఆదరణ పెరిగిపోయింది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసుకోకపోయినా..కొన్నిసామాజిక మాధ్యమాలు విస్ర్తత ప్రచారం కల్పించడంతో ఫాలోయింగ్ పెరిగిపోయింది. భక్తుల రద్దీని నియంత్రించడానికి, తనను వేదిక వద్దకు జాగ్రత్తగా తీసుకెళ్లడానికి ఒక చిన్నపాటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే భోలే బాబా.

ఇదీ నేపథ్యం ..

భోలే బాబాను కొందరు నారాయణ్ సాకర్ హరిగా పిలుస్తుంటారు. వాస్తవానికి భోలే బాబా అసలు పేరు సూరజ్‌పాల్. ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రం కాస్గంజ్ జిల్లా బహదూర్ నగర్‌కు చెందిన సూరజ్‌పాల్ రైతు కుటుంబంలో జన్మించాడు. పోలీసుగా ఉద్యోగంలో చేరి..రెండు దశాబ్దాల పాటు ఇంటెలిజెన్స్ యూనిట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేశాడు. 1999లో స్వచ్ఛంద విరమణ తీసుకుని, తన పేరును నారాయణ్ సాకర్ హరిగా మార్చుకున్నాడు. తర్వాత సత్సంగాలు నిర్వహించడం ప్రారంభించాడు. ప్రజలను ఆధ్యాత్మికత వైపు నడిపించేందుకు తాను ఉద్యోగాన్నివదిలేశానని తన భక్తులకు చెబుతుంటాడు.

షెడ్యూల్డ్ కులానికి చెందిన సూరజ్‌పాల్‌కు పిల్లలు లేరు. ఎక్కడికి వెళ్లినా భార్య ప్రేమ్ బటిని వెంట తీసుకెళ్తాడు. ఆయన పక్కనే ప్రేమ్ బటి కూర్చుని దిగిన ఫోటోలే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ట్రస్ట్‌ను స్థాపించిన సూరజ్ పాల్ ఆశ్రమాన్నికూడా నడిపిస్తున్నాడు.

భోలేబాబా అనుచరులెవరు?

బహదూర్ నగర్‌లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భోలే బాబా కీర్తి నలుదిశాల వేగంగా వ్యాపించింది. సోషల్ మీడియా అధికారిక ఖాతాలేమీ లేకపోయినా.. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో ఈయన బోధనలు కనిపిస్తుంటాయి. బాధల నుంచి విముక్తి కల్పిస్తాడన్ననమ్మకాన్ని మూటగట్టుకున్నాడు.

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ముఖ్యంగా బ్రజ్ ప్రాంతంలోని ఆగ్రా, అలీఘర్ డివిజన్‌లో భోలే బాబాకు మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది ప్రజలు అతనికి భక్తులుగా మారిపోయారు. ఎక్కువగా మంగళవారాల్లో నిర్వహించే తన 'సత్సంగం'కు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యేవారట.

భోలే బాబా వద్దకు వచ్చే ఓటర్లను ఆకర్పించేందుకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నుంచి రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా వరకు, సీనియర్ రాజకీయ నేతలు తరచూ సత్సంగ్‌లకు వచ్చేవారట. వారి రాకతో బాబాకు ప్రజాదరణ మరింత పెరిగిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో సత్సంగ్‌కు బయల్దేరినపుడు.. అతని కాన్వాయ్‌లో పోలీసులు వాహనాలు రక్షణగా ఉండడం వీడియోలో గమనించవచ్చు.

నారాయణి సేన పేరుతో వలంటీర్లు..

సత్సంగాల్లో రద్దీని నియంత్రించడానికి వీలుగా "నారాయణి సేన" పేరుతో బాబా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సిబ్బందిలో పురుషులు, మహిళలు కూడా ఉంటారు. వీరు ఆశ్రమం నుంచి సత్సంగ్ వేదిక వద్దకు భోలే బాబాను జాగ్రత్తగా తీసుకెళ్తుంటారు.

హత్రాస్‌కు చెందిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు.. "బాబా సందేశం వినిపిస్తారు. సత్సంగ్ వేదిక ఏర్పాట్లను చూసుకునేందుకు సొంత వలంటీర్లు ఉన్నారు’’ అని చెప్పారు.

స్వయం ప్రకటిత దేవుడు..

తనకు గురువు లేడని, దైవమే నన్ను పలికిస్తుందని చెబుతుంటాడు భోలే బాబా. ఈయన ఉపన్యాసలు ముఖ్యంగా మానవత్వం, సోదరభావం, జీవుల పట్ల గౌరవం, అహింస చుట్టూనే ఉంటాయి.

విరాళాలు అనుచరులకే..

తనకు వచ్చే విరాళాలను తన అనుచరులకు పంపిణీ చేస్తుంటాడట. దాంతో వారు బాబా తమకు కేవలం గురువు మాత్రమే కాదు. స్వయంగా దేవుడని చెబుతుంటారు.

సోషల్ మీడియా ప్రభావం వల్లే..

బాబాకు నేరుగా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు లేవు. బాబా గురించి ఆయన సత్సంగుల గురించి చాలా ఛానెళ్లు చూపిస్తుంటాయి. బాబా ఎక్కడ, ఎప్పుడు సత్సంగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు? వాటిల్లో పాల్గొనేందుకు స్లాట్‌ బుక్ చేసుకోవడం గురించి ప్రమోట్ చేస్తుంటాయి. అన్నీ తెలిసిన వ్యక్తిగా ఛానళ్లు ఆయనను చిత్రీకరించాయి.

భోలే బాబా చుట్టూ ఉన్న వివాదం ఏమిటి?

స్వయం ప్రకటిత దేవుడిగా చెప్పుకునే బాబా.. కోవిడ్ సమయంలో పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. 2022 కోవిడ్ సమయంలో యుపిలోని హత్రాస్‌లో ఓ సత్సంగ్ నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం 50 మందిని మాత్రమే అనుమతించగా.. 50వేల మందికి పైగా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇలాంటి కార్యక్రమాల వల్లే కోవిడ్ వ్యాప్తిపై చెందుతుందని కొందరి నుంచి విమర్శలు కూడా అందుకున్నారు.

Tags:    

Similar News