సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడానికి కారణమేంటి?

"హిసార్‌ను అభివృద్ధి చేస్తానని ప్రతిజ్ఞ చేశా. హిసార్ ప్రజలు నా కుటుంబం. ఓం ప్రకాష్ జిందాల్ ఈ కుటుంబంతో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు." - సావిత్రి జిందాల్

Update: 2024-09-13 08:07 GMT
సావిత్రి జిందాల్

భారతదేశపు అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. హిసార్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. నామినేషన్ల చివరిరోజున (సెప్టెంబర్ 12 న) ఆమె నామినేషన్‌ వేశారు.

టికెట్ నిరారించడంతో..

కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ హిస్సార్ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ స్థానాన్ని బీజేపీ సిట్టింగ్ ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమల్ గుప్తాకు కేటాయించింది బీజేపీ. దీంతో OP జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్, 74 ఏళ్ల సావిత్రి జిందాల్ తీసుకున్న నిర్ణయం అధికార బీజేపీలో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.

అభిమానుల అభీష్టం మేరకే..

కమల్ గుప్తాను మళ్లీ బీజేపీ అధిష్టానం రంగంలోకి దించడంతో ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆమెను ఎన్నికల బరిలో నిలిపేందుకు హిసార్‌లోని జిందాల్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. వారి కోరిక మేరకు పోటీ చేయాలని సావిత్రి నిర్ణయం తీసుకున్నారు. "నేను నో చెప్పలేను. వారి మనోభావాలను గౌరవించటానికి నేను ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తాను" అని ప్రకటించారు.

సావిత్రి జిందాల్ ఎవరు?

ప్రముఖ దివంగత పారిశ్రామికవేత్త దివంగత ఓపీ జిందాల్ భార్య సావిత్రిని దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఆమె ఒకరు. తన నామినేషన్ పత్రాల్లో సావిత్రి తన మొత్తం ఆస్తులను రూ. 270.66 కోట్లుగా ప్రకటించారు. 2009 ఎన్నికలలో ఆమె తన ఆస్తులను రూ. 43.68 కోట్లుగా చూపారు. 2014 ఎన్నికల నామినేషన్‌లో అది రూ.113 కోట్లకు చేరుకుంది.

రాజకీయ జీవితం..

హెలికాప్టర్ ప్రమాదంలో భర్త ఓపీ జిందాల్ హఠాన్మరణం చెందడంతో సావిత్రి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె భర్త, జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ సభ్యుడు ఓం ప్రకాష్ జిందాల్ హిసార్ నుంచి మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలలో (1991, 2000, 2005) పోటీ చేశారు. భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

భర్త మృతితో రాజకీయాల్లోకి..

2005లో హెలికాప్టర్ ప్రమాదంలో భర్త ఓపీ జిందాల్ మృతితో జరిగిన హిస్సార్ ఉప ఎన్నికలో సావిత్రి జిందాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో అదే స్థానం నుంచి తిరిగి ఎన్నికయ్యారు. భూపిందర్ సింగ్ హుడా ప్రభుత్వంలో ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. అయితే 2014 ఎన్నికలలో మళ్లీ బరిలోకి దిగి బీజేపీ నేత కమల్ దాస్ గుప్త చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో సావిత్రి పోటీ చేయలేదు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కమల్ గుప్తాతో మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు.

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి..

ఈ ఏడాది మార్చిలో సావిత్రి జిందాల్ కుమారుడు నవీన్ జిందాల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆమె కూడా కాషాయ పార్టీలో చేరిపోయారు. హిసార్‌లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

బీజేపీతో సంబంధాలు చెడాయా?

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు సావిత్రిని ‘‘మీ నామినేషన్ తిరుగుబాటు చర్యగా భావించవచ్చా? అని విలేఖరులు అడిగారు. దానికి సావిత్రి బదులిచ్చారు. తాను బీజేపీ సభ్యత్వం తీసుకోలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన తన కుమారుడు నవీన్ జిందాల్ కోసం మాత్రమే తాను ప్రచారం చేశానని చెప్పారు. (ఆ సమయంలో ఆమె హిసార్ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థి రంజిత్ సింగ్ చౌతాలా కోసం కూడా ప్రచారం చేశారు.)

గత 20 ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్నానని, ప్రజాసేవ చేసేందుకు తనకు మరో అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. ఇదే విషయాన్ని కొడుకుతో చర్చించారట. ‘ఆమె ఒకసారి 'అవును' అని చెబితే ఆమె వెనక్కి తగ్గదని అందరికీ తెలుసు.’’ అని నవీన్ చెప్పారు.

హుడాతో సత్సంబంధాల వల్లేనా..

సావిత్రి జిందాల్‌కు టిక్కెట్ ఇవ్వకపోవడంపై బీజేపీ మరో కారణం చెబుతోంది. ‘సావిత్రి జిందాల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ నేత హుడా సాహిబ్‌తో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. అతన్ని ఆమె "అన్నయ్య" అని సంభోదిస్తారు. సావిత్రి జిందాల్‌ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తనకు అన్నీ నేర్పింది ఆయనే’’నని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు.

హిసార్‌లో గట్టిపోటీ..

2014 ఎన్నికల్లో హిసార్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సావిత్రి కమల్ గుప్తా చేతిలో ఓడిపోయారు. ఈసారి గుప్తాకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ స్థానం నుంచి రాజకీయంగా రామ్ నివాస్ రారాను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. "హిసార్‌ను అభివృద్ధి చేస్తానని ప్రతిజ్ఞ చేశా. హిసార్ ప్రజలు నా కుటుంబం. ఓం ప్రకాష్ జిందాల్ ఈ కుటుంబంతో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు." అని నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సావిత్రి జిందాల్ పేర్కొన్నారు.

హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్, అక్టోబర్ 8న పోలింగ్ జరగనుంది. 

Tags:    

Similar News