లడాకీల నెలరోజుల పాదయాత్ర ఎందుకోసం?
లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని నెల రోజుల పాదయాత్ర లేహ్ నుండి ప్రారంభమైంది.
దేశంలో రాష్ట్రాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. బీహార్ నుంచి జార్ఖండ్ వేరుపడింది. ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ఏర్పడింది. ప్రస్తుతం అదే వరసలో కేంద్ర పాలిత ప్రాంతం నుంచి లడఖ్‌కు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
నెలరోజుల పాటు పాదయాత్ర..
లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని పర్యావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో నెల రోజుల పాదయాత్ర లేహ్ నుండి ప్రారంభమైంది.అపెక్స్ బాడీ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్ బ్యానర్‌పై సెప్టెంబర్ 1న NDS మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర..గాంధీ జయంతి (అక్టోబర్ 2) రోజున ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద ఈ మార్చ్ ముగుస్తుందని లడఖ్ బౌద్ధ సంఘం అధ్యక్షుడు వాంగ్‌చుక్, త్సెరింగ్ డోర్జే లాక్రూక్, అపెక్స్ బాడీకి సంబంధించిన వివిధ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.
చర్చల ప్రస్తావన లేనందువల్లే..
చాలా కాలం తర్వాత కూడా ఢిల్లీలో చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఆహ్వానం అందనందున లడఖీ నేతలు యాత్ర చేపట్టవలసి వచ్చిందని అపెక్స్ బాడీ పేర్కొంది.
ఆ విషయం చెప్పేందుకే..
అవిభాజ్య జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాజీ మంత్రి అయిన లాక్రూక్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ..రాష్ట్ర హోదా, ఉద్యోగ భద్రత, తదితర డిమాండ్‌లపై చర్చలకు లడఖీ నాయకత్వం సిద్ధంగా ఉందని కేంద్రానికి చెప్పడమే ఈ పాదయాత్ర లక్ష్యం అని చెప్పారు.
“మా డిమాండ్లను తిరస్కరించడంతో హోం మంత్రి అమిత్ షాతో చర్చలు విఫలమయ్యాయి. అయితే చర్చల పునరుద్ధరణకు కేంద్రం ఆసక్తి చూపుతున్నట్లు తర్వాత తెలిసింది.ఇంతలో లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది' అని లాక్రూక్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసి చాలా కాలం అయినందున..లడఖీ నాయకత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చలను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు. "అంతేకాకుండా..ఈ ఢిల్లీ చలో పాదయాత్ర మా డిమాండ్లపై మేము దృఢంగా ఉన్నామని మరియు మరో రౌండ్ చర్చల పట్ల కూడా ఆశాజనకంగా ఉన్నామని ప్రభుత్వానికి సంకేతం" అని ఆయన నొక్కి చెప్పారు.
“మా డిమాండ్లు చిన్నవి కావు. అవి నెరవేరడానికి సమయం పడుతుందని మాకు తెలుసు.అయితే వాటిని సాధించడానికి ఉద్యమాన్ని సజీవంగా ఉంచాలి. లడఖ్ సుదీర్ఘమైన, అంకితభావంతో కూడిన పోరాటానికి కట్టుబడి ఉందని మా తోటి లడాఖీలకు ఈ యాత్ర తెలియజేస్తుంది. ” అన్నారు.
రోజూ 25 కి.మీ..
మహాత్మా గాంధీ దండి మార్చ్ లాగా ‘‘ఢిల్లీ చలో" మార్చ్‌ను ప్రతిపాదించిన వాంగ్‌చుక్.. లడఖ్ నాలుగు-పాయింట్ ఎజెండాకు మద్దతుగా 28 రోజుల నిరాహారదీక్ష చేపట్టాలని అనుకున్నారు. అయితే కేంద్రంతో చర్చల అనంతర ఫలితంపై స్పష్టత వచ్చే వరకు..దీక్షను వాయిదా వేయాలని అపెక్స్ బాడీ కోరడంతో ఆయన వెనక్కు తగ్గారు.
నాలుగు పాయింట్ల డిమాండ్‌లో.. లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం, అదనపు లోక్‌సభ స్థానం, లడఖ్‌లో నిరుద్యోగాన్ని పరిష్కరించడం వంటివి ఉన్నాయి.
రోజూ 25 కి.మీల పాటు మార్చ్ కొనసాగుతుందని వాంగ్‌చుక్ చెప్పారు. వారి సౌలభ్యాన్ని బట్టి మార్చ్‌లో లడకీలూ పాల్గొనవచ్చని కోరారు. మార్చ్ సందర్భంగా లడఖీ నాయకులు హిమాలయాలను ప్రభావితం చేస్తున్న పర్యావరణ సమస్యలు, లడఖ్ డిమాండ్ల గురించి అవగాహన కల్పించనున్నారు.
కార్గిల్ కార్యకర్తలు కూడా..
ఢిల్లీలో జరిగే శాంతియుత యాత్రలో కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రతినిధులు పాల్గొననున్నారు. కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ కో-ఛైర్మన్, అవిభాజ్య జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ మంత్రి ఖమర్ అలీ అఖోన్ లడఖీ సంస్థకు తమ పూర్తి మద్దతు ఉందన్నారు. "మేము వారితో టచ్‌లో ఉన్నాం. కార్గిల్ నుంచి కూడా వలంటీర్లు యాత్రలో పాల్గొంటారు" అని చెప్పాడు.
ముఖ్యంగా బిజెపి మినహా లడఖ్‌లోని అన్ని మత, సామాజిక, రాజకీయ సంస్థలు ఉమ్మడి ఉద్యమానికి మద్దతు ఇచ్చాయి. నాలుగు పాయింట్ల ఎజెండాకు బీజేపీ ఇప్పటివరకు దూరంగానే ఉంది.
‘రాజకీయ ప్రాతినిధ్యం తగ్గింది.’
“విభజన తరువాత లడఖ్‌కు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గింది. నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం నిరంతరం విస్మరిస్తున్న సమస్యలపై అవగాహన కల్పించేందుకు నేను ఈ యాత్రలో పాల్గొంటున్నాను' అని సరిహద్దు గ్రామమైన తుర్టుక్‌కు చెందిన మెహదీ షా (35) తెలిపారు. తొలిరోజు ఉద్యమానికి మద్దతుగా ఆయన ఇప్పుడు పాదయాత్రలో కూడా పాల్గొంటున్నారు. మార్చిలో వాంగ్‌చుక్ పిలుపునిచ్చిన నిరాహారదీక్షలో మూడు రోజుల పాటు పాల్గొన్నారు కూడా.
దీక్షలో వేలాది మంది వలంటీర్లు..
వాస్తవానికి 21 రోజులపాటు ప్లాన్ చేసిన నిరాహారదీక్షను 66 రోజుల వరకు వివిధ సంఘాలకు చెందిన వేలాది మంది వాలంటీర్లు కొనసాగించారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా దీక్ష విరమించాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తామని లేహ్ నాయకులు హామీ ఇచ్చారు. కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ నేతలు కూడా ఐదు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా నిలిచారు.
వలంటీర్లకు ఏర్పాటు..
యాత్ర మొదటి రోజు లేహ్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని రణబీపూర్ గ్రామంలో ఆగి, సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. మార్చ్‌లో పాల్గొనే వలంటీర్లకు భోజన, వసతి ముందుగానే ఏర్పాటు చేశారు.