వారసత్వ రాజకీయాలు బీఎస్పీకి కలిసొస్తాయా?
మాయావతి ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ఎన్నుకోవడం బీజేపీకి లాభిస్తుందా? వారసత్వ రాజకీయాలు అందుకు కారణమా?
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) లండన్‌లో చదువుకున్న తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్(Akash Anand)ను తన రాజకీయ వారసుడిగా ఎన్నుకున్నారు. ఇటీవల లక్నోలో దేశం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటుచేశారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మీటింగ్ పెట్టారు. అందులో మాయవతి తరపున పార్టీ కార్యకర్త ఉదయవీర్ సింగ్ ఆకాష్ ఆనంద్ పేరును ప్రకటించారు. మాయావతి ఇటీవల రాజకీయ పరిణామాలు, తన ఆలోచనలను వారితో పంచుకున్నారు. పొత్తుల ప్రస్తావన లేకుండా.. రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు.
బీఎస్పీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ ఓట్లు పొత్తు భాగస్వాములకు బదిలీ అవుతాయి. భాగస్వాములు తమ ఓట్లను బీఎస్పీ అభ్యర్థులకు ట్రాన్స్‌ఫర్ చేయలేరు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న బీఎస్పీలాగా ..ఇతర పార్టీలు ప్రజా ప్రయోజనాలకు కట్టుబడి ఉండకపోవడమే అందుకు కారణం. గతంలో కుదిరిన పొత్తులు బీఎస్పీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
బీఎస్పీ పనితీరు..
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. బీఎస్పీ(BSP) సమాజ్‌వాదీ పార్టీ (SP)తో పొత్తు పెట్టుకుని బరిలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో బీఎస్పీ 10 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 62, సమాజ్‌వాదీ పార్టీ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే గెలిచింది.
2014 లోక్‌సభ ఫలితాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. బీఎస్పీ నుంచి ఒక్కరూ కూడా గెలవలేదు. సమాజ్‌వాదీ పార్టీ 5 స్థానాలు, బీజేపీ అత్యధికంగా 71 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు ఒక స్థానం లభించగా.. మరో రెండు స్థానాల్లో ఒకటి అప్నాదళ్, మరొకటి బీజేపీ మిత్రపక్షం కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీకి మధ్య పొత్తు లేదు.
1993లో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఎస్పీ, బీఎస్పీ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. బీఎస్పీ మద్దతుతో ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన ఒక సంవత్సరంలోనే జరిగింది. ఆ సమయంలో ఓటర్లు బీజేపీ మందిర్ కార్డును తిరస్కరించారని చెప్పవచ్చు. కానీ 1995లో ములాయం సింగ్ ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకుంది. బీజేపీ మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ దాదాపు 13 శాతం ఓట్లను కైవసం చేసుకున్నా.. అసెంబ్లీలో కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. దీనికి విరుద్ధంగా, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 2017లో 28.32 శాతంతో పోలిస్తే 32 శాతానికి పైగా ఓట్లను సాధించారు. 2022లో ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ఓట్ల శాతం కాస్త తగ్గింది. 2017లో 41.57 శాతం నుంచి 2022లో 41.3 శాతానికి పడిపోయింది.
ఓట్ల బదిలీ..
యూపీలో బీఎస్పీ ఇప్పుడు బలహీనంగా ఉంది. బీజేపీ, ఎస్‌పి ముందంజలో ఉన్నాయి. ఓట్ల శాతంలో మాత్రమే కాంగ్రెస్ కంటే బీఎస్పీ ఆధిక్యంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీలో రెండు సీట్లతో సరిపెట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ పునరుజ్జీవనానికి పొత్తే ఉత్తమ మార్గం.
ముస్లిం ఓటర్ల ప్రభావం ఉంటుందా?
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు మాయావతి డిసెంబర్ 9న ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా నుంచి తన పార్టీ ఎంపీ కున్వర్ డానిష్ అలీని సస్పెండ్ చేశారు. ఇది ముస్లిం ఓటర్లపై ప్రభావాన్ని చూపుతుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీయేతర పార్టీల మధ్య పొత్తు లేనప్పుడు..రాష్ట్రంలో దాదాపు 22 శాతం దళితులు, దాదాపు 20 శాతం ముస్లిం ఓట్లు పరస్పర ప్రయోజనాల కోసం పనిచేశాయి. ఈ విషయాన్ని మాయావతితోపాటు మరికొందరు కూడా అంగీకరించారు.
మేనల్లుడి నియామకం ఊహించిందే..
మాయావతి రాజకీయ వారసుడిగా తన మేనల్లుడి నియామకం ఊహించిందే. 28 ఏళ్ల ఆకాష్ ఆనంద్ చాలా సంవత్సరాలుగా మాయవతి బహిరంగ సభల్లో కనిపిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలను చూసే బాధ్యతను ఆకాష్‌కు అప్పగించారు. 2019 నుంచి బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మాయావతి ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌పై దృష్టి సారిస్తారని ఆకాష్ నియామకాన్ని బట్టి తెలుస్తోంది.
బీజేపీకి అనుకూలం..
రాజకీయ వారసత్వానికి బీజేపీ దూరం. ఒక్కమాటలో చెప్పాలంటే వారసత్వ రాజకీయాలను కమలం పార్టీ ప్రోత్సహించదు. ఇప్పుడు మాయవతి తీసుకున్న నిర్ణయం బీజేపీకి కలిసొచ్చేలా ఉంది.
కాన్షీరాం భావాలకు వ్యతిరేకంగా..
బీఎస్పీ వ్యవస్థాపకుడు దివంగత కాన్షీరామ్ పంజాబ్‌లోని తన కుటుంబంతో ఉన్న సంబంధాలన్నింటినీ పక్కనపెట్టి మాయావతిని తన రాజకీయ వారసుడిగా నియమించారు. 2006లో కాన్షీరాం కన్నుమూశారు. ఆ సమయంలో ఆయన సోదరుడు హర్బన్స్ సింగ్, సోదరి స్వర్ణ్ కౌర్ వారసత్వాన్ని చూపుతూ.. కాన్షీరాం భౌతిక కాయాన్ని తమకు అప్పగించాలని ఢల్లీి హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఫలితం లేకపోయింది. మాయావతి మద్దతుదారుల వల్ల ప్రాణహాని ఉందన్న భయంతో.. కాన్షీరాం అంత్యక్రియలకు కాన్షీరాం కుటుంబం నుంచి ఇద్దరిని మాత్రమే అనుమతించారు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే.. బీఎస్పీ అధినేత తీరు కాన్షీరామ్ భావాలకు విరుద్ధంగా కనిపిస్తోంది.