పారిశుధ్య కార్మికులతో కలిసి భోంచేసిన యోగి..

తాత్కాలిక హెల్త్ వర్కర్లకు ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ వర్తింపు, పారిశుధ్య కార్మికుల కనీస వేతనం రూ. 16వేలకు పెంపు - ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం.;

Update: 2025-02-28 08:31 GMT
Click the Play button to listen to article

మహా కుంభమేళా ముగిసింది. జనవరి 13 నుంచి మొదలైన పుణ్యస్నానాలు ఫిబ్రవరి 28తో ముగిశాయి. దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) చేరుకుని పవిత్రస్నానం ఆచరించారు. భక్తులకు సౌకర్యాలు సమకూర్చడంలో వివిధ శాఖలు కలిసి పనిచేశాయి. అయితే కుంభమేళా పరిసరాలను 45 రోజుల పాటు శుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు (Sanitation workers) కీలక పాత్ర పోషించారు. వీరి శ్రమను సీఎం యోగి (CM Yogi Adityanath) గుర్తించారు. కుంభ మేళాలో విధులు నిర్వహించిన పారిశుధ్య కార్మికులకు రూ. 10వేల బోనస్ ప్రకటించారు. ఏప్రిల్ నుంచి కనీస వేతనంగా రూ. 16వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక మేళాలో సేవలందించిన తాత్కాలిక ఆరోగ్య కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.


సత్కారం, సర్టిఫికెట్ల పంపిణీ..

కుంభ్ మేళా ముగిసిన అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలను సత్కరించారు. వారి కృషిని ప్రశంసిస్తూ.. స్వచ్ఛ కుంభ్ కోష్ ఆయుష్మాన్ యోజన కింద సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం వారితో కలిసి భోం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు బ్రజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య పాల్గొన్నారు. జరిగిన మహా కుంభ్ వేడుకల్లో వారిచేసిన సేవలకు గౌరవ సూచకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రజలకు కృతజ్ఞతలు..

కుంభమేళా విజయవంతంగా ముగియడంతో సీఎం యోగి ప్రయాగరాజ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. "మహా కుంభ్‌ను తమ స్వంత వేడుకగా భావించి గత రెండు నెలల పాటు ప్రయాగరాజ్ ప్రజలు ప్రభుత్వానికి సహకరించారు. నగర జనాభా 20 లక్షల నుంచి 25 లక్షలు ఉన్నా.. ఒకేసారి 5 కోట్ల నుంచి 8 కోట్లు మంది వస్తే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించవచ్చు" అని పేర్కొన్నారు. 

Tags:    

Similar News