డ్రగ్స్‌పై రేవంత్‌ 'వార్‌' చివరి వరకు సాగేనా?

గంజాయి అమ్మే దుకాణం యజమానిని నమ్మించడానికి కనీసం ఐదారు రోజులు పడుతుంది. పోలీసులు రెయిడ్ చేస్తారని తెలిస్తే క్షణాల్లో సరకంతా మాయం.. ఎలా?

Update: 2023-12-25 13:33 GMT
డ్రగ్స్‌కి వ్యతిరేక ర్యాలీ (ఫైల్‌)

పెద్దపల్లి జిల్లా. మంథని నియోజకవర్గం.. మాల్లారం.. ఓ చిన్న గ్రామం. ఇంతచిన్న ఊర్లోని నూనూగు మీసాల పోరగాళ్లు కూడా గంజాయి తాగడం ఆశ్చర్యమేసింది సర్’ అని జర్నలిస్టు మిత్రుడు నాగరాజ్‌ యాదవ్ చెప్పినప్పుడు విస్మయం కలిగింది. గంజాయి ఇంత చిన్న చిన్న గ్రామాల దాకాపోయిందా అన్పించింది.

రో మిత్రుడు మెయినుద్దీన్‌ హైదరాబాద్ మహానగరంలో గంజాయి ఎలా అమ్ముతారో, అమ్మేవాళ్లు కొనే వాళ్లను ఎలాగుర్తిస్తారో సవివరంగా చెప్పినప్పుడు ఆశ్చర్యమేసింది. గంజాయి అమ్మే దుకాణం యజమానిని నమ్మించడానికి కనీసం ఐదారు రోజులు పడుతుందట. పోలీసులు రెయిడ్ చేస్తారని తెలిస్తే..అప్పటి దాకా కనిపించే గంజాయి, ఇతర మారక ద్రవ్యాలను ఎలా మాయం చేస్తారో, దానికెంత టెక్నిక్ ఉండాలో కూడా మొయినుద్దీన్ వివరించినప్పుడు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్సినిమాలేవీ దీని ముందు పనికి రావనిపించింది.

అందుకేనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్‌ పై యుద్ధాన్ని ప్రకటించారు.“డ్రగ్స్‌, గంజాయి అనే పదాలు రాష్ట్రంలో వినిపించకూడదు. గంజాయి విక్రేతలను ఉక్కుపాదంతో అణచివేయాలి. జిల్లాకలెక్టర్లు, ఎస్పీలు ఇందుకు నడుంకట్టాలి” ఆదేశాలు ఇచ్చారు. సీఎం అంతటి ఆగలేదు. ఓ జోక్ కూడా పేల్చారు.‘‘స్నేహపూర్వక (ఫ్రెండ్లీ) పోలీసింగ్‌ అంటే పౌరులతోనే గాని క్రిమినల్స్ తో కాదు. గంజాయి, మాదకద్రవ్యాలు వాడే వారితోఫ్రెండ్లీగా ఉండొద్దు. నేరాలు, హత్యలు చేసినవారు పోలీస్‌స్టేషన్‌కు వస్తే.. వాళ్లను స్నేహితుల్లా చూడొద్దు. సామాన్య పౌరుడు ఫిర్యాదుచేయడానికి వస్తే.. కూర్చోబెట్టి మర్యాదగా వివరాలు అడిగి తెలుసుకోవాలి. భూకబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్‌ మాఫియాను వదలొద్దు” అని సీఎం రేవంత్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో స్పష్టంచేశారు.

ఎందుకిలా పెరిగింది...

”చిన్న చిన్న పట్టణాల్లోని కళాశాలల్లో, పాఠశాలల్లో కూడా డ్రగ్స్‌, గంజాయి దొరుకుతున్నాయి. ఇదిప్రమాదకరం. వీటి వినియోగంతో కుప్పకూలిన పంజాబ్‌ రాష్ట్రం మన కళ్ల ముందే ఉంది.తెలంగాణ కూడా పంజాబ్‌ మార్గంలోనే ప్రయాణిస్తోంది. ఉద్యమ నేపథ్యం ఉన్న రాష్ట్రాన్నిగంజాయి ఆక్రమిస్తోంది. హుక్కా కేంద్రాలు, పబ్‌లలో ఏం జరుగుతోందో చూడండి. ఎంత పెద్దవాళ్లయినావదలొద్దు. పోలీసులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుంది. తెలంగాణలో గంజాయిపండించేది తక్కువ. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)నుంచి తెలంగాణలోకి దిగుమతిపై తనిఖీలు చేయాలి” అని సీఎం రేవంత్ అన్న మాటలు చాలామందిని ఆలోచనలో పడేశాయి. నిజంగానే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందా అని అందరూ యోచించాల్సిన సమయమే.

గంజాయి సరఫరా ఎలా అవుతుందో కనిపెట్టాలి...

చిన్న చిన్న పట్టణాల్లోనూ గంజాయి ఎలావినియోగిస్తున్నారో సమాచారం సేకరించాలి. కొత్త సంవత్సరం వేడుకల పేరుతో సన్‌బర్న్‌పార్టీకి ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్ముతున్నారు. నిర్వాహకులు ఇంతవరకూ అనుమతితీసుకోలేదు. అనుమతి తీసుకోకుండా టికెట్లు ఎలా అమ్ముతారు? పాఠశాలల విద్యార్థులకూటికెట్లు అమ్ముతున్నారు. 18 ఏళ్లలోపువారిని దీనికివెళ్లడానికి అనుమతి ఇవ్వొద్దు. సైబరాబాద్‌ కమిషనర్‌ దీనిపై దృష్టిపెట్టాలి.

సన్‌బర్న్‌ పార్టీలపై నిషేధం...

గోవాలోగతంలో జరిగిన సంఘటనలతో సన్‌బర్న్‌ పార్టీని హైదరాబాద్‌ లో నిషేధించారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో అనుమతి ఇచ్చిరద్దు చేశారు. అయితే, తెలంగాణలో గతంలో పోలీసుఅధికారులే ఇలాంటి వాటిని స్వాగతించారు.

ఈ నాలుగు జిల్లాల నుంచే రవాణా..

హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు మాదక ద్రవ్యాల రవాణాకు ప్రధాన కేంద్రాలు. కేంద్రప్రభుత్వం లోక్‌సభలోనే ఈ విషయాన్ని ప్రకటించింది. డ్రగ్స్ పై యుద్ధం చేస్తామంటున్నపోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్స్ విభాగం డీజీపీగాఉన్న రవి గుప్తా చెప్పే దాని ప్రకారం.. అన్ని రాష్ట్రాల చెక్ పోస్టులను పటిష్టంచేశారు. సామాజిక సేవా కార్యకర్తలు చెప్పే దాన్ని బట్టి హైదరాబాద్,  విజయవాడలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగింది. ప్రత్యేకించి స్ట్రీట్ చిల్డ్రన్స్ లో ఇది విపరీతంగా ఉంది. చిత్రంగా స్కూలు పిల్లలలోడ్రగ్స్ వినియోగం పెరుగుతోందని చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ నిర్వాహకులు థామస్అభిప్రాయపడ్డారు.

సెంటర్, స్టేట్ కలిస్తేనే సత్ఫలితాలు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయకపోతే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడం అసాధ్యం. ఎక్కడెక్కడి నుంచి మాదకద్రవ్యాలు వస్తాయో కేంద్రం ఆధ్వర్యంలో ఎన్సీబీకి తెలుస్తుంది. ఆ సమాచారంరాష్ట్రాలకు వస్తే రవాణాను అరికట్టవచ్చు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనినార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరిగేజిల్లాలను గుర్తిస్తుంది. డ్రగ్స్ రహిత ప్రచారాన్ని నిర్వహించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ఆఫ్ సోషల్ డిఫెన్స్‌ అని ఓ కేంద్రం ఉంటుంది. దీనికి కేంద్రం ఆర్ధిక చేయూతనుఇస్తుంది. తెలంగాణలో టీఎస్ న్యాబ్ అని ఓ విభాగం ఉంది. ప్రస్తుతం ఈ సెంటర్ డ్రగ్స్పై వార్ నడుపుతోంది.

ఏపీ నుంచి గంజాయి...

తెలంగాణ మాత్రమే కాదు, పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ముప్పు నుంచి బయటపడలేదు. ఏజెన్సీప్రాంతాల్లో గంజాయి సాగవుతోంది. అక్కడి నుంచే అక్రమ రవాణా అవుతోంది. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలు కూడా మాదకద్రవ్యాల రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. మరోపక్క, తెలంగాణ లో డ్రగ్స్ (పీడబ్ల్యుఐడి) ఇంజెక్షన్ల సంఖ్యకూడా పెరిగింది.

ఎందరో డ్రగ్స్‌ బాధితులు...

సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో తెలంగాణలో సుమారు 85వేలకు పైబడి పీడబ్ల్యూఐడీలు ఉన్నారు.తెలంగాణలో 3.5 లక్షల మంది యాంఫెటమైన్-రకం ఉత్ప్రేరకాలకు (ఎటిఎస్) బానిసలుగాఉన్నారు. ఈ డ్రగ్ కి అలవాటు పడ్డ వారు ఓ గుంపుగా ఉంటారు. యాంఫేటమిన్, మెథాంఫేటమిన్ఇంజక్షన్లు లేనిదే వీళ్లు తట్టుకునే పరిస్థితి ఉండదు.

ఎందరో సెలబ్రిటీలు...

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ అనడతోనే గుర్తుకు వచ్చేది సినీ ప్రముఖులు. ఇప్పటికే చాలా మంది సినీ నటుల్ని డ్రగ్స్‌ విభాగం విచారించింది. అయితే ఏ ఒక్కరిపైనా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం విచారకరం అంటున్నారు ప్రముఖ సోషల్‌ వర్కర్‌ డి. నరసింహారెడ్డి.హైదరాబాద్‌, విజయవాడల్లో వీధి పిల్లల్లో మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువైంది. విద్యార్థులలోగంజాయి, ఇతర డ్రగ్స్ వినియోగం కూడా పెరుగుతోంది. ఏపీ, తెలంగాణలో లక్షలాది మంది మద్యానికి, డ్రగ్స్‌కి బానిసలై జీవితాన్ని కళ్ల ముందే నాశనం చేసుకుంటున్నారు. ఈ బెడదపై సీఎం రేవంత్‌ రెడ్డి ఉక్కుపాదం ఎంత వరకు మోపుతారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News