ఛత్తీష్ గడ్ లో 'సర్జికల్ స్ట్రయిక్'

మవోయిస్టు రాష్ట్రంగా పేరున్న ఛత్తీష్ గడ్ లోనే ఇటీవల వారికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్క 2024లో నే దాదాపు 80 మంది హతమయ్యారు. నిన్న 29 మంది. వివరాలు

Update: 2024-04-17 00:48 GMT

ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో  సరిహద్దు భద్రతా దళం (బిఎస్ ఎఫ్) జవాన్లకు, మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో మంగళవారం నాడు 29 మంది మావోయిస్టులు హతమయ్యారు.

 ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన శంకర్‌రావు, ఆయన భార కూాడా మరణించారని తెలుస్తూ ఉంది. దీనిని పోలీసులు ఇంకా ధృవీకరించడం లేదు.  శంకర్‌ పై 25 లక్షల రివార్డు ఉన్నది.సిరిపల్లె సుధాకర్ @ శంకర్  స్వగ్రామం చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల. ఇలాగే మరొక లలతి, వినోద్ గవాడే అనే ఇద్దరు సీనియర్ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.

ఒక ఎన్ కౌంటర్ లో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టు హతం కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటి సారి. మావోయిస్టులకు బలమయినకేంద్రమయినా ఛత్తీష్ గడ్ లొ ఇటీవల వారికి బాగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్క 2024లోనే ఎన్ కౌంటర్ లలో 79 మంది చనిపోయారు.

 మంగళవారం నాటి  ఎన్ కౌంటర్ సమాచారాన్ని సరిహద్దు భద్రతా దళం మంగళవారం వెల్లడించింది.

బీఎస్ఎఫ్, కాంకేడ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG)తో కలిసి చోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినగుండా ప్రాంతంలో నక్సల్ ఏరివేత కూంబింగ్ ని  సంయుక్త ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సందర్భంగా బీఎస్ఎఫ్ బృందంపై నక్సలైట్లు అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో కాల్పులు జరిపారు. బీఎస్ఎఫ్ బలగాలు వారిపై ఎదురుదాడికి దిగడంతో ఎన్ కౌంటర్ (encounter) జరిగిందని బస్తర్ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ పి సుందర్రాజు తెలిపారు.

ఈ ప్రాంతంలో మావోయిస్టు ఏప్రిల్ అయిదవ తేదీనుంచి మకాం వేశారని, వారు ఉన్న ప్రదేశం గ్రిడ్ లోకేషన్ ను కేంద్ర హోం శాఖ కూంబింగ్ చేస్తున్న అధికారులకు అందించడం వల్లే ఈ ఎన్ కౌంటర్ విజయవంతమయిందని పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు ఈ ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టు చనిపోయారని, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కంకేర్ పోలీసు సూపరింటెండెంట్ కల్యాణ్ ఎలెసెలా వెల్లడించారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఈ ఎన్ కౌంటర్ ని ప్రశంసించారు. దానిని ఒక సర్జికల్ స్ట్రయిక్ అని వర్ణించారు. విజయ్ శర్మ హోం మంత్రి కూడా. ఇంత  పెద్ద ఎత్తున మావోయిస్టులను మట్టు పెట్టినందుకు ఆయన బిఎస్ ఎఫ్ ను, రాష్ట్ర పోలీసులను ప్రశంసించారు.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి 29 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఘటనా స్థలం నుంచి ఏడు ఏకే సిరీస్ రైఫిల్స్, మూడు లైట్ మెషిన్ గన్స్ (LMG)లను స్వాధీనం చేసుకున్నామని ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారని కళ్యాణ్ తెలిపారు. వారిలో ఒక బిఎస్ ఎఫ్ జవాను కాలికి బుల్లెట్ గాయమైందని వెల్లడించారు.

ఎన్నికల ముందు..

ఛత్తీష్ గడ్ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు కొద్ది రోజుల ముందు ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఏప్రిల్ 19న తొలి దశ లోక్ సభ పోలింగ్ లో బస్తర్ లోక్ సభ నియోజకవర్గానికి మాత్రమే పోలింగ్ జరుగనుంది. కాగా, ఈ రోజు ఎన్ కౌంటర్ జరిగిన కంకేర్ తో పాటు రాజ్ నంద్ గావ్, మహాసముంద్ లలో రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. 2023 డిసెంబర్ నుంచి కంకేర్ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్ లలో 68 మంది మావోయిస్టులు హతమయ్యారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2023లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మొత్తం 70 ఎన్ కౌంటర్లు జరగ్గా, 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ సమయంలో మొత్తం 394 మంది మావోయిస్టులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి.



Tags:    

Similar News