హైదరాబాద్ ఎంపీ బరిలో చెరువుల నేస్తం...

నగరం చుట్టూ ఉన్న చెరువులను కాపాడుకోవాలని, కబ్జా చేసిన చెరువులను వెనక్కి తీసుకోవాలని పోరాడుతున్న డాక్టర్ లూబ్నా సర్వత్ హైదరాబాద్ ఎంపిగా నామినేషన్ వేశారు.

Update: 2024-04-28 01:07 GMT
DR Lubna Sarwath nomination

 డాక్టర్ లుబ్నా సర్వత్ హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో నామినేషన్ వేశారు.   ఇండోనేషియా డాక్టరేట్ చేసి వచ్చి, ఆమె హెదరాబాద్ నగరాన్ని నీటికొతర నుంచి కాపాడుకునేందుకు ఆమె దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు.  డాక్టర లూబ్నా పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్ లో పేదలకు సేవలందించడం, పర్యావరణ పరిరక్షణ  ఆమెనినాదాలు, హైదరాబాద్ లో కబ్జా అయిన చెరువులను పునరుద్ధరించాలని, చెరువుల నుంచి ఆక్రమణలను ఎత్తివేయాలని, చెరువులను బాగు చేయాలని పోరాటం చేస్తూ  ఆమె  హైదరాబాద్ 'చెరువుల నేస్తం' అయ్యారు.

బాగా డబ్బు, పలుకుబడి ఉన్న అభ్యర్థులు పోటీచేస్తున్న హైదరాబాద్ నియోజకవర్గంలో ఆమె పేదల పక్షాన, దేశంలో ఒక విశిష్టనగరమయిన హైదరాబాద్ పక్షాన నిలబడి ఎన్నికల్లో తలపడుతున్నారు. ఒక మంచి ఆశయంతో ఇపుడు హైదరాబాద్ లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరైనా ఉంటే ముందు చెప్పుకోవల్సిన పేరు డాక్టర్ లూబ్నాదే.

ఆమె దగ్గిర డబ్బు లేదు. మనసంతా గొప్ప ఆశయం. మతావేశాలు, కులావేశాలు, డబ్బు, లిక్కర్ సమృద్ధిగా పంపిణీ అయ్యే ఎన్నికల్లో  హైదరాబాద్ బస్తీలు, అక్కడ నివసించే పేదల, వాళ్ల వసతులు, హైదరాబాద్ చెరువులు మంచి నీళ్లు... అవి నిత్యజీవిత సమస్యల మీదే ఆమె ఎఐఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ, బిజెపి అభ్యర్థి మాదవీ లత లతో పోటీ పడాలి.  ఆమె నినాదాలు భిన్నమయినవి, ఆమె నేపథ్యం భిన్నమయింది. ఆమె జీవితం భిన్నమయింది. చివరకు ఆమె పోటీ చేస్తున్న పార్టీ కూడా భిన్నమయింది. దాని పేరు ‘విద్యార్థుల రాజకీయ పార్టీ’.

హైదరాబాద్ లో  పోటీచేస్తున్న సంపన్న అభ్యర్థుల డబ్బు దస్కం గురించి లూబ్నా ఆలోచించడం లేదు. ప్రజల్లో చైతన్యం ఉంది. అదే నాకు  అండ అని లూబ్నా చెబుతున్నారు. నామినేషన్ వేశారు. ఎన్నికలు సృష్టిస్తున్న  ఈ వాతావరణ, ధ్వని కాలుష్యంలో లూబ్నా సైలెంట్ ప్రచారం ఎందరికి చేరుతుందో చూడాలి.


డా. లూబ్నా గురించి నాలుగు ముక్కలు


హైదరాబాద్ నగరంలో ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆర్థికవేత్త, పర్యావరణ పరిరక్షణ కార్యకర్త, ఇంటర్నేషనల్ జర్నల్ సంపాదకీయ సభ్యురాలు, సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కో-కన్వీనర్...వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు...ఇలా ఎన్నెన్నో సంస్థల్లో కీలక సభ్యురాలిగా హైదరాబాద్ నగరంలో సామాజిక సేవలు చేస్తున్న లుబ్నా సర్వత్ పేరు పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 

- చెరువులను కాపాడుకోవడం, పర్యావరణ పరిరక్షణ,పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పడం...పేద మహిళల అభ్యన్నతికి పాటు పడటం...ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటాలు సాగించిన సోషల్ యాక్టివిస్ట్ గా హైదరాబాద్ నియోజకవర్గంలో చాలా మందికి తెలుసు.
- గత యాభై ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనే ఉన్నతాశయంతో సోషల్ యాక్టివిస్ట్ అయిన డాక్టర్ లుబ్నా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
- హైదరాబాద్ ప్రజల సంక్షేమం, సాధికారత, భద్రత పట్ల తనకు నిబద్ధత, దృఢవిశ్వాసం ఉందని, అందుకే విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున మరోసారి ఎంపీ ఎన్నికల బరిలో దిగానని డాక్టర్ లుబ్నా ప్రకటించారు.
- 50 సంవత్సరాలుగా ఎంపీలుగా గెలుస్తూ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మజ్లిస్ కంచుకోటగా మార్చిన సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ బలమైన అభ్యర్థి కొంపెల్లి మాధవీలతను పార్లమెంట్ పోరులో సామాన్య సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ లుబ్నా ఢీ కొంటున్నారు. సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ లుబ్నా పోటీపై ‘ఫెడరల్ తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు.

ఉన్నత విద్యావంతురాలు...డాక్టర్ లుబ్నా

హైదరాబాదీ అయిన డాక్టర్ లుబ్నా సర్వత్ ఇండోనేషియా దేశంలోని జకార్తాలోని త్రిశక్తి విశ్వవిద్యాలయం నుంచి ఇస్లామిక్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ లో పీహెచ్‌డీ పట్టా పొందారు. త్రిశక్తి విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసరుగా ఉన్నారు. గతంలో ప్రొబేషనరీ ఆఫీసర్స్ రాతపరీక్షలో ఎంపికై పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిగా పనిచేశారు. జర్నల్ ఆన్ ఎథిక్స్ అండ్ సిస్టమ్స్, ఎమరాల్డ్ పబ్లికేషన్స్, యూకే సంపాదకీయ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమాత్-ఇ-ఇస్లామీ హింద్, మర్కజీ జమియాత్, అహ్లే హదీస్ హింద్ వంటి సంస్థలు తిరోగమన సంస్థలని విమర్శించే లుబ్నా కూడా ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించి సంచలనం రేపారు.

అసదుద్దీన్, మాధవీలతలతో సోషల్ యాక్టివిస్టు డాక్టర్ లూబ్నా ఢీ

హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి విద్యార్థుల రాజకీయ పార్టీ టికెట్‌పై పోటీ చేసేందుకు పర్యావరణ కార్యకర్త డాక్టర్ లుబ్నా సర్వత్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలతపై మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆమె చెప్పారు. హైదరాబాద్ నియోజకవర్గ పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా తాను పనిచేసేందుకే ఎంపీ బరిలో దిగానని లుబ్నా చెప్పారు.

ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే నా లక్ష్యం

తనను ఎంపీగా గెలిపిస్తే హైదరాబాద్ పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతానని డాక్టర్ లుబ్నా చెప్పారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపి, పేద ప్రజలు, మహిళల సాధికారత, ఉపాధికి తాను తోడ్పడతానని పేర్కొన్నారు. వరకట్నం దురాచారాన్ని రూపు మాపి, పాత బస్తీలో మద్యం, డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. యువతకు విద్యాబుద్ధులు చెప్పించి వారికి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానన్నారు. పేదలు రేకుల ఇరుకు ఇళ్లలో నివాసముంటున్నారని, వారికి సొంత ఇళ్ల నిర్మాణం చేపడతానన్నారు. పాత బస్తీ మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా పార్కులను ఏర్పాటు చేయిస్తానని లుబ్నా వివరించారు.

పాత బస్తీలో పరిస్థితులు మెరుగుపరుస్తా...

‘‘పాతబస్తీలో మురుగునీటి దుర్గంధం...అధ్వానంగా రోడ్లు...చాలీచాలని ఇరుకు రేకుల గదులు...పౌష్టికాహార లోపం...కనీసం చదువుకునేందుకు డబ్బులేక డ్రాపవుట్స్...ఇలా ఎన్నెన్నో సమస్యలు తిష్టవేశాయి. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ సమస్యలన్నింటినీ నేను పరిష్కరిస్తాను’’ అని లుబ్నా చెప్పారు.

ఎన్నికల్లో అక్రమాలపై సీపీకి ఫిర్యాదు చేస్తా...

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సాగుతున్న ఎన్నికల పర్వంలో అక్రమాలు, బోగస్ ఓట్ల పోలింగ్, రిగ్గింగ్, మతాన్ని చూపించి ఓట్లు అడగడం ఇలాంటి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై తాను హైదరాబాద్ నగర పోలీసు కమిషనరును కలిసి ఫిర్యాదు చేస్తానని డాక్టర్ లుబ్నా చెప్పారు.

ఓటర్లతో డాక్టర్ లుబ్నా ఆత్మీయ సమావేశాలు...ఓట్ల అభ్యర్థన

తనకున్న గుడ్ విల్ తో వినూత్న ప్రచారం

సోషల్ యాక్టివిస్టుగా తనకు ఉన్న గుడ్ విల్ తో సోషల్ మీడియా, ఫోన్, వాట్సాప్ ప్రచారం సాగిస్తున్నాని విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి డాక్టర్ లుబ్నాసర్వత్ చెప్పారు. తాను స్నేహితులు, శ్రేయాభిలాషుల వద్ద నుంచి క్రౌడ్ ఫండింగ్ రూ.10 లక్షలతో వినూత్న ప్రచారం చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. తన ప్రచారంలో ఫ్లెక్సీలు కాకుండా పర్యావరణ హిత ఖాదీ వస్త్రంపై తానే స్వయంగా రాసి గుడ్డ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో తాను ప్రచారం చేస్తున్నానని ఆమె వివరించారు. సోషల్ యాక్టివిస్టులు రాజకీయాల్లో ఎందుకు విజయం సాధించకూడదని ఎదురు ప్రశ్నించారు. చిన్న చిన్న సమావేశాలు నిర్వహిస్తూ లుబ్నా ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

సరస్సుల పరిరక్షణే ఆమె ధ్యేయం

డాక్టర్ లుబ్నా సర్వత్ దశాబ్దానికి పైగా నగరంలోని సరస్సులను రక్షించే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నంబరు 111 రద్దుకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమంలో లుబ్నా ముందున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, కాప్రా చెరువు, బమ్ రుకుండ్ దౌలా చెరువు ఇలా హైదరాబాద్ నగరంలోని పలు చెరువుల పరిరక్షణ కోసం ఈమె ఉద్యమించారు. ప్రభుత్వ అధికారులకు చెరువుల పరిరక్షణ గురించి పలు వినతి పత్రాలు సమర్పించారు. హైకోర్టులో చెరువుల పరిరక్షణ కోసం పిటిషన్లు దాఖలు చేసి న్యాయపోరాటం సాగిస్తున్నారు.

ఇఫ్తార్ పేరిట రూ.66 కోట్ల ప్రజాధనం దుర్వినియోగంపై పిల్
తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రమజాన్ నెలలో ఇఫ్తార్ పేరిట రూ.66కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని డాక్టర్ లుబ్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సంచలనం రేపారు. గతంలో దావత్ ఇ ఇఫ్తార్ పేరిట అప్పటి సీఎం కేసీఆర్ రూ.66కోట్లు ఖర్చు చేయడాన్ని లుబ్నా తప్పుబట్టారు.

పలు సార్లు ఎన్నికల్లో పోటీ
హైదరాబాద్ నగరంలో నిత్యం సామాజిక సమస్యలపై పోరాడే డాక్టర్ లుబ్నా గతంలోను పలు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈమె 2014వ సంవత్సరంలో హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు.ఆపై 2015లో ఆప్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల్లో కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా లుబ్నా పోటీ చేశారు. అనంతరం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆసిఫ్ నగర్ కార్పొరేటరు బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి చెందారు.
- ఈ సారి హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఓడించేందుకు ఈ సారి అధికార కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేయాలని భావించారు, అయితే అత్యున్నత స్థాయిలో లాబీయింగ్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ సాధించడంలో లుబ్నా విఫలమయ్యారు. ప్రస్థుతం లుబ్నా ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యురాలు కాదు.
హైదరాబాద్ బరిలో ఉద్ధండ నేతలపై సోషల్ యాక్టివిస్ట్ పోరు ఆసక్తికరంగా మారింది. సామాజిక సేవలు పరమావధిగా పనిచేస్తున్న ఉన్నత విద్యావంతురాలు డాక్టర్ లుబ్నాకు హైదరాబాదీ ఓటర్లు ఏమేర ఆదరిస్తారనేది జూన్ 4వతేదీ ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News