పార్లమెంట్ పోరులో అభ్యర్థులందరూ కోటీశ్వరులే..ఎక్కువమంది నేర చరితులే...

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కోటీశ్వరులేనని తేలింది. వారిలో ఎక్కువ మందిపై పలు పోలీస్ కేసులున్నాయని వెల్లడైంది.

Update: 2024-04-30 12:48 GMT
brs,bjp,congress parties

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వివిధ కారణాలతో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సగటున 30 మంది చొప్పున పోటీలో నిలిచారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు, మజ్లిస్ తో సహా 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, వారి ఆస్తులు, వారిపై ఉన్న కేసులను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విశ్లేషించింది.


ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో విద్యాధికులే అధికం
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మంది విద్యాధికులున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల తరపున పోటీస్తున్న అభ్యర్థుల్లో 24 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు కావడం విశేషం. అంటే 24 మంది ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థుల్లో ఎవరు పార్లమెంటుకు ఎన్నికైనా, వారు విద్యాధికులు కావడంతో తెలంగాణ వాణిని వారు సమర్ధంగా పార్లమెంట్ లో వినిపించగలరు. మరో 12 మంది గ్రాడ్యుయేట్ అభ్యర్థులు, మరో 16 మంది అండర్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మొత్తం మీద నిరక్షరాస్యులు ఎవరూ ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున బరిలోకి దిగక పోవడం మరో విశేషం.

ఎంపీ అభ్యర్థుల్లో కోటీశ్వరులే అధికం
ప్రధాన రాజకీయ పార్టీల తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువమంది కోటీశ్వరులే కావడం ఈ సారి ఎన్నికల విశేషం. ప్రధాన పార్టీలకు చెందిన 34 మంది అభ్యర్థుల ఆస్తులు రూ.10కోట్లకు పైగానే ఉన్నాయి.

అపర కుబేరుడు బీజేపీ అభ్యర్థి కొండా
తెలంగాణలోనే 1696.09 కోట్ల రూపాయల ఆస్తితో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అపర కుబేరుడిగా నిలిచారు. బీజేపీ పక్షాన బరిలోకి దిగిన అభ్యర్థులందరూ బడా వ్యాపారులు, కోటీశ్వరులు కావడం విశేషం. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత ఆస్తి 221.39 కోట్లతో కోటీశ్వరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. జహీరాబాద్ నుంచి బరిలోకి దిగిన బీబీ పాటిల్ రూ.151.69కోట్లతో మూడోస్థానంలో ఉన్నారు. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కు రూ.109.89 కోట్ల ఆస్తి ఉంది.బీజేపీ అభ్యర్థులు డీకే అరుణకు రూ.66.74 కోట్లు, ఈటెల రాజేందర్ కు రూ.54కోట్లు, బూరనర్సయ్యగౌడ్ కు రూ.39.29 కోట్లు, సైదిరెడ్డికి రూ. 31.34 కోట్లు, రఘునందన్ రావుకు రూ.22.08 కోట్లు, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డికి 18.01కోట్లు,ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు రూ. 16.25కోట్లు, గొడం నగేష్ కు రూ.3.08 కోట్ల ఆస్తులున్నాయని వారు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్నారు. ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ఆస్తి రూ.3.05కోట్లున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న బండి సంజయ్ ఆస్తి కేవలం రూ.1.12కోట్లుగా ఉంది. నాగర్ కర్నూల్ అభ్యర్థి పి భరత్ ఆస్తి రూ. 33లక్షలని చూపించారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల్లోనూ బడా వ్యాపారులే...
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పార్లమెంట్ బరిలో నిలిచిన వారందరూ బడా వ్యాపారులే కావడం విశేషం. ఖమ్మం పార్లమెంట్ నుంచి బరిలోకి దిగిన నామ నాగేశ్వరరావు రూ.155.9 కోట్లతో ఆస్తుల్లో అగ్రస్థానంలో నిలిచారు. భువనగిరికి చెందిన క్యామ మల్లేష్ కు రూ.145.34కోట్లు, కాసాని జానేశ్వర్ కు రూ. 131.4కోట్లు, గాలి అనిల్ కుమార్ కు రూ. 82.54కోట్లు, రాగిడి లక్ష్మారెడ్డికి రూ.82.54 కోట్లు, పి వెంకట్రామిరెడ్డికి రూ.63.57 కోట్లు, గడ్డం శ్రీనివాస యాదవ్ కు రూ.23.71 కోట్లు, మన్నెశ్రీనివాసరెడ్డికి రూ.16.17కోట్లు, కంచర్ల కృష్ణారెడ్డికి రూ.20.62 కోట్లు, బోయినపల్లి వినోద్ కుమార్ కు రూ.15.05కోట్లు, కొప్పుల ఈశ్వర్ కు రూ.5.22కోట్లు, తిగుళ్ల పద్మారావుకు రూ. 3.62 కోట్ల ఆస్తులున్నాయి. ఆత్రం సక్కుకు రూ.2.14కోట్లు, బాజిరెడ్డి గోవర్ధన్ కు రూ.1.41కోట్లు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు రూ. 1.41కోట్ల ఆస్తులున్నాయి.

కాంగ్రెస్ అభ్యర్థుల్లో రంజిత్ రెడ్డి బడా కోటీశ్వరుడు
కాంగ్రెస్ అభ్యర్థులందరూ కోటీశ్వరులే కావడం విశేషం. చేవెళ్ల నుంచి బరిలో నిలిచిన రంజిత్ రెడ్డి రూ. 294.47 కోట్లతో అపర కోటీశ్వరుడిగా నిలిచారు. కుందూరు రఘువీర్ ఆస్తి రూ.61.55కోట్లు, దానం నాగేందర్ కు రూ.59.61కోట్లు, సునీతామహేందర్ రెడ్డికి రూ.57.44కోట్లు, రామసహాయం రఘురాంరెడ్డికి రూ. 68.26 కోట్లు, మల్లు రవికి రూ.52.31కోట్లు, చామల కిరణ్ కుమార్ రెడ్డికి రూ.28.71 కోట్లు, గడ్డం వంశీకృష్ణకు రూ.24.09 కోట్లు, నీలం మధుకు రూ.15.44 కోట్లు, మహ్మద్ వలివుల్లా సమీర్ కు రూ.13.21కోట్ల ఆస్తులున్నాయి. కడియం కావ్యకు రూ.1.99కోట్లు, చల్లా వంశీచంద్ రెడ్డికి రూ.3.31 కోట్లు, సురేష్ కుమార్ షెట్కార్ కు రూ.3.83కోట్లు, తాటిపర్తి జీవన్ రెడ్డికి రూ.3.55కోట్లు, ఆత్రం సుగుణకు రూ. 2.00కోట్ల ఆస్తులున్నాయి. హైదరాబాద్ మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీకి రూ.23.87 కోట్ల ఆస్తులున్నాయి.

ఆరుగురే మహిళా అభ్యర్థులు
తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు ఉండగా వారిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లు 1,67,00,574 మంది ఉండగా పురుష ఓటర్లు కేవలం 1,65,13,014 మాత్రమే ఉన్నారు. అంటే 1,72,826 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. తెలంగాణలో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా కేవలం ఆరుగురు మహిళా అభ్యర్థులే ప్రధాన పార్టీల తరపున బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ముగ్గురు మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. బీజేపీ ఇద్దరు మహిళలను ఎన్నికల బరిలోకి దించింది. బీఆర్ఎస్ పక్షాన ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

అభ్యర్థులపై పోలీసు కేసుల పర్వం
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులపై పలు కేసులు ఉన్నాయి. హైదరాబాద్ మజ్లిస్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీపై 5 కేసులు పెండింగులో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల్లో అత్యధికంగా ఈటెల రాజేందర్ పై 54 కేసులు నమోదయ్యాయి. రఘునందన్ రావుపై 29 కేసులు, బీబీ పాటిల్ పై 19 కేసులు, ధర్మపురి అర్వింద్ పై 22 కేసులు, బండి సంజయ్ పై 42 కేసులు, ఆరూరి రమేష్ పై ఆరు కేసులున్నాయి. బూరనర్సయ్య గౌడ్ ,గోమాస శ్రీనివాస్, గోడం నగేష్ లపై ఒక్కో కేసు ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకుల్లో ఆత్రం సక్కుపై అత్యధికంగా 47 కేసులున్నాయి.
నామ నాగేశ్వరరావుపై 2 కేసులు, మాలోతు కవితపై 2, కంచర్ల కృష్ణారెడ్డిపై 2, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై 5 కేసులు, పద్మారావుపై 3, గాలి అనిల్ కుమార్ పై 6కేసులున్నాయి. పి వెంకట్రామిరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డిలపై ఒక్కో కేసు ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆత్రం సుగుణపై అత్యధికంగా 50కేసులున్నాయి. జీవన్ రెడ్డిపై 11 కేసులు, నీలంమధుపై 14, దానం నాగేందర్ పై 7, మహ్మద్ వలివుల్లా సమీర్ పై 4, వంశీచంద్ రెడ్డిపై 3, మల్లు రవిపై 5, చామల కిరణ్ కుమార్ రెడ్డిపై 3కేసులున్నాయి. ఈ కేసులన్నీ అంత తీవ్ర మైనవి కావని పోలీసులు చెబుతున్నారు. గడ్డం రంజిత్ రెడ్డి, సురేష్ కుమార్ షెట్కార్, రఘురాంరెడ్డిపై ఒక్కో కేసు ఉన్నాయి.

కేసుల్లేని అభ్యర్థులు
కొందరు అభ్యర్థులపై ఒక్క కేసు కూడా లేకపోవడం విశేషమే. కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డిపై ఒక్క కేసు కూడా లేదు. బీజేపీ అభ్యర్థులు సైదిరెడ్డి, అజ్మీరా సీతారాం నాయక్, తాండ్ర వినోద్ రావులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొప్పుల ఈశ్వర్, బోయినపల్లి వినోద్ కుమార్, బాజిరెడ్డి గోవర్ధన్, క్యామా మల్లేష్, డాక్టర్ ఎం సుధీర్ కుమార్ లపై కేసులు లేవని వారు సమర్పించిన అఫిడవిట్లలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థుల్లో డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, సునీతా మహేందర్ రెడ్డిలపై ఎలాంటి కేసులు లేవు.


Tags:    

Similar News