ఓల్డ్ సిటీలో రాజుకున్న మరో వివాదం...అసద్, మాధవీలతల మధ్య ఎక్స్ పోస్ట్‌ల వార్

హైదరాబాద్ పార్లమెంట్లో మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ప్రచారంలో మరో వివాదం రాజుకుంది. బీఫ్ షాప్ జిందాబాద్ అంటూ అసద్ చేసిన వ్యాఖ్యలపై మాధవీలత మండిపడ్డారు.

Update: 2024-04-21 12:42 GMT
అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలత ల మధ్య ఎక్స్ పోస్ట్ వార్

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత రామనవమి ఊరేగింపులో మసీదు వైపు బాణం ఎక్కుపెట్టిన వివాదం మరవక ముందే ఓల్డ్ సిటీలో మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ‘రెహాన్ బీఫ్ షాప్ జిందాబాద్’ అంటూ గోవధను ప్రోత్సహించారని మాధవీలత మండిపడ్డారు. బీఫ్ షాపు యజమానిని పొగిడినందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా అసదుద్దీన్ ఒవైసీని తప్పు బట్టారు.


అసలేం జరిగిందంటే...
హైదరాబాద్ మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఓల్డ్ సిటీలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ షాపు వద్ద ఆగి ‘రెహాన్ బీఫ్ షాప్ జిందాబాద్’ అని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఒవైసీ అస్సలాం అలేకుం అని చెప్పి ఎలా ఉన్నావని మాట్లాడారు. దీనిపై ఒవైసీ వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది. రెహాన్ బీఫ్ షాప్ జిందాబాద్ అని కసాయిని పలకరించడం, గోవధను కొనసాగించడాన్ని ప్రోత్సహించడమని మాధవీలత ఆరోపించారు.

గొడ్డు మాంసం తినకూడదని ఫత్వా పాటించరా?

అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ లోక్‌సభ అభ్యర్థి మాధవి లత తప్పుబట్టారు.‘‘అసదుద్దీన్ ఒవైసీ ఎలా బారిస్టర్ అయ్యాడో అర్థం కావడం లేదు..వ్యక్తిగత చట్టం ప్రకారం.. ఫత్వా' అనేది అందరూ పాటించాల్సిన విషయం...గొడ్డు మాంసం తినకూడదని ఫత్వా ఉన్నప్పుడు, అతను ఫత్వాకు ఎలా విరుద్ధంగా వ్యవహరిస్తాడు? గొడ్డుమాంసం కోసుకొని తినేంత ముస్లిమ్ ను మీరు ఓట్లు అడుగుతున్నారా?ముస్లింల జీవితాలను ఎందుకు చిన్నాభిన్నం చేస్తున్నారు?’’ అని మాధవీలత ఎక్స్ లో ప్రశ్నించారు.

వీడియో వైరల్
అసదుద్దీన్ చేసిన జిందాబాద్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్ల నుంచి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. గొడ్డు మాంసం కట్ చేయడం అంటే ఏమిటి? ఓట్లు అడగడానికి అతనికి ఇంకేమీ లేదా?బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రశ్నించారు. 1984 నుంచి గత యాభై ఏళ్లుగా ఏఐఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ ఎంపీ సీటును కైవసం చేసుకునేందుకు అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలత ఇద్దరు అభ్యర్థులు తీవ్రంగా యత్నిస్తున్నారు.

అసద్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ పోస్ట్
బీఫ్ యజమానిని ప్రశంసిస్తూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘‘అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ ప్రకటనలు ఎప్పుడూ అసభ్యకరంగానే ఉంటాయి. ఆయన ఇలాంటి ప్రకటనలు చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యే. అతను కూడా ఇలాంటి విపరీతమైన ప్రకటనలు ఇవ్వడంలో నిపుణుడు, కాబట్టి నేను ఆశ్చర్యపోలేదు’’అని నిర్మలా సీతారామన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


Similar News