దసరా సందర్భంగా వెయ్యికోట్లకు పైగా మద్యాన్ని తాగారు...

తెలంగాణలో దసరా మద్యం కిక్కు వేరయా అంటూ మందుబాబులు పాటలు పాడుకుంటున్నారు. దసరా సందర్భంగా రూ.1000కోట్లకు పైగా మద్యాన్ని తాగారు.

Update: 2025-10-02 10:32 GMT
దసరా పండుగ సందర్భంగా మద్యం కిక్కు

తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఏడు లాగానే ఈ ఏడాది కూడా దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాల జోరు కొనసాగింది. గత నాలుగు రోజుల్లోనే అంటే సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 1వతేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ మద్యం డిపోల నుంచి వెయ్యికోట్లకు పైగా మద్యాన్ని మద్యం దుకాణాలు, బార్ లు, పబ్ ల యజమానులు తీసుకువెళ్లారు. దసరా పండుగకు రెండు రోజుల ముందు రూ.620 కోట్ల మద్యం విక్రయాలు సాగాయి.ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాల రికార్డులు గత సంవత్సరాల కంటే పెరిగాయి.2023వ సంవత్సరంలో దసరా పండుగ 9 రోజుల్లో 1,057 కోట్ల మద్యాన్ని విక్రయించారు. కానీ ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు వెయ్యి కోట్లరూపాయలను దాటాయని అధికారులు చెప్పారు.దసరా పండుగకు ముందు నుంచే విందులు, వినోదాలు సాగాయి.


దసరా మద్యం విక్రయాల కిక్కు వేరయా
ఈ ఏడాది సెప్టెంబరు నెలలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి.సెప్టెంబరు నెలలో 26.71 లక్షల మద్యం కేసులు, 33 లక్షలకు పైగా బీర్లను విక్రయించారు. ఒక్క సెప్టెంబరు నెలలోనే 2,715 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. దసరాకు ముందు సెప్టెంబరు 29వతేదీ ఒక్క రోజే తెలంగాణలో 279 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు.సెప్టెంబరు 30వతేదీన రూ.300 కోట్లకు పైగా మద్యాన్ని విక్రయించినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దసరా పండుగ సెలవులు, స్థానిక ఎన్నికల సమరం ప్రారంభం కావడంతో తెలంగాాణలో విందులు, వినోదాలు జోరందుకున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయడంతో దీనికి ముందే మందుబాబులు మద్యాన్ని కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నారు.బుధవారం రాత్రి వరకు మద్యం విక్రయాల జోరు సాగింది. బుధవారం ఒక్క రోజే రూ.340 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు.

ముందే మద్యం కొనుగోలు
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ వచ్చిందంటే చాలు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి.ఈ ఏడాది దసరా పర్వదినం రోజే అక్టోబరు 2 గాంధీ జయంతి వచ్చినా, మందుబాబులు దసరా పండుగకు ముందే మద్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి దాచుకున్నారు. గత ఏడాది దసరా పండుగ సందర్భంగా పదిరోజుల్లోనే 1,100 కోట్లకు పైగా మద్యాన్ని విక్రయించారు. హైదరాబాద్ నగరంలోని బార్ లు, పబ్ లు, మద్యం దుకాణాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మద్యం విక్రయాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ముందున్నాయి.

పెరిగిన రోజువారీ మద్యం విక్రయాలు
తెలంగాణలో సాధారణ రోజుల్లో రోజుకు 60 నుంచి 90 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు సాగుతుంటాయి. ఈ ఏడాది మద్యం కిక్కు పెరిగింది. ప్రభుత్వ మద్యం డిపోల నుంచి రోజుకు వంద కోట్లరూపాయలకు పైగా మద్యం దుకాణాలకు తరలిపోయినట్లు డిపోల గణాంకాలే చెబుతున్నాయి. దసరా పండుగ సందర్భంగా మద్యం దుకాణాల్లో 40 శాతం అధికంగా మద్యం విక్రయాలు సాగాయని వెల్లడైంది.మద్యానికి డిమాండు పెరగడంతో మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలు కూడా పెంచారు.


Tags:    

Similar News