వేల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కాజేస్తున్న రెండక్షరాలు భూతం, ఎంటది, ఏమాకథ

గ్లోబల్ గా 4.25 లక్షల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు. ఒక్క ఇండియాలో నే 36 వేల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వూడిపోయాయి. ముంచుకొస్తున్న ముప్పు. వివరాలు

Update: 2024-02-10 01:07 GMT
Artificial Intelligence

భారతదేశంలోనూ వేలాది మంది  సాప్ట్ వేర్  ఉద్యోగులపై లేఆఫ్ వేటు పడింది. ఒక లెక్క ప్రకారం 2023లో  36 వేల మంది భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

 పేటీఎం 1000మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన షేర్ ఛాట్ తమ కంపెనీలోని 15 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించింది. గేమ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం లోకో 36 శాతం ఉద్యోగుల లేఆఫ్ ప్రకటించింది. ఎడ్ టెక్ ప్లాట్ ఫాం అడ్డా 247 మంది ఉద్యోగులను, బైజూస్ 5,000మంది ఉద్యోగాలను తొలగించింది. స్టార్టప్ కంపెనీలు కూడా 10,000 మందిపై లే ఆఫ్ వేటు వేశాయి. హోం గ్రౌన్ క్విక్ గ్రాసరీ డెలివరీ ప్రొవైడర్ డుంజో 200 మందిని తొలగించింది.

పలు దేశాల్లో పెద్ద టెక్ సంస్థలు, స్టార్టప్ కంపెనీలు ఏఐ ఎఫెక్ట్ వల్ల ఉద్యోగుల లేఆఫ్ ప్రకటించాయి.ప్రపంచంలో గత ఏడాది 1178 టెక్ కంపెనీల్లో 2,60,771 లక్షల మంది ఉద్యోగులను తొలగించింది.


అమెరికాలోనూ లేఆఫ్‌ల ప్రకటనలు


2022వ సంవత్సరంలో 1061 టెక్ కంపెనీలు 1,64,769 మంది ఉద్యోగులపై తొలగింపు వేటు వేశాయి. తాజాగా యునైటెడ్ పార్సెల్ సర్వీస్ ఇంక్ అనే కంపెనీ 4,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కొత్త టెక్నాలజీ వల్ల 116 సంవత్సరాల చరిత్రలో ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించిందని యునైటెడ్ పార్సెల్ సర్వీస్ ఇంక్ కంపెనీ సీఈఓ కరోల్ టోమ్ చెప్పారు. జాబ్ మార్కెట్‌లో ఉద్యోగార్థులకు కృత్రిమ మేధస్సు ముప్పుగా మారింది. ఏఐ సాంకేతికతను నేరుగా లింక్ చేయడం ద్వారా ఉద్యోగాల కోత విధించవచ్చునని టెక్ ఏఐ నిపుణులు చెబుతున్నారు. ఏఐ సహాయంతో ఎక్కువ పనిచేయవచ్చని పెట్టుబడిదారులు కూడా చెబుతున్నారు.


కారణం ఎవరు?

రెండక్షరాల భూతం. ఏఐ. అంటే ఆర్టిపిషల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence). అంటే కృత్రిమ  మేధస్సు.

కృత్రిమ మేధస్సు అంటే...

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అనేది టాస్క్‌లను నిర్వహించడానికి మానవ మేధస్సును అనుకరించే సాంకేతికత. ఏఐ అనేది మానవుల్లా ఆలోచించి, పని చేయడానికి చేసిన ప్రోగ్రామ్.ఈ యంత్రాలు మానవ మేధస్సును అనుకరిస్తాయి. ఏఐ అనేది కంప్యూటర్, కంప్యూటర్-నియంత్రిత రోబోట్ లేదా సాఫ్ట్‌వేర్‌ను మానవ మనస్సు వలె తెలివిగా ఆలోచించేలా చేసే పద్ధతి. ఏఐ టెక్నాలజీ నిపుణుల భర్తీ ద్వారా పలువురు ఉద్యోగులను శాశ్వతంగా తొలగించవచ్చని ఓ కంపెనీ సీఈఓ అభిప్రాయపడ్డారు. బ్లాక్ రాక్ ఇంక్ అనే మరో అమెరికన్ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. 

సాఫ్ట్‌వేర్ పరిశ్రమ రంగంలో నాటకీయ మార్పులు

ఏఐ సాంకేతికతతో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ రంగంలో నాటకీయ మార్పులు వస్తున్నాయని బ్లాక్ రాక్ ఇంక్ కంపెనీ సీఈఓ లారీ ఫింక్, కంపెనీ ప్రెసిడెంట్ రాబ్ కపిటో సిబ్బందికి జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు. పరిశ్రమలో ఉత్సాదకతను టర్బోచార్జ్ చేయడానికి ఏఐ సంభావ్యతపై నమ్మకం ఉందని లారీ ఫింక్ స్పష్టం చేశారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎంతమంది ఉద్యోగాలను తొలగిస్తారో ఖచ్చితంగా చెప్పడానికి నిపుణులు కసరత్తు చేస్తున్నారు.

ఏఐ ఉద్యోగుల నియామకం కోసమే లేఆఫ్‌లు

ఏఐ కొత్త టెక్నాలజీలో అనుభవం ఉన్న ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలో ప్రస్థుతం పనిచేస్తున్న ఉద్యోగులను తొలగింపు తప్పని సరి అని అవుట్ ప్లేస్ మెంట్ సంస్థ ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ ఇంక్ చెబుతున్నాయి. గత ఏడాది మే నెల నుంచి అమెరికాలో ఏఐలో అనుభవం ఉన్న వ్యక్తులను నియమించుకోవడానికి యూఎస్ కంపెనీలు 4,600 మంది ఉద్యోగులను తొలగించాయని యూఎస్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ ఛాలెంజర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎక్కువ మంది ఉద్యోగాలు ఊడిపోయాయని ఛాలెంజర్ పేర్కొన్నారు.

ఏఐ నిపుణుల నియామకానికి కంపెనీల కసరత్తు

తమ కంపెనీలో ఖాళీలను త్వరలో ఏఐ నిపుణులతో భర్తీ చేస్తామని ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పోరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కృష్ణ చెప్పారు. ఏఐ సాంకేతిక ప్రభావంతో పలు కంపెనీల్లో ఉద్యోగాల కోతలు చాలా నిశ్శబ్దంగా జరుగుతున్నాయని సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సీఈఓ జానీ టేలర్ చెప్పారు. పలు టెక్ కంపెనీలు కొత్త ఉద్యోగ నియామకాలను గణనీయంగా తగ్గించాయి. రాబోయే మూడు సంవత్సరాల్లో కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఓ కంపెనీ ప్రతినిధి చెప్పారు.

ఉద్యోగాల కోతలే కాదు...కొత్త నియామకాలకు బ్రేక్

ఏఐ ప్రభావం వల్ల పలు సాంకేతిక పరిశ్రమల్లో ఉద్యోగాల కోతలు విధించారు. హోమ్‌వర్క్ హెల్ప్ సైట్ చెగ్, ప్రోగ్రామర్ హెల్ప్ సైట్ స్టాక్ ఓవర్‌ఫ్లో వంటి కొన్ని కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. ఫైల్-స్టోరేజ్ సర్వీస్ డ్రాప్‌బాక్స్ వంటి ఇతర కంపెనీలు కొత్త సాంకేతికతపై దృష్టి సారించడానికి పోటీ పడుతున్నాయి. ఏఐ నైపుణ్యం ఉన్నవారిని కొత్తగా ఉద్యోగాల్లో నియమించడం కోసం సిబ్బందిని విడిచిపెట్టాయి. ఐబీఎం తర్వాత కొన్ని కంపెనీలు ఏఐతో ఉద్యోగాల కోతలకు ముడిపెట్టాయి. క్లర్నా ఇంక్, ఒపెన్ ఏఐ యొక్క ఛాట్ జీపీటీ వంటి వాటివల్ల కొన్ని టాస్క్ లు తీసుకునే సమయాన్ని తగ్గిస్తున్నాయి. తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయవచ్చని, అందుకే తాము కొత్త ఉద్యోగ నియామకాలను స్తంభింపజేశామని ఓ కంపెనీ సీఈఓ సెబాస్టియన్ సిమియాట్కోవ్స్కీ చెప్పారు.

లేఆఫ్ తర్వాత ఏఐ నిపుణుల నియామకాలకు ఉద్యోగ ప్రకటనలు

ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలు రక్షణ రంగంలో ఏఐ‌ని విస్తృతంగా వాడటం మొదలు పెట్టాయని, దీనివల్ల ఉద్యోగాల కోత తప్పడం లేదని అమెరికా దేశంలో పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తుమ్మల ఉమాపతి చెప్పారు. అమెరికా దేశంలో పలు కంపెనీల్లో ఉద్యోగాల కోత మొదలైంది. ‘‘ప్రస్తుతం ఏఐ డెవలపర్ ఉద్యోగుల నియామకం కోసం ప్రకటనలు పెరిగాయి, ఏఐ సంబంధిత ఉద్యోగాలు పెరిగాయి, వారికి వేతనాలు కూడా మిగిలిన వారికంటే ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాలో ప్రస్తుతం ఏఐ డెవలపర్లకు వేతనాలు ఎక్కువగా ఉండటంతో అమెరికన్ కంపెనీలు ఏఐ ఉద్యోగులను ఇండియాలోనే ఎక్కువగా నియమించుకుంటున్నాయి’’అని తుమ్మల ఉమాపతి వివరించారు.

ఇజ్రాయల్ ఆర్మీ ఏఐ యాప్‌

గాజా‌లోని హమాస్ సొరంగాల ఆచూకీ కనిపెట్టేందుకు ఇజ్రాయల్ ఆర్మీ ఏఐ యాప్‌ను వాడుతున్నదని వార్తలు వచ్చాయి. వారి వద్ద ఈపాటికే అటువంటి ఒక యాప్ సిద్ధంగా ఉన్నది అంటే ఇజ్రాయెలీలు ఒక సంవత్సరం కిందటి నుంచే ఏఐ‌ను డెవలప్ చేశారని చెప్పవచ్చునని యూఎస్ సీనియర్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తుమ్మల ఉమాపతి పేర్కొన్నారు. చైనా కూడా తమ క్షిపణుల పని తీరు, ఖచ్చితత్వాన్ని మెరుగు పర్చేందుకు ఏఐ‌ని వాడుతుంది. ఏఐతో కూడిన అణ్వస్త్రాన్ని ఒక సారి ప్రయోగిస్తే అనర్ధాలకు దారి తీస్తుందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఐటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆందోళన

కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోతపై హైదరాబాద్ ఐటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకు రుణాలు తీసుకొని ఇళ్లు, కార్లు కొని ఈఎంఐలు కడుతున్న ప్రస్థుత తరుణంలో ఉద్యోగం నుంచి తొలగిస్తే తామెలా జీవనం సాగిస్తామని సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఆవేదనగా చెప్పారు. లేఆఫ్‌ల ఆందోళనతో తాము సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూనే ఇతర స్కిల్స్ పెంచుకోవడానికి శిక్షణ పొందుతున్నట్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగి షేక్ ఆరిఫ్ చెప్పారు. మారుతున్న ఆటోమేషన్ రంగం వల్ల తాము ఇతర ఉద్యోగాలు చూసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మరో ఉద్యోగి బొజెడ్ల నరేష్ వ్యాఖ్యానించారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు స్కిల్స్ పెంచుకోవాలి

సాఫ్ట్‌వేర్ రంగంలో కృత్రిమమేధ, ఆటోమేషన్ వల్ల పలు కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు అప్రమత్తమై ఇతర స్కిల్స్‌ను పెంచుకోవాలని హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య టి తిరుపతిరావు సూచించారు. ఏఐ వల్ల 100 మంది ఉద్యోగులు చేసే పని ఒక్క మెషీన్ చేస్తుందని ఆయన చెప్పారు. కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు అడ్వాన్సు టెక్నాలజీలో శిక్షణ పొందాలని కోరారు.

మల్టీటాస్కింగ్‌తో ఒక ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వస్తుంది...

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నాలెడ్జ్,ఇన్నోవేషన్స్ పై దృష్టి సారించాలని ఆయన సలహా ఇచ్చారు. నిరంతర లెర్నింగ్ ద్వారా ఉద్యోగులకు ఒక ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వస్తుందని మాజీ వీసీ చెప్పారు. కంపెనీలు లే ఆఫ్‌లు ప్రకటిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మల్టీటాస్కింగ్ పనులు చేయాలని కోరారు. ఉద్యోగాల కోత నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఉద్యోగాలు కోల్పోయిన వారికి సోషల్ సేఫ్టీనెట్ కల్పించాలని ప్రొఫెసర్ తిరుపతిరావు డిమాండ్ చేశారు.

ఇపుడు ఉద్యోగాలను తీసేస్తున్నా, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉద్యోగాలను తీసుకొస్తుందని ఫ్రొఫెసర్ తిరుపతి రావు చెప్పారు.

Tags:    

Similar News