బాలినేని మళ్లీ బాంబేశాడు!

ఏమైంది బాలినేని? ఏమిటీ కిరికిరి! ఉన్నట్టుండి మళ్లీ బాంబు పేల్చారెందుకు? వైసీపీలో ఉండాలనా, పోవాలనా? తాజాగా చేసిన బాలినేని వ్యాఖ్యలు దేనికి సంకేతం?

Update: 2023-12-10 04:36 GMT
బాలినేని శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)

బాలినేని శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనమే. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా.. అయినోళ్లయినా, పరాయోళ్లయినా సరే.. ఎవర్నీ వదిలిపెట్టడు. ఏదీ దాచుకోడు.. కడుపులో ఉన్నది ఉన్నట్టు కక్కేయాల్సిందే. బీఆర్ఎస్ ఓడిపోతుందని 50 లక్షల పందెం కాశాడటా..

జగన్ దగ్గరి బంధువే...

ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి చాల దగ్గరి బంధువు. వైఎస్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డికి భావమరిది. జిల్లా రాజకీయాల్లో సీనియర్‌ నేత. కొంతకాలంగా వైఎస్ జగన్ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. శనివారం రాత్రి ఒంగోలులో ఏదో ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడ ఆయనన్న మాటలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

వైసీపీని వీడతారా..

వైసీపీలో ఉండాలనుకుంటున్నారో లేక జనసేనలో చేరాలనుకుంటున్నారో అర్థమయ్యీ కానట్టూ కామెంట్ చేశారు. ఆమధ్య ఓరోజు హైదరాబాద్ నుంచి హుటాహుటిన తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. అక్కడేమైందో తెలియదు గాని ఆ తర్వాత విజయమ్మను కలిశారు. తాను పోటీ చేయబోయే సీటు విషయమా లేక కుటుంబంలో వచ్చిన తేడాల విషయమో బోధ పడలేదు. ఇప్పుడు తాజాగా తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. ప్రస్తుత రాజకీయాలంటే తనకు, తన కుటుంబానికీ వెగటు పుడుతోందన్నారు. ఈ మాటలు నియోజకవర్గంలో మంటలు పుట్టిస్తున్నాయి. ఒంగోలు సీటును జగన్ ఇవ్వనని ఎక్కడా చెప్పకపోయినా ఈయన ఈ మాటలు ఎందుకన్నారన్నది అంతుచిక్కడం లేదు. వైసీపీ అధిష్ఠానంతో బాలినేని సావాసం చెడిందా లేక ఈయనే పక్కకు తప్పుకోవాలనుకుంటున్నారో తెలియడం లేదు. “జగన్‌పై మాకు అపారమైన ప్రేమ ఉన్నా.. మాపైన ఆయనకు ఉండొద్దా” అంటూ ఒంగోలులో అన్న మాటల వెనుక మర్మమేమిటో తెలియాల్సి ఉంది.

మా అబ్బాయికీ ప్రేముండాలిగా...

హైదరాబాద్ లో కాపురం, ఒంగోలులో స్థావరం ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్మొహమాటి. మెట్ట ప్రాంతం నుంచి రావడం వల్ల ఆ మట్టి వాసనలు ఇంకొ పోలేదు. అందువల్లనే ఏమో తాను తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ కట్టానని ఏ రాజకీయ నాయకుడైనా చెబుతారా... బాలినేని మాత్రమే చెప్పారు. “తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వస్తుందని ఊహించా. రూ.50 లక్షలు పందెం కూడా కాశా. అక్కడ బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే ఇక్కడ వైసీపీ గెలుస్తుందనే భావనలో ఉన్న మా అబ్బాయి చెప్పాడని డబ్బు వచ్చే అవకాశం ఉన్నా పందెం నుంచి తప్పుకొన్నా. మాకు జగన్‌ అంటే అంత ప్రేమ. ఆయనకు కూడా ఉండాలిగా, ఉండాలనే కోరుకుంటున్నా“ అన్నారు బాలినేని. అంటే దీనర్థం జగన్ కు ఈయనపై ప్రేమ లేదనా? తెలంగాణలో బీఆర్ఎస్ ఓడింది గనుక ఆంధ్రాలో వైసీపీ ఓడుతుందనా? ఏమైనా బాలినేని వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు తావిస్తున్నాయి.

మీరు పని చేస్తానంటే పోటీ చేస్తా..


బాలినేని తన కుమారుడు ప్రణీత్‌రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని గట్టిగానే అనుకుంటున్నారు. అందరూ ఓకే అంటే కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది ఆయన కోరికగా ఉన్నట్టుంది. ఇదే సమయంలో ఆయన కార్యకర్తలపై కూడా ఒకింత చిరుకోపాన్ని ప్రదర్శించారు. ’ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, కనీసం ఓట్ల జాబితాలను కూడా చూడడం లేదు, అలాంటప్పుడు పోటీ చేసినా ఉపయోగమేమీ ఉండదంటూనే తనకు పోయేదేమీ లేదని తేల్చిచెప్పారు. ఐదుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రినయ్యా, నాకు పోయేదేమీలేదని’ దెప్పిపొడిచారు.

మంత్రినైనా నాకూ ఖర్చులుంటాయిగా...

వైసీపీ అధికారంలోకి వచ్చాక బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన, ఆయన కుమారుడి పేరు పలు వివాదాల్లో వినిపించింది. భూ ఆక్రమణలు, నగదు లావాదేవీలు, ప్రైవేటు సెటిల్మెంట్లలో ఆరోపణలు వచ్చాయి. విమర్శలు వచ్చాయి. వీటిని తట్టుకోలేక ఆయన ఓ సందర్భంలో తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కన్నీళ్లు తుడుచుకుంటూనే.. ’నేను నీతిమంతుడ్ని అని చెప్పను. మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం డబ్బులు తీసుకున్నా. నాకూ ఖర్చులుంటాయి కదా’ అని నిజాన్ని ఒప్పేసుకున్నారు. ఇలా బాలినేని ఏమాటన్నా అది సంచలనమే. అదే దారిలో ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Tags:    

Similar News