ఆరోగ్యంగానే ఉన్నా..బీజేపీకి బీజేడీ చీఫ్ కౌంటర్

తన ఆరోగ్యంపై బీజేపీ అసత్య ప్రచారాన్ని ఒడిశా సీఎం తిప్పికొట్టారు. ఇంతకు నవీన్ పట్నాయక్‌కు విశ్రాంతి అవసరమని అనిందెవరు?

Update: 2024-05-24 12:16 GMT

తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఒడిశా ముఖ్యమంత్రి, బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ చెప్పారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు.

పట్నాయక్ ఆరోగ్యం, వృద్ధాప్యం దృష్ట్యా ఆయనకు విశ్రాంతి ఇవ్వాలన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలకు ఒడిశా సీఎం కౌంటర్ ఇచ్చారు.

“అబద్ధాలకు ఓ హద్దుంటుంది. దాన్ని బీజేపీ దాటేసింది. మీరు గమనించే ఉంటారు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నెలల తరబడి రాష్ట్రమంతటా ప్రచారం చేస్తున్నా.” అని 77 ఏళ్ల పట్నాయక్ పేర్కొన్నారు.

పట్నాయక్ తన వీడియో సందేశాలలో కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారని కొందరు బీజేపీ నేతలు ఆరోపించారు. వీటిపై కూడా ప్రతిస్పందిస్తూ.. కాషాయ పార్టీ నేతలు తమ సొంత తెలివితేటలను ఉపయోగించాలని ఎద్దేవ చేశారు.

‘కించపరిచేవాళ్లకు జనమే బుద్ధిచెబుతారు’

పట్నాయక్ సన్నిహితుడు, బ్యూరోక్రాట్ నుంచి BJD నాయకుడిగా మారిన VK పాండియన్ బీజేపీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు. జనాదరణ పొందిన ముఖ్యమంత్రిని కించపరచేలా మాట్లాడటాన్ని ఒడిశా ప్రజలు సహించరని పేర్కొన్నారు.

ఒడిశా అసెంబ్లీకి శనివారం జరగనున్న మూడో రౌండ్ పోలింగ్ లో బీజేడీ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

“మనది పరిణతి చెందిన ప్రజాస్వామ్యం. ఓట్ల కోసం గొప్ప నాయకులను కించపరచడం దురదృష్టకరం. చరిత్ర వారిని క్షమించదు. సిఎంను అగౌరవపర్చేలా మాట్లాడటం బిజెడి ఓట్ల శాతాన్ని మెరుగుపరచుకోవడానికి దోహదం చేస్తుంది.'' అని పాండియన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బీజేపీ వాదనపై పాండియన్ స్పందించారు. 147 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 30 స్థానాలపైనే కాషాయ పార్టీ దృష్టిసారించిందని చెప్పారు.

Tags:    

Similar News