తెలంగాణలో వలస నేతలకే బీజేపీ టికెట్లు

తెలంగాణలో బీజేపీ రెండో జాబితాలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే టికెట్లు ఖరారు చేశారు. ఆరు సీట్లలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా వారంతా వలస నేతలు కావడం విశేషం.

Update: 2024-03-13 14:23 GMT
Telangana BJP Leaders

భారతీయ జనతా పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన రెండో జాబితాలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే టికెట్లు ఖరారు చేశారు.తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిన నేతలకు టికెట్లు ఖరారు చేస్తూ బీజేపీ అధిష్ఠాన వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సంపాదించి మూడో సారి నరేంద్రమోదీని ప్రధాన మంత్రిని చేయాలనే లక్ష్యంతో కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన నలుగురు నేతలకు బీజేపీ టికెట్లు ఇచ్చారు. దీనిపై గత కొంత కాలంగా బీజేపీలో పనిచేస్తున్న సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.


ఆదిలాబాద్ పార్లమెంటు బరిలో...
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ గొడం నగేష్ ను బీఆర్ఎస్ పార్టీ నుంచి రప్పించి కాషాయం కండువా కప్పిన మూడు రోజుల్లోనే టికెట్టు ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న బీజేపీ గోండు వర్గానికి చెందిన గొడం నగేష్ ను బరిలోకి దించడం ద్వారా విజయం సాధించాలని వ్యూహం పన్నింది. ఆదిలాబాద్ బీజేపీ టికెట్టు ఆశించిన సిట్టింగ్ ఎంపీ సోయంబాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ లు తీవ్ర అసంతృప్తి జ్వాలలతో రగులుతున్నారు. పార్టీలో ఉన్న తమను కాదని బీఆర్ఎస్ పార్టీ నేతకే టికెట్టిస్తారా అని వారు అలకబూనారని సమాచారం.

కిషన్ రెడ్డి చొరవతో సీతారాం నాయక్ కు టికెట్టు
మహబూబ్ నగర్ ఎస్టీ రిజర్వుడ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ ను బీజేపీ బరిలోకి దించింది. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఢిల్లీకి పిలిపించి ఆయనకు కేంద్ర నేతలతో కాషాయ కండువా కప్పి ఎన్నికల బరిలోకి దించారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డిని నల్గొండ ఎంపీ బరిలో దించారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సైదిరెడ్డి కమలం పార్టీలో చేరిన మూడు రోజులకే టికెట్ దక్కించుకున్నారు.

డీకే అరుణకు టికెట్టు ఖరారు
మరో వైపు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ రాజకీయ మార్పులతో గతంలోనే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్రస్థుతం మాజీ కాంగ్రెస్ నాయకురాలైన డీకే అరుణను ఎన్నికలబరిలోకి దించారు. దీంతో మరో సీనియర్ నాయకుడైన జితేందర్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు.

మెదక్ బరిలో రఘునందన్ రావు
మెదక్ పార్లమెంటు బరిలో మాజీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావును దించారు. రఘనందన్ రావు గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి, ఆపై బీజేపీ తీర్థం స్వీకరించారు. గతంలో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచారు. పెద్దపల్లి పార్లమెంట్ బరిలో బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ ను రంగంలోకి దించారు. మొత్తం మీద బీజేపీ ఇతర పార్టీల్లో బలమైన అభ్యర్థులకు కాషాయ కండువా కప్పి వారికే బీజేపీ టికెట్లు ఇవ్వడంపై కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వలస నేతలు పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధిస్తారా? లేదా అనేది ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News