హర్యానా: బీజేపీ చరిత్రాత్మక విజయం, కాంగ్రెస్ తప్పిదాలే గెలిపించాయి!

ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పినా, పదేళ్ళుగా అధికారంలో ఉండటంవలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం బాగా ఉంటుందని అన్నా బీజేపీయే విజయం సాధించింది.

Update: 2024-10-08 12:28 GMT

హర్యానాలో బీజేపీ చరిత్ర సృష్టించింది. వరసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టి, హర్యానా గడ్డను తమ అడ్డాగా చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తుందని చెప్పినా, పదేళ్ళుగా అధికారంలో ఉండటంవలన బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం బాగా ఉంటుందని ఎందరో వ్యాఖ్యానించినా చివరికి బీజేపీ విజయం సాధించటం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతానికి బీజేపీ 40 స్థానాలలో విజయం సాధించి, మరో 8 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, కాంగ్రెస్ 31 స్థానాలలో విజయం సాధించి, మరో 6 స్థానాలలో లీడింగ్‌లో ఉంది. ఆప్ తన ఖాతానే తెరవలేదు.

2024 మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో హర్యానాలోని మొత్తం పది స్థానాలలో ఐదింటిని బీజేపీ, మిగిలిన ఐదు కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్ చూస్తే, బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకంటే మెరుగవ్వగా, కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయినట్లు స్పష్టమవుతోంది. ఆరు నెలల్లోనే ఇలా ఎందుకు జరిగిందనేది ఇప్పడు చర్చనీయాంశం.

వాస్తవానికి పదేళ్ళుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్నట్లు బీజేపీ నాయకులే ఒప్పుకున్నారు. అందుకే, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, బీజేపీ కేంద్ర నాయకత్వం గత మార్చినెలలో, తొమ్మిదిన్నర ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్‌ను తొలగించి నయాబ్ సింగ్ సైనిని సీఎంగా చేశారు. మరి ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ ఎందుకు ఓట్లుగా మలుచుకోలేకపోయిందన్నదే ఇప్పుడు ప్రశ్న. దానికి కొన్ని కారణాలు ఇప్పుడు కనబడుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ కులాల సమీకరణాలను నమ్ముకుంది. జాట్‌లు అధికంగా ఉండే హర్యానాలో జాట్ కాని తన స్నేహితుడు మనోహర్ లాల్ ఖట్టర్‌ను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు నరేంద్ర మోది. జాట్‌లలో దీనిపై కినుక ఉంది. అందుకే జాట్‌లు, దళితులు, ముస్లిమ్‌లను సంఘటితం చేసి విజయాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే నాన్ జాట్ ఓట్లన్నీ బీజేపీవైపు సంఘటితమయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ ఓటు శాతం గతంలోకంటే మెరుగైనప్పటికీ, పట్టణ ప్రాంతాలలో బీజేపీ బలంగా బాగుంది.

కిసాన్, జవాన్, పహిల్వాన్ వర్గాలలో ప్రభుత్వంమీద ఉన్న తీవ్ర వ్యతిరేకత తమకు బాగా కలిసొస్తుందని హస్తం నేతలు అంచనా వేసుకున్నారు. అయితే అది పెద్దగా ప్రభావం చూపినట్లు కనబడలేదు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధాలు కూడా ఓటమికి కారణని చెబుతున్నారు. భూపీందర్ సింగ్ హుడాకు, కుమారి సెల్జాకు మధ్య కలహాలు వార్తలలో తరచూ ప్రముఖంగా వచ్చేవి. టిక్కెట్ల ఎంపికలో జాట్ నేత, మాజీ ముఖ్యమంత్రి అయిన భూపీందర్ సింగ్ హుడాకు కాస్త ఎక్కువగానే ప్రాధాన్యం ఇవ్వటమే కొంప ముంచిందని అంటున్నారు. ఆయన తన జాట్ వర్గానికే అత్యధికంగా టిక్కెట్లు ఇచ్చుకుంటూ పోయారని, దళిత కాంగ్రెస్ నేత కుమారి సెల్జాను పక్కన పెట్టారని, ఆమె తన వర్గానికి కేవలం తొమ్మిది టిక్కెట్లు మాత్రమే ఇప్పించుకోగలిగారని చెబుతున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీని దూరం చేసుకోవటంకూడా కాంగ్రెస్ కు మైనస్ అయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్ ఎంతో కొంత చీల్చుకుంది. మరోవైపు కేజ్రీవాల్ కు పట్టణ ప్రాంతాలలో మంచి ఆదరణ ఉంది కనుక ఆప్ పార్టీ కాంగ్రెస్‌తో ఉంటే ఓట్ల శాతం తప్పకుండా మెరుగయ్యేదని అంటున్నారు. అసలు ఆప్‌తో పొత్తు చివరి క్షణంలో రద్దయిందని, కాంగ్రెస్ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ వలనే ఇది జరిగిందని చెబుతున్నారు. రాహుల్ గాంధి అమెరికా వెళ్ళబోతూ ఆప్‌తో ఎలాగైనా పొత్తు ఖరారు చేయమని సీనియర్ నేతలు రాఘవ్ చద్దా, కేసీ వేణుగోపాల్‌లకు చెప్పారట. అయితే ఆప్ 20 సీట్లు అడిగి, చివరికి 5 సీట్లకు దిగినా, భూపీందర్ సింగ్ హుడా ఆ ఐదు సీట్లు తామే ఎంపికచేసి ఇస్తామని అనటంతో ఆప్ దూరమయింది.

ఐఎన్ఎల్‌డీ, బహుజన్ సమాజ్ పార్టీ, దుష్యంత్ చౌతాలాకు చెందిన జన్‌నాయక్ జనతాపార్టీ(జేజేపీ) వంటి చిన్న పార్టీలు కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఇవి అన్నీ చీల్చటం బీజేపీకి కలిసొచ్చింది.

మరోవైపు బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో తమ ఓట్ల శాతం తగ్గినప్పటినుంచి అప్రమత్తమే, మైక్రో లెవల్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్ళింది. గుర్‌గావ్, ఫరీదాబాద్ వంటి అర్బన్ ప్రాంతాలలో తమ ఓట్లతోపాటు, గ్రామీణ ప్రాంతాలలోని తమ ఓట్లను కూడా నిలుపుకోగలిగింది. దీనిలో ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని పాత్ర కీలకమని చెబుతున్నారు. అందుకే ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశం ఉంటుందంటున్నారు.

Tags:    

Similar News