సినీనటీ,నటుల ప్రచార హోరు..అభ్యర్థులకు కురిపించేనా ఓట్ల జోరు

తెలంగాణ ఎన్నికల పర్వంలో టాలీవుడ్ నటీనటుల ప్రచార హోరు సాగుతోంది.ఓటర్లు వస్తున్నా,వారి ప్రచారం అభ్యర్థులకు ఓట్ల వర్షం కురిపిస్తోందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Update: 2024-05-08 06:38 GMT
Tollywood actors Election campaign

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రంగంలోకి టాలీవుడ్ నటీనటులు దిగారు. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల ప్రచారానికి సినీ గ్లామర్ జోడించింది. టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్, ప్రముఖ సినీ నటీమణులు దివ్యవాణి, ఖుష్బూ వివిధ పక్షాల తరపున ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీనటీనటులకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నా, వారు ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు ఎంతమంది ఓట్లు వేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.


ఖమ్మంలో వియ్యంకుడి కోసం విక్టరీ వెంకటేష్ ప్రచారం
ప్రముఖ సినీహీరో దగ్గుబాటి వెంకటేష్ తన వియ్యంకుడైన ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి పక్షాన రోడ్ షో నిర్వహించారు. వెంకటేష్ తన కూతురు ఆశ్రితను రఘురామ్ రెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డికి ఇచ్చి గతంలో వివాహం జరిపించారు. వెంకటేష్ కుమార్తె అయిన ఆశ్రిత గత కొన్ని రోజులుగా తన మామగారి తరపున కోసం ప్రచారం చేస్తోంది. ‘‘భద్రాచలంలో శ్రీరాముడున్నాడు...ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో రఘురాముడున్నాడు...రఘురాముడికి ‘విక్టరీ’ అందించండి’’ అంటూ తన వియ్యంకుడి పక్షాన సినీనటుడు దగ్గుబాటి వెంకటేష్ ఓటర్లను కోరారు. తన వియ్యంకుడిని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని విక్టరీ వెంకటేష్ ఓటర్లను అభ్యర్థించారు.

మొదటిసారి ప్రచారబరిలోకి దిగిన వెంకటేష్
టాలీవుడ్ నటుడు వెంకటేష్ నిర్వహించిన రోడ్‌షోలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తనను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా గుమికూడిన ప్రజలకు వెంకీమామ చేతులు ఊపుతూ రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణలోని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసిన తొలి టాలీవుడ్ నటుడిగా వెంకటేష్ నిలిచారు. వెంకటేష్ ప్రచారం తమ పార్టీకి ఓట్లు తెచ్చి పెడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోట్ల నాగేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఎన్టీఆర్, ఎంజీఆర్ జమానాలో సినిమా వాళ్లకు క్రేజ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ , తమిళనాడులో ఎంజీఆర్ జమానాలో సినిమావాళ్లకు క్రేజ్ ఉండేదని వారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆయా రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడ్డారు. కానీ నేటి తరం హీరోలు సమాజానికి ఏం చేశారని సామాజిక విశ్లేషకుడు, లైఫ్ గురు జి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.

ఎన్నికల్లో సినీ గ్లామర్ పనిచేయదు : సినీజర్నలిస్ట్ గుళ్లపూడి శ్రీనివాస కుమార్
తెలంగాణ ఎన్నికల్లో సినీ గ్లామర్ పనిచేయదని, ఈ విషయం గతంలో పలుసార్లు నిరూపితం అయిందని సినీజర్నలిస్ట్ గుళ్లపూడి శ్రీనివాస కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ లకు ఉన్న క్రేజ్ ఇప్పటి తరం సినీనటీనటులకు లేదని ఆయన పేర్కొన్నారు. సినీనటులు కూడా అందరిలాంటివారేనని, వాళ్లు కూడా ప్రజల బాగు కోసం చిత్తశుద్ధిగా పనిచేయడం లేదని ఓటర్లకు తెలిసిపోయిందని ఆయన చెప్పారు. సినిమా నటీనటులను చూసేందుకు ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు వస్తారే తప్ప వారంతా నటులు చెప్పిన పార్టీకి, అభ్యర్థికి ఓటు మాత్రం వేయరని శ్రీనివాసకుమార్ స్పష్టం చేశారు. గతంలో ఎన్నికల్లో పోటీచేసిన పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లోనూ పరాజయం పాలయ్యారు. యువతలో ఎంతో ఫాలోయింగ్ ఉన్న చిరంజీవికి కూడా ఆశించిన మేర ప్రజాదరణ లభించలేదని గత ఫలితాల్లో తేలిందని శ్రీనివాసకుమార్ చెప్పారు.

బీజేపీ పక్షాన ఖుష్బూ ప్రచారం
తెలంగాణలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన ఖుష్బూ ముమ్మర ప్రచారం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పక్షాన ప్రచారంలో పాల్గొన్నారు. మరో వైపు మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ తరపున ప్రచారం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత తరపున ఓట్లు అభ్యర్థించారు. ఖుష్బూ ప్రచారంలో ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. సినీ గ్లామరుతో పాటు డైలాగులతో బీజేపీకి ఓటేసి మరోసారి మోదీని ప్రధాన మంత్రిని చేయాలని కోరారు.

దివ్యవాణి ప్రచారం
కాంగ్రెస్ పార్టీ తీర్థం స్వీకరించిన సినీనటి దివ్యవాణి కాంగ్రెస్ ప్రచార సభల్లో మాట్లాడుతూ ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన దివ్యవాణి ఇటీవల జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన కాంగ్రెస్ బహిరంగసభలో ప్రసంగించి ఓటర్లను అలరించారు.పంచులతో డైలాగులు పేలుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు.

సినీ గ్లామర్‌కు ఓట్లు రాలవు : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి
తెలంగాణలో సినీనటుల ప్రచారానికి ఓట్లు రాలవని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సినీనటుల ప్రచారం వల్ల ప్రచార ఆర్భాటం తప్ప, వారు ఓటర్లను ప్రభావితం చేయలేరని ఆయన చెప్పారు. సాధారణంగా సినిమా నటులు ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు జనం వారిని చూసేందుకు ఎగబడుతున్నారు కానీ వారంతా నటులు చెప్పిన అభ్యర్థికి ఓటేసే పరిస్థితి ఉండదని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గతంలో కల్వకుర్తిలో ఎన్టీఆర్ అంతటి ప్రముఖ నటుడే ఓటమి చూశారనే విషయం మర్చిపోరాదని ఆయన వివరించారు. సినీనటుల ఎన్నికల ప్రచారంతో హైప్ క్రియేట్ అవుతుంది, తప్ప ఓట్లు రావని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రచారానికి దూరం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేయాలని భావించిన పార్టీ టికెట్ దక్కక పోవడంతో విజయశాంతి ప్రచారంలో పాల్గొన లేదు. మరో వైపు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన ప్రముఖ సినీనటి రాధిక కూడా తెలంగాణలో ప్రచారానికి రాలేదు. తమిళనాడులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాధిక తెలంగాణ ప్రచారంలో మాత్రం పాల్గొనలేదు.

చేవెళ్ల బరిలో దిగిన సినీనటి దాసరి సాహితీ 

చేవెళ్ల బరిలో దిగిన సినీనటి సాహితీ
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బరిలో ‘పొలిమేర’ సిరీస్ చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందిన సినీనటి దాసరి సాహితి బరిలోకి దిగారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా సాహితీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పొలిమేర, పొలిమేర-2 చిత్రాలతో సాహితీ నటన సినీ ప్రేక్షకలను మెప్పించింది. తొలి భాగంలో గెటప్‌ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఆమె సీక్వెల్‌లో రాజేశ్‌తో కలిసి నటించారు. చేవెళ్లలో తనను గెలిపించాలని కోరుతూ సాహితీ ప్రచారం చేస్తున్నారు.
మొత్తం మీద తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పలువురు సినీతారలు పాల్గొంటున్నా, వారు ఓట్ల వేటలో సఫలీకృతులవుతారో లేదో, వారు ఇచ్చిన పిలుపు మేర ఓటర్లు ఓట్లు వేస్తారో లేదో జూన్ 4వతేదీన ఎన్నికల ఫలితాల్లో వెల్లడి కానుంది.


Tags:    

Similar News