భారీవర్షాల నేపథ్యంలో పంట నష్టంపై సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణలో ఆదివారం పలు జిల్లాల్లో కురిసిన భారీవర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సమీక్షించారు.సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కోరారు..

Update: 2024-05-12 14:07 GMT
Telangana CM Revanth Reddy

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం భారీవర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షం, పిడుగుల వల్ల సంభవించిన పంట నష్టంపై ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి అధికారులను ఆరా తీశారు.

- భారీవర్షాల వల్ల జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు.
- తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించిన దృష్ట్యా అత్యంత అప్రమత్తంగా ఉండాలని పలు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

సహాయ చర్యలు చేపట్టండి : సీఎం ఆదేశం
రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. భారీవర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సీఎం కోరారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖ‌ల అధికారులు, సిబ్బంది తగిన స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టాలని కోరారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈవీడీఎం హెచ్చరిక జారీ చేసింది.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం చెప్పారు. పిడుగుపాటు ఘటనల్లో క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపడి ఓ రైతు మరణించగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు చెప్పారు.

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం
కొనుగోలు కేంద్రాల వద్ద కురుస్తున్న వర్షాలతో వరి నిల్వలు తడిసిపోతే ఆందోళన చెందవద్దని సీఎం రైతులకు హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని తేమ శాతంతో కొనుగోలు చేయాలని అధికారులను కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

పిడుగు పాటుకు రైతు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో పొలంలో పని చేస్తున్నకిరణ్ కుమార్ అనే రైతు (29) పిడుగుపాటుతో మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పిడుగుపాటుతో గ్రామానికి చెందిన అక్కడికక్కడే మృతి చెందాడు. గిమ్మ గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా పిడుగుపాటుతో కాలిన గాయాలయ్యాయి. వారిని ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు.

మాజీ ఎమ్మెల్యే క్షతగాత్రులకు పరామర్శ
ఆదిలాబాద్‌ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న గాయపడిన రైతులను పరామర్శించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్‌ అధికారులను కోరారు. ఈదురు గాలులు, పిడుగుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని రామన్న సూచించారు. రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇళ్లకే పరిమితం కావాలని రామన్న కోరారు.


Tags:    

Similar News