హై డ్రామా మధ్య కేసీఆర్‌ను కలిసిన ఆరూరి రమేష్

వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరికలో హైడ్రామా చోటుచేసుకుంది. రమేష్ కోసం బీజేపీ యత్నిస్తుండగా, పార్టీ మారకుండా బిఆర్ ఎస్ నేతల అడ్డు

Update: 2024-03-13 13:11 GMT
Aroori Ramesh

వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బుధవారం బీజేపీలో చేరిక వ్యవహారంలో హైడ్రామా చోటుచేసుకుంది. మొత్తంమీద తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆరూరి రమేష్ బుధవారం రాత్రి ప్రకటించారు. తాను బీజేపీలోకి చేరుతున్నాననేది ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ‘ఫెడరల్ తెలంగాణ’కు స్పష్టం చేశారు.  గత డిసెంబరు నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ ఓటమి పాలయ్యారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి అభ్యర్థిగా పార్లమెంటులో బరిలోకి దిగేందుకు రమేష్ ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరిగింది. 

బీఆర్ఎస్ అధిష్ఠానం ఎంపీ టికెట్ తేల్చక పోవడంతో బీజేపీలోకి జంప్ చేసి కమలం గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగాలని ఆరూరి రమేష్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో బీజేపీ నేతలతోనూ రమేష్ సంప్రదింపులు జరిపారని కమలం నేతలు చెబుతున్నారు. అంతా చర్చలు ముగిశాక బీజేపీలోకి చేరడం ఫైనల్ అయిన తర్వాత బుధవారం విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి విషయం చెబుదామని భావించారు.

రంగప్రవేశం చేసిన ఎర్రబెల్లి
అంతలో సీనులోకి మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రంగప్రవేశం చేసి ఆయన హన్మకొండలోని ఆరూరి రమేష్ ఇంటికి వచ్చి అతన్ని బుజ్జగించేందుకు హైదరాబాదుకు తీసుకు వెళుతున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు కారులో రమేష్ ను కేసీఆర్ ను కలిపేందుకు తీసుకువెళుతుండగా పెంబర్తి వద్ద బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.



పెంబర్తి వద్ద అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ను వాహనం లో నుంచి బయటకు లాగారు. రమేష్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో వెళ్ళొద్దంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలు చేశారు. బీజేపీలో చేరాలంటూ మాజీ ఎమ్మెల్యే రమేష్ ను బీజేపీ కార్యకర్తలు వేడుకున్నారు. బీజేపీ కార్యకర్తలు బలవంతంగా రమేష్ ను కారులో నుంచి కిందకు లాగడంతో అతని చొక్కా చిరిగిపోయింది. అనంతరం బీజేపీ కార్యకర్తలు రమేష్ తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో మాట్లాడించారు. బీజేపీ కార్యకర్తలు రమేష్ ను బీజేపీ నేతల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు.

కేసీఆర్‌తో ఆరూరి రమేష్ భేటి
అనంతరం ఆరూరి రమేష్ బుధవారం హై డ్రామా మధ్య ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పసునూరి దయాకర్, ఇతర ఉమ్మడి వరంగల్ జిల్లాల బీఆర్ఎస్ నేతలతో కలిసి కేసీఆర్ తో ఆరూరి రమేష్ చర్చించారు. వరంగల్ ఎంపీ బరిలో బీఆర్ఎస్ పక్షాన తాను పోటీ చేయనని రమేష్ చెప్పారు. ఆరూరి రమేష్ చివరి క్షణంలో మనసు మార్చుకొని బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగి పార్లమెంటు బరిలో పోటీ చేస్తారని చెబుతున్నారు.
ఫ్లాష్ ఫ్లాష్...
తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, తాను  ఎంపీ బరిలోకి దిగనని బుధవారం రాత్రి ఏడు గంటలకు ఆరూరి రమేష్ ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధితో చెప్పారు. కానీ అనంతరం ఆరూరి రమేష్ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ వెళ్లేందుకు విమానం టికెట్ బుక్ చేసుకున్నారని, అతను బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్టుపై వరంగల్ బరిలోకి దిగుతారని ఆరూరి రమేష్ కీలక అనుచరుడు హరీష్ రెడ్డి చెప్పారు. 



 నాటకీయ పరిణామాలు...

కాగా మరికొందరు రమేష్ కమలం గూటికి చేరడం ఖాయమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంమీద ఆరూరి రమేష్ పార్టీ జంపింగ్ వ్యవహారంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని ఆరూరి రమేష్ కేసీఆర్ సమక్షంలో ప్రకటించడం కొసమెరుపు. మరో వైపు తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరిలని ఆరూరి రమేష్ వారి ముందే అదినేత కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.

నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు: రమేష్
నన్నెవరూ కిడ్నాప్ చేయలేదని ఆరూరి రమేష్ చెప్పారు. పార్టీలో చేరికల విషయంలో ఆరూరి రమేష్ కోసం బీఆర్ఎస్, బీజేపీ గొడవ పడుతున్నాయి. తాను అమిత్ షాను కలవలేదని రమేష్ కేసీఆర్ సమక్షంలో ప్రకటించారు. తాను బీజేపీలో చేరడం లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని రమేష్ ప్రకటించారు.


Tags:    

Similar News