100వ పుట్టినరోజు జరుపుకున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఈయనే!
ఇప్పుడు 100వ ఏట ఆయనకున్న కోరిక ఏమిటంటే, ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న తన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు ఓటు వేసి చనిపోవాలి అని.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ నెల 1వ తేదీన తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీనితో ఆయన ఒక రికార్డ్ స్థాపించారు. సుదీర్ఘకాలం జీవించిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు అయ్యారు. నోబుల్ శాంతి పురస్కారం కూడా అందుకున్న కార్టర్, ఇవే కాకుండా తన శతవసంతాల జీవితంలో ఎన్నో రికార్డులు స్థాపించారు. ఇప్పుడు 100వ ఏట ఆయనకున్న కోరిక ఏమిటంటే, ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న తన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు ఓటు వేసి చనిపోవాలి అని.
డెమోక్రటిక్ పార్టీకి చెందిన కార్టర్ 1977 నుంచి 1981 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. పరిపాలనాపరంగా ఆయనకు చాలా తక్కువ మార్కులు లభించాయి. అందుకే ఈమధ్య డొనాల్డ్ ట్రంప్ తన ఒకానొక ఎన్నికల ప్రచారసభలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను విమర్శిస్తూ, ఈయన పని తీరు కార్టర్ కంటే దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్రంగా పెరగటం, గ్యాసొలిన్ కొరత ఏర్పడటం, 52 మంది అమెరికన్లను తీవ్రవాదులు 444 రోజుల సుదీర్ఘకాలం ఇరాన్‌లో నిర్బంధించటం వంటి పరిణామాల కారణంగా కార్టర్‌కు బాగా చెడ్డపేరు వచ్చింది. అందుకే 1981లో జరిగిన ఎన్నికలో ఆయన తిరిగి ఎన్నిక కాలేకపోయారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన రొనాల్డ్ రీగన్ ఆయనను ఘోరంగా ఓడించి అధ్యక్షుడయ్యారు.
అయితే ఆయన తన హయాంలో కొన్ని ఘనకార్యాలు కూడా సాధించారు. పనామా కెనాల్ ఒప్పందం, బద్ధ శత్రువులైన ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య శాంతికోసం చరిత్రాత్మక క్యాంప్ డేవిడ్ ఒప్పందం కుదరటానికి మధ్యవర్తిత్వం చేశారు. అధ్యక్ష పదవినుంచి వైదొలగిన తర్వాత 1982లో తన భార్య రోసలిన్‌తో కలిసి కార్టర్ సెంటర్ అనే సేవాసంస్థను ప్రారంభించారు. మానవహక్కుల పరిరక్షణ, గినియా వార్మ్ వ్యాథి వ్యాప్తి నిరోధించటం, ఇథియోపియా, సూడాన్, ఉగాండా వంటి ఘర్షణాత్మక ప్రాంతాలలో శాంతిస్థాపన వంటి విషయాలపై ఎంతో కృషి చేశారు. దీనికే ఆయనకు 2002లో నోబుల్ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఎన్నో దేశాలలో ఎన్నికల పర్యవేక్షకుడిగా పని చేశారు. వీటన్నింటికంటే ముఖ్యంగా, 70పైగా దేశాలలో పేదలకు గృహవసతి కల్పించటానికి పనిచేసే హ్యాబిటెట్ ఫర్ హ్యుమానిటీ అనే స్వచ్ఛందసంస్థ తరపున దాదాపు 40 ఏళ్ళు విశేషంగా పాటుబడ్డారు. అంతర్జాతీయ అంశాలపై అనేక పుస్తకాలు రాశారు. వీటిలో ముఖ్యంగా ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణపై రాసిన రెండు పుస్తకాలు బాగా పేరు గాంచాయి. పాలస్తీనాపట్ల ఇజ్రాయెల్ వైఖరిని ఈ రెండు పుస్తకాలలో కార్టర్ తీవ్రంగా విమర్శించారు.
కార్టర్ జార్జియా రాష్ట్రంలో పుట్టారు. అమెరికా నేవీలో పని చేశారు. అక్కడ సర్వీస్ పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగివచ్చి తండ్రి చేసే వేరుశెనగ సాగులోకి దిగారు. 1962లో రాజకీయాలలో ప్రవేశించారు. జార్జియా రాష్ట్రంనుంచి రెండు సార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 1970లో జార్జియా గవర్నర్ పదవిని అలంకరించారు. 1974నుంచి దేశాధ్యక్ష పదవికోసం డెమోక్రటిక్ పార్టీలో పోటీ పడ్డారు. 1977 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అప్పటి అమెరికా అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్‌ను ఓడించి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు.
2015లో బ్రెయిన్ క్యాన్సర్ వ్యాధిబారిన పడ్డారు. గత ఏడాది ఫిబ్రవరినుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 77 సంవత్సరాలపాటు జీవిత భాగస్వామిగా ఉన్న ఆయన భార్య రోసలిన్ గత ఏడాది నవంబర్‌లో చనిపోయారు.