హర్యానా, కశ్మీర్‌ ఎగ్జిట్ పోల్స్: బీజేపీకి శృంగభంగం, కాంగ్రెస్‌దే హవా!

కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి ఎన్నిక ఇదే కావటం గమనార్హం. హర్యానాలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేపట్టబోతోంది.

Update: 2024-10-05 14:59 GMT


హర్యానా, కశ్మీర్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలనుబట్టి చూస్తే, బీజేపీకి రెండుచోట్లా పెద్దదెబ్బే తగిలినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్ స్పష్టమైన మెజరిటీ సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలూ చెప్పాయి. మరోవైపు కశ్మీర్‌లో బీజేపీ మంచి స్థానాలే సంపాదించినా, మెజారిటీ మాత్ర కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికే దక్కుతుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి ఎన్నిక ఇదే కావటం గమనార్హం. మరోవైపు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం, హర్యానాలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేపట్టబోతోంది.

హర్యానా

హర్యానాలో బీజేపీకి 21, కాంగ్రెస్ పార్టీకి 59 వస్తాయని మ్యాట్రిజ్ సర్వే సంస్థ, బీజేపీకి 24, కాంగ్రెస్ పార్టీకి 49 వస్తాయని పీపుల్ పల్స్ సంస్థ, బీజేపీకి 27, కాంగ్రెస్‌కు 57 వస్తాయని ధృవ్ రీసెర్చ్, బీజేపీకి 31, కాంగ్రెస్‌కు 56 వస్తాయని పీ మార్క్ సంస్థ పేర్కొన్నాయి.

ఇక్కడ ముఖ్యమంత్రి రేసులో భూపేందర్ హుడా, కుమారి సెల్జా, రణ్‌దీప్ సుర్జేవాలా ఉన్నారు. గత దశాబ్దకాలంగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వ పాలనలో అవినీతి పెరిగిపోవటం, శాంతిభద్రతలు క్షీణించటం వంటి కారణాలరీత్యా కాంగ్రెస్‌కు పట్టం కట్టారని ఆ పార్టీ సీనియర్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా చెప్పారు.

కశ్మీర్

ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి, వీటితో పాటు బీజేపీ, పీడీపీ కూడా ప్రధాన పక్షాలుగా బరిలో ఉన్నాయి.

జేకేఎన్‌సీ-కాంగ్రెస్ కూటమికి 48, బీజేపీ 25, పీడీపీ 9 వస్తాయని పీపుల్స్ పల్స్ సంస్థ, జేకేఎన్‌సీ కూటమికి 44, బీజేపీ 30, పీడీపీ 9 వస్తాయని సీ ఓటర్, జేకేఎన్‌సీ కూటమికి 34, బీజేపీకి 29, పీడీపీ 6 వస్తాయని గులిస్తాన్ న్యూస్, జేకేఎన్‌సీ కూటమికి 35-40, బీజేపీకి 20-25, పీడీపీకి 4-7 వస్తాయని దైనిక్ భాస్కర్ చెప్పాయి.

Tags:    

Similar News