దేశంలోనే మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రి...మన హైదరాబాదీ
దేశంలోనే మొదటి ముస్లిం మహిళా మంత్రిగా పనిచేసిన ఘనత మన హైదరాబాదీ మాసుమా బేగంకు దక్కింది.పద్మశ్రీ పురస్కారం అందుకున్న మాసుమా మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు.
By : The Federal
Update: 2024-05-02 03:12 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రి పదవిని పొందిన మొదటి ముస్లిం మహిళగా మాసుమా బేగం రికార్డుల్లోకి ఎక్కారు. భారతదేశంలో మంత్రిగా పనిచేసిన మొదటి ముస్లిం మహిళ మాసుమా బేగం 1902వసంవత్సరంలో రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో జన్మించారు. ఆమె తండ్రి ఖాదీఫ్ జంగ్ ప్రభుత్వ అధికారి. ఆమె తల్లి త్యాబా బేగం బిల్గ్రామి బాగా చదువుకున్న మహిళ. ఆమె హైదరాబాద్‌లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు. అనంతరం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారు.
సామాజిక సేవకురాలు...
1922వ సంవత్సరంలో మాసుమా బేగం తన కుటుంబానికి దగ్గరి బంధువు అయిన హుస్సేన్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఖాన్ ప్రగతిశీల ఆలోచనలతో బాగా చదువుకున్న పండితుడు.దీంతో మాసుమా బేగం సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. నాడు మహిళల్లో విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో స్థాపించిన అంజుమన్ అనే సంస్థకు ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు.
సామాజిక సేవల నుంచి రాజకీయాల్లోకి...
మాసుమాబేగం హైదరాబాద్ నగరంలో పలు విద్యాసంస్థలు, సామాజిక సేవ, మహిళా సంక్షేమ సంస్థలను స్థాపించారు. సామాజిక సేవ పట్ల ఆమెకున్న అంకితభావం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. జాతీయ, అంతర్జాతీయ మహిళా, సామాజిక సంస్థల్లో పలు కీలకమైన పదవులను నిర్వహించారు. నాడు స్త్రీ వాదిగా కుటుంబ నియంత్రణను సమర్ధించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మాసుమా బేగం బురఖా ధరించడం వదిలేశారు. పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడే మాసుమా బేగం బురఖాకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ముస్లిం మహిళల హక్కుల కోసం మాసుమా పోరాడారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి సన్నిహితురాలిగా మాసుమా బేగం పేరొందారు.
ఎన్నెన్నో సంస్థల్లో క్రియాశీలక పాత్ర
హైదరాబాద్‌లోని పలు స్వచ్ఛంద సంస్థల్లో మాసుమా బేగం క్రియాశీలక పాత్ర పోషించారు. ఒక ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు అధ్యక్షురాలిగా మాసుమాబేగం నియమితులయ్యారు. రెడ్ క్రాస్, లేడీ హైదరీ క్లబ్, అంజుమాన్-ఎ-ఖవాతీన్ అనే సంస్థతో సహా అనేక ప్రభుత్వేతర సంస్థల బోర్డుల్లో ఆమె పనిచేశారు
విదేశీ సదస్సులకు...
1955లో కొలంబోలో జరిగిన ఇంటర్నేషనల్ అలయన్స్ ఆఫ్ ఉమెన్ గోల్డెన్ జూబ్లీకి ప్రతినిధి బృందానికి మాసుమాబేగం నాయకత్వం వహించారు. 1959లో ఆమె జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి యొక్క ప్రభుత్వేతర సంస్థల రెండవ కాన్ఫరెన్స్‌లో మధ్యంతర కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. యుగోస్లేవియా, ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ స్త్రీవాద సమావేశాలకు కాంగ్రెస్ ప్రతినిధులకు నాయకత్వం వహించారు.
రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యురాలిగా ఎన్నిక
మాసుమా బేగం రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1952వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాసుమాబేగం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 10,153 ఓట్లతో విజయం సాధించారు. తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి ఎం మొహినుద్దీన్ ను ఓడించి మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగు పెట్టారు. 1957వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫత్తర్ ఘట్టి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవ సారి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో 7,411 ఓట్లు సాధించి తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి ఎ హసన్ పై విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సేవలు...
1957వ సంవత్సరంలో మాసుమా బేగం కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ డిప్యూటీ లీడర్‌గా నియమితులయ్యారు. అంతర్జాతీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ మెంబర్‌గా కూడా ఆమె పని చేశారు. ఆ తర్వాత 1960వ సంవత్సరం నుంచి 1962 వరకు అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నేతృత్వంలోని మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమం, ముస్లిం వక్ఫ్ శాఖ మంత్రిగా పనిచేశారు.
1974లో పద్మశ్రీ పురస్కారం
భారతదేశంలో మంత్రిగా పనిచేసిన తొలి ముస్లిం మహిళగా మాసుమా బేగం చరిత్ర సృష్టించారు. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు 1974వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. మహిళలు,పేద ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మాసుమా బేగం 1990వ సంవత్సరంలో మరణించారు.
మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రిగా మాసుమాబేగం అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని 50 ఏళ్ల గీటురాయి వారపత్రిక వ్యవస్థాపక ఎడిటర్ మల్లిక్ వ్యాఖ్యానించారు.